SOURCE :- BBC NEWS

రేసు మార్గం

ఫొటో సోర్స్, Adam Wild

“నా చిన్నతనంలో ఆటల్లో చురుకుగా ఉండేదాన్ని కాదు. 14 ఏళ్ల వయస్సులో క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలో చివరి స్థానంలో నిలిచాను” అని నలభై నాలుగేళ్ల లూసీ గోసేజ్‌ గుర్తుచేసుకున్నారు.

తాజాగా ఆమె అత్యంత కష్టమైన మోంటేన్ వింటర్ స్పైన్ రేస్ మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.

పీక్ డిస్ట్రిక్ట్‌లోని ఎడాల్‌లో మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య మెుదలైన అల్ట్రామారథాన్‌లో లూసీ సహా 150 మంది పోటీలో పాల్గొన్నారు. బ్రిటన్ లోని డెర్బీషైర్ నుంచి స్కాట్‌లాండ్ వరకు జరిగిన 430 కిలోమీటర్ల ఈ రేసును లూసీ 87 గంటల 41 నిమిషాల 38 సెకన్లలో పూర్తిచేశారు.

మూడున్నర రోజుల పరుగులో ఆమె కేవలం మూడు గంటల 40 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పారు.

ఇప్పటికే 14-సార్లు ఐరన్‌మాన్ చాంపియన్ గా నిలిచిన లూసీకి ఇది మరో పెద్ద విజయం.

ఐరన్‌మాన్ పోటీ అనేది శారీరక, మానసిక శక్తికి కఠినమైన పరీక్ష. ఈ ట్రైఅథ్లాన్‌లో 3.8 కిలోమీటర్ల ఈత, తర్వాత 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల పరుగు పోటీలు ఉంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఫొటో సోర్స్, Adam Wild

అత్యంత క్రూరమైన, కఠినమైన మోంటేన్ వింటర్ స్పైన్ రేస్ మహిళల విభాగంలో44 ఏళ్ల లూసీ గోసేజ్‌ విజేతగా నిలిచారు.

ఫొటో సోర్స్, Adam Wild

నాటింగ్‌హామ్‌కు చెందిన లూసీ 2014లో ప్రొఫెషనల్ ట్రైఅథ్లెట్‌గా మారడానికి ముందు ఓ క్యాన్సర్ వైద్యురాలు .కేంబ్రిడ్జ్ లాబొరేటరీలలో కిడ్నీ క్యాన్సర్‌పై పరిశోధన చేశారు. ఆమె 34 ఏళ్ల వయస్సులో పూర్తిగా ఐరన్‌మాన్ ట్రైఅథ్లెట్‌గా మారారు.

గత ఏడాది ఇదే ఈవెంట్‌లో లూసీ మూడో స్థానంలో నిలిచారు.

మనకు అసాధ్యం అనిపించే, భయపెట్టే పనులు చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుంది. సాధారణంగా జీవితంలో మనం ఎప్పటికీ వెళ్లని ప్రదేశాలకు, పరిస్థితులకు ఈ రేసు తీసుకెళుతుంది. మన ఆలోచన అంతా మనుగడ గురించే ఉంటుంది. అయితే, రేసులో నేను ఇలా ఇలాంటి ప్రదర్శన ఎలా చేశానో నాకే తెలియదు. ఇది నేను ఊహించినది కాదు. నేనే ఆశ్చర్యపోయా” అని లూసీ అన్నారు.

రేసులో పాల్గొనేవారు తమకు కావాల్సినప్రతి వస్తువును వారే స్వయంగా తమ వెంట తీసుకెళ్లాలి. పోటీలో పాల్గొన్నవారిలో సగం మంది మధ్యలోనే వెళ్లిపోయారని నిర్వాహకులు తెలిపారు.

మార్గమధ్యంలో ఐదు చెక్‌పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ అథ్లెట్‌లు తినడానికి, నిద్రపోవటానికి, విశ్రాంతి తీసుకుకోవడానికి అవకాశం ఉంటుంది. లూసీ సహా చాలా మంది అథ్లెట్‌లు ప్రత్యామ్నాయ ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోవడాన్ని ఎంచుకున్నారు .

నాటింగ్‌హామ్‌కు చెందిన లూసీ అథ్లెట్‌గా మారడానికి ముందు ఆంకాలజిస్ట్ గా పని చేశారు.

ఫొటో సోర్స్, Adam Wild

“నేను ఓ గ్రామంలోని ఒక హాల్‌లో ఒక గంట పాటు, ఇంకోసారి ఓ పబ్లిక్ టాయిలెట్‌ నేలపై ఒక గంట, కొన్ని కుర్చీలు, మురికి దుప్పట్లు ఉన్న ఓ పొలంలోని పాత గదిలో 40 నిమిషాలు గడిపాను. కొంత సేపు మాత్రమే నిద్రపోయినా, ఆ కాసేపు విశ్రాంతి 12 గంటలపాటు ఎలా శక్తినిస్తుందనేది నిజంగా నమ్మశక్యం కాని విషయం” అని ఆమె చెప్పారు.

“కొన్ని చోట్ల మీరు చాలా అలసిపోతారు, నొప్పులతో బాధ పడతారు. పోటీ ముగించాలనుకుంటారు. కానీ ఇలాంటి అడ్డంకులే మనం పోటీలో ఎందుకు పాల్గొంటున్నామో గుర్తు చేస్తాయి. వాటిని అధిగమించినప్పుడే కొత్త శిఖరాలను చేరుకుంటారు” అని లూసీ అన్నారు.

” రేసు తర్వాత నా కండరాలన్నీ బిగుసుకుపోయాయి. బట్టలు కూడా ధరించలేకపోయాను “అని ఆమె చెప్పారు.

ఈ ఈవెంట్‌లో మళ్లీ పాల్గొనాలనే ఆలోచన లేదని, అయితే భవిష్యత్తులో “ఇతర సవాళ్లు’’ తనను ప్రభావితం చేయవచ్చని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)