SOURCE :- BBC NEWS
డిసెంబరు 19 మధ్యాహ్నం.. ఖానౌరీ సరిహద్దుల్లో వేదికపై సాగుతున్న నిరసనలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. క్షణాల్లో వేదిక మొత్తం ఖాళీ అయింది. డాక్టర్లు సహా వైద్యబృందం మొత్తం పరుగులు తీసింది. ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని అక్కడున్న అందరికీ అర్థమైంది.
కొందరు కోపంగా కనిపించారు. మరికొందరు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత వేదికపైనుంచి గుర్బాణి వినిపించడం మొదలయింది. అందరూ అక్కడ చేరి డల్లేవాల్ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
మధ్యాహ్నం భారతీయ కిసాన్ యూనియన్(సిద్ధూపుర్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకా సింగ్ కోట్రా వేదికపైనుంచి మాట్లాడారు. డల్లేవాల్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. ”జగ్జీత్ సింగ్ డల్లేవాల్ రక్తపోటు బాగా పడిపోయింది. కొంతసేపు ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది” అని కోట్రా చెప్పారు.
ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులను అడ్డుకుంటామని వారు చెప్పారు.
రైతు ఉద్యమాల్లో డల్లేవాల్ ప్రయాణం
కేన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ 70 ఏళ్ల జగ్జీత్ సింగ్ డల్లేవాల్ రైతు ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా మారారు.
ఫరీద్కోట్ జిల్లా డల్లేవాల్‌కు చెందిన జగ్జీత్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్(సిద్ధూపుర్) రాష్ట్ర అధ్యక్షుడు. యునైటెడ్ కిసాన్ మోర్చా(రాజకీయేతర విభాగం) నాయకుడు.
1982-83 నుంచి డల్లేవాల్ రైతు సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవారని కోట్రా చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా డల్లేవాల్ రైతు సంఘాలకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
జాతీయస్థాయిలో జరిగిన అనేక పోరాటాల్లో జగ్జీత్ సింగ్ డల్లేవాల్ కీలకపాత్ర పోషించారు.
డల్లేవాల్‌కు 17 ఎకరాల పొలం ఉంది. రైతుల పోరాటాల సమయాల్లో అనేకమార్లు ఆయన జైలుకు వెళ్లారు.
ఈ ఏడాది జనవరి 27న ఆయన భార్య మరణించారు. డల్లేవాల్‌కు కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉన్నారు.
వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో డల్లేవాల్ పాత్ర ఏంటి?
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళనల సమయంలో జగ్జీత్ సింగ్ డల్లేవాల్ జాతీయస్థాయిలో కీలక రైతు నాయకుడిగా ఎదిగారు.
ఆ ఉద్యమం సమయంలో అనేకమంది రైతు నాయకులు ఏదో ఒక రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు.
కానీ డల్లేవాల్ మాత్రం ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు.
గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రైతు సంఘాల నాయకులను డల్లేవాల్ బహిరంగంగానే వ్యతిరేకించారు.
డల్లేవాల్ ఆమరణ నిరాహారదీక్ష రైతుల పోరాటానికి మళ్లీ ఎలా ఊపిరిలూదింది?
‘కిసాన్ ఆందోళన్ -2.0’ పేరుతో 2024 ఫిబ్రవరి 13న చలో దిల్లీకి కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త్ కిసాన్ మోర్చా(రాజకీయేతర) పిలుపునిచ్చాయి.
రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ పోరాటానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
కానీ రైతుల కాన్వాయ్‌ను పంజాబ్-హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీ దగ్గర నిలిపివేశారు.
ఆ సమయంలో రైతులకు, అధికారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈ ఘర్షణల్లో శుభకరణ్‌సింగ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది యువకులు, రైతులు గాయపడ్డారు.
గత 9 నెలలుగా రైతుల పోరాటం కొనసాగుతోంది. అయితే నవంబరు 26 నుంచి జగ్జీత్ సింగ్ డల్లేవాల్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో మరోసారి రైతుల పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది.
జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష రైతు ఉద్యమానికి కొత్త ఊపిరిలూదిందని యాక్టివిస్ట్ బల్దేవ్ సింగ్ సిర్సా చెప్పారు. రాజకీయ నాయకులు, మత పెద్దలు ఉద్యమానికి మద్దతిస్తున్నారని తెలిపారు.
డల్లేవాల్ ఆమరణ నిరాహారదీక్ష వల్ల ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగిందని, చాలా చోట్ల స్థానికులు రైళ్ల అడ్డగింతకు పిలుపునిచ్చారని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ చెప్పారు.
అప్పుడు శంభు.. ఇప్పుడు ఖనౌరీ
కిసాన్ ఆందోళన్ 2.0 ప్రారంభమైన తొలినాళ్లలో శంభు సరిహద్దు పోరాటానికి కేంద్రప్రాంతంగా ఉండేది.
డల్లేవాల్ ఎప్పుడైతే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారో అప్పటినుంచి మొత్తం మారిపోయింది.
రైతుల ట్రాక్టర్లు ఖనౌరీ సరిహద్దు దగ్గర 4 నుంచి 5 కిలోమీటర్ల మేర బారులు తీరాయి.
డల్లేవాల్ ఆమరణ నిరాహారదీక్షతో ప్రభావితమై ఖనౌరీకి వచ్చామని అక్కడకు వచ్చిన యువత చెప్పారు.
”అంత పెద్దాయన ఆమరణ నిరాహారదీక్ష చేస్తోంటే…మనం ఏదో ఒకటి ఎందుకు చేయలేం”? అని పాటియాలా జిల్లాకు చెందిన యువకుడు సుఖ్‌చైన్ సింగ్ అన్నారు.
ఖనౌరీ సరిహద్దులో ఉన్న రైతుల ఆందోళన ఏంటి?
ప్రభుత్వం జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్ష భగ్నం చేస్తుందేమోనని ప్రస్తుతం ఖనౌరీ సరిహద్దు దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు భయపడుతున్నారు.
చాలా సందర్భాల్లో పోలీసులు ఆమరణ దీక్ష చేస్తున్న వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తుంటారు. డల్లేవాల్ను కూడా నవంబరు 26 ఉదయం పోలీసులు లూథియానాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రైతులు నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు విడుదల చేశారు.
జైళ్లలో ఉన్న సిక్కుల విడుదల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సురత్ సింగ్ ఖల్సాను లూథియానాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో 8 ఏళ్ల పాటు ఉంచారు.
జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా చెప్పారు.
చివరి ఆయుధంగా ఆమరణ దీక్ష
డల్లేవాల్ పూర్వీకులు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందినవారని.. వారు ఫరీద్కోట్ వచ్చి స్థిరపడ్డారని భారతీయ కిసాన్ యూనియన్ నేత బోహర్ సింగ్ బీబీసీ పంజాబీతో చెప్పారు.
ప్రాథమిక విద్యను ఫరీద్‌కోట్‌లో పూర్తిచేసిన డల్లేవాల్, పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు.
గురుసిక్ కుటుంబానికి చెందిన డల్లేవాల్ యువకుడిగా ఉన్నప్పుడు సిక్ స్టూడెంట్ ఫెరడరేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని బోహర్ సింగ్ తెలిపారు.
డల్లేవాల్ ప్రస్తుతం భారతీయ కిసాన్ యూనియన్ సిధ్ధూపూర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
గత 40 ఏళ్లగా తన తండ్రి రైతు ఉద్యమాల్లో పనిచేస్తున్నారని.. డల్లేవాల్ కుమారుడు గుర్పీందర్ సింగ్ బీబీసీ జర్నలిస్ట్ అవతార్ సింగ్‌తో చెప్పారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అవతార్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
రైతుల సమస్యలపై గతంలో ఐదుసార్లు ఆమరణ నిరాహారదీక్ష చేసిన జగ్జీత్ సింగ్ డల్లేవాల్ పరిష్కారాలు సాధించడంలో విజయవంతమయ్యారు. ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం ఇది ఆరోసారి.
డల్లేవాల్ మొదట పోరాటాలు చేస్తారని, ప్రభుత్వం, పోలీసులతో సంఘర్షణ వాతావరణం ఏర్పడితే నిరశన దీక్షతో ప్రతిస్పందిస్తారని బోహర్ సింగ్ చెప్పారు.
అన్నాహజారేతో అనుబంధం
2018లో అన్నాహజారే దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో మరోసారి అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంబించినప్పుడు డల్లేవాల్ ఆమరణ నిరాహారదీక్ష చేశారు.
ఆ సమయంలో దీక్ష విరమించాల్సిందిగా డల్లేవాల్ను అన్నా హజారే కోరినప్పపటికీ ఆయన నిరాకరించారు. స్వామినాథన్ కమిషన్ సూచనలు అమలు చేస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే డల్లేవాల్ తన దీక్ష విరమించారు
అన్నాహజారే ఉద్యమంలో డల్లేవాల్ నేరుగా పాల్గొకపోయినప్పటికీ, వాళ్లిద్దరూ కలిసి చేసినట్టుగా అది మారిందని బోహర్ సింగ్ చెప్పారు.
రైతు అనుకూల సంస్థల ఉమ్మడి కూటమిలో డల్లేవాల్ సంస్థ, ఆరెస్సెస్ భాగంగా ఉన్నాయి. ఆరెస్సెస్ మాజీ నేత శివ్ కుమరార్ కక్కాతో కలిసి ఆయన రైతు పోరాటాల్లో పాల్గొన్నారు. దీంతో డల్లేవాల్ను కొందరు ఆరెస్సెస్ వ్యక్తిగా చెబుతుంటారు. అయితే డల్లేవాల్ ఆ విమర్శలను ఖండిస్తుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)