SOURCE :- BBC NEWS

కార్తిక్ శర్మ, వీర్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/instagram.com/prashant_ritik12

ఒక గంట క్రితం

అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 ఆటగాళ్ల వేలంలో కొంత మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు చెల్లించిన ధర క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఈసారి పెద్ద అంతర్జాతీయ ఆటగాళ్లకు బదులుగా, రికార్డు స్థాయిలో డబ్బు సంపాదించి చరిత్ర సృష్టించిన భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు (భారత జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనివాళ్లు) పతాక శీర్షికలలో నిలిచారు.

కొత్త ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఆటగాళ్ల కోసం పోటీ కూడా తీవ్రంగా జరిగింది. కొంతమంది ఆటగాళ్లను ఎవరూ కొనలేదు.

ఇప్పటివరకు జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరున్ గ్రీన్ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఐపీఎల్ వేలం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరానా, అబుదాబి, కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక పేసర్ పతిరనకు రూ. 18 కోట్లు

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరనను కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.

రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేయగా వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.7 కోట్లకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌తో వేలం మొదలైంది. అయితే అతన్ని ఎవరూ కొనలేదు. దీని తర్వాత, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరానా, అబుదాబి, కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ప్రశాంత్ వీర్, కార్తీక్ ‌శర్మకు రూ. 14 కోట్లు

అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.20 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. అలాగే కార్తీక్ శర్మను రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఏ అన్‌క్యాప్డ్ ఆటగాడికీ ఇంత భారీ మొత్తం లభించలేదు.

జమ్మూ కశ్మీర్‌కు చెందిన అకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

లక్నో సూపర్ జెయింట్స్ ముకుల్ చౌధురిని రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది. నమన్ తివారీని కూడా లక్నో సూపర్ జెయింట్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.

మంగళవారం జరిగిన వేలంలో 369 మంది ఆటగాళ్ల కోసం బిడ్‌లు దాఖలయ్యాయి.

గ్రీన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ యుద్ధం జరిగింది. చివరికి షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఆల్ రౌండర్‌ను రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కామెరున్ గ్రీన్ నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కామెరున్ గ్రీన్, మరో ఆస్ట్రేలియన్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు

మిచెల్ స్టార్క్‌ను 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరానా, అబుదాబి, కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, instagram.com/prashant_ritik12

ప్రశాంత్ వీర్ ఎవరు?

యువ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ యూపీ టీ ట్వంటీ లీగ్‌లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ ఏడాది అతని ఆటతీరు నిలకడగా ఉంది.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రశాంత్ వీర్ ఆటతీరుపై ప్రశంసలు కురిశాయి.

ఈ టోర్నీలో అతని ప్రదర్శన చూసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్‌పై ఫోకస్ పెట్టింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ప్రశాంత్ వీర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.

అయితే సీఎస్‌కే ఆ బిడ్‌ను దక్కించుకుంది.

ధోనీ స్థానంలోకి కార్తీక్ శర్మ?

వికెట్ కీపర్ కార్తీక్ శర్మ రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఐపీఎల్ వేలం సమయంలో ప్రశాంత్ వీర్‌తో పాటు అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు.

కార్తీక్ శర్మ ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందుకే ఫ్రాంచైజ్ మేనేజర్ల దృష్టిని ఆకర్షించాడు.

వేలంలో కార్తీక్‌కు మంచి ధర పలుకుతుందని భావించారు. అయితే అతనిని రూ.14.20 కోట్లకు కొనడంతో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా మారతాడని ఊహించలేదు.

మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ చాలా కాలంగా వెదుకుతోంది. వికెట్ కీపర్‌గా, మంచి బ్యాట్స్‌మెన్‌గా కార్తీక్ శర్మ ఆ లోటును భర్తీ చేస్తాడనేది సీఎస్‌కే ఆలోచన.

ఐపీఎల్ వేలం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరానా, అబుదాబి, కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, Aquib Nabi Dar Family

ఎవరీ ఆకిబ్ దార్?

ఆకిబ్ బేస్ ధర రూ.30 లక్షలు. దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.

చివరకు, దిల్లీ క్యాపిటల్స్ అతనిని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అకిబ్ ‌దార్ బేస్ ధర కంటే 28 రెట్లు ఎక్కువ.

జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ దార్ ఇటీవలి దులీప్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ఆకిబ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. 29 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇంకా భారత జట్టులో అడుగు పెట్టలేదు. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆకిబ్ దేశీయ క్రికెట్‌లో అసాధారణంగా రాణించాడు. అందుకే ఐపీఎల్ వేలంలో అతనికి భారీ మొత్తం దక్కింది.

ఐపీఎల్ వేలం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరానా, అబుదాబి, కోల్‌కతా నైట్ రైడర్స్

ఇంకా ఎవరెవరు?

ఫాస్ట్ బౌలర్ల సెట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.2 కోట్లకు దక్కించుకుంది.

దక్షిణాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోఖియాను లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

సర్ఫరాజ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తన బేస్ ప్రైస్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.

వీరితో పాటు, న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, భారత్‌కు చెందిన ఆకాష్ దీప్, శివం మావి, దక్షిణాఫ్రికాకు చెందిన జెరాల్డ్ కోట్జీ, ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఫజల్హాక్ ఫరూఖీని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్. ఆయనను దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS