SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, @MEAIndia
నాలుగు రోజుల అధికారిక భారత పర్యటన కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దిల్లీ చేరుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య, పిల్లలు కూడా దిల్లీ వచ్చారు.
జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ( చిలుకూరి) భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.
ఉషా బంధువులు కొందరు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, Getty Images
ఉషా చిలుకూరి నానమ్మ ఇంటికి ఏపీ అధికారులు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దిల్లీకి చేరుకోకముందే, కొందరు ఏపీ అధికారులు ఉషా బంధువుల ఇంటికి వెళ్లి మాట్లాడారు.
విశాఖలోని ఉంటున్న 97 ఏళ్ల ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ ఉషా వాన్స్‌కు వరసకు నానమ్మ అవుతారు. శాంతమ్మ ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో చెప్పారు.
“పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ విభాగానికి చెందిన అధికారులు మా ఇంటికి వచ్చారు. ఉషా వాన్స్ మీకు ఏమవుతారు? ఆమెను ఎప్పుడైనా కలిశారా? జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడయ్యాక ఉషా వాన్స్ మీతో మాట్లాడారా? భారత్ పర్యటనకు వస్తున్న విషయాలు మీకు, మీ బంధువులెవరికైనా సమాచారం ఇచ్చారా లాంటి ప్రశ్నలు అడిగారు” అని ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీకి చెప్పారు.
ఒకవేళ ఉషా వాన్స్ తన పూర్వీకుల గురించి ఆరా తీస్తే చెప్పడం కోసం వివరాలు తెలుసుకోవడానికి వచ్చామని ఆ అధికారి తనతో చెప్పారని, అవసరమైతే మళ్లీ వస్తామని చెప్పారని ప్రొఫెసర్ శాంతమ్మ వెల్లడించారు.

ఫొటో సోర్స్, BBC/GettyImages
ఉషా చిన్నగా ఉన్నప్పుడు చూశా: ప్రొఫెసర్ శాంతమ్మ
“నాకు తెలిసి ఉషా విశాఖపట్నం ఎప్పుడూ రాలేదు. ఆమె నా మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ కూతురు. ఉష చిన్నపిల్లగా ఉన్నప్పుడే చూశాను. ఆ తర్వాత చూడలేదు. అమెరికాలోనే పుట్టి, అక్కడే పెరిగింది. చెన్నైలో వైద్యురాలిగా ఉంటున్న ఉష మేనత్త శారదతో ఆ కుటుంబానికి సంబంధాలున్నాయి’’ అని శాంతమ్మ వెల్లడించారు.
తన గురించి ఒకసారి ఉషా ఆరా తీసినట్లు తెలిసిందని ప్రొఫెసర్ శాంతమ్మ తెలిపారు.
‘‘ఉషా ఇండియా వస్తున్నట్లు అధికారులు చెప్పినప్పుడే నాకు తెలిసింది. అయితే మా బంధువుల్లో ఒకరితో మాట్లాడిన ఉషా, ఈ వయసులో కూడా ఇంకా ఆమె పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెబుతోందా అని నా గురించి అడిగారని తెలిసింది’’ అని ప్రొఫెసర్ శాంతమ్మ చెప్పారు.
మార్కొండపాడుకు అధికారులు
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలోని మార్కొండపాడు ఉషా చిలుకూరి వంశీకుల గ్రామం. ఉషా తాత ముత్తాతలు ఇక్కడే పెరిగారు.
ఉషా తాతయ్య రామశాస్త్రి, ఆయన తండ్రి వీరావధానులు ఈ గ్రామంలోనే పెరిగారు. ఉషా తాతయ్య రామశాస్త్రి, రాజమండ్రిలో చదువుకుని తర్వాత చెన్నై వెళ్లారు.
అక్కడే పుట్టిన ఆయన కుమారుడు, ఉషా తండ్రి రాధాకృష్ణ…చెన్నై నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి ఈ ఊరికి రాకపోకలు కానీ, సంప్రదింపులుగాని ఎప్పుడూ లేవని మార్కొండపాడువాసులు, చిలుకూరి వంశీకులు చెబుతున్నారు.
అయితే, భారత్ పర్యటనలో ఉన్న ఉషా చిలుకూరి తన పూర్వీకుల గ్రామమైన మార్కొండపాడుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆ గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. ఉషా పూర్వీకులు, ఆమె బంధువుల సమాచారం సేకరించారు.
చాగల్లు తహసీల్దార్‌తోపాటు సీబీఐ అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించి ఆమె తాతయ్య రామశాస్త్రి పెరిగిన ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న ఆయన బంధువులు చిలుకూరి శ్రీపతి శాస్త్రి, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అయితే ఆమె ఈ గ్రామానికి వస్తారా లేదా అన్న విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని, తమతో ఎవరూ దీని గురించి సంప్రదించలేదని బీబీసీకి చెప్పారు శ్రీపతి శాస్త్రి.
‘‘జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు మేం ఈ గ్రామాన్ని సందర్శించి ఆమె బంధువులతో మాట్లాడాం. ఆమె ఒకవేళ ఈ గ్రామాన్ని సందర్శించవచ్చేమోనన్న భావనతో వివరాలు కనుక్కునేందుకు ఇక్కడికి వచ్చాం. ఉషా చిలుకూరి ఈ గ్రామానికి వస్తారన్న సమాచారం మాకు ఇంత వరకు లేదు’’ అని చాగల్లు తహసీల్దార్ మెరుకమ్మ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉషా, వాన్స్ లవ్ మ్యారేజ్
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, 2013లో జేడీ వాన్స్, ఉషా వాన్స్‌లు యేల్ లా స్కూల్లో తొలిసారి కలుసుకున్నారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా” అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.
2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు.
ఉషా తల్లిదండ్రులు ఇండియ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిన్నప్పటి నుంచి శాన్ డియాగోలో పెరిగారు.
ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.
జేడీ వాన్స్ తరచూ భార్యను పొగుడుతుంటారు. ఆమెను తన యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా అభివర్ణించేవారు.
”ఆమె జ్ఞానం గురించి చాలామందికి తెలియదు. వెయ్యి పేజీల పుస్తకాన్ని కూడా కొన్ని గంటల్లోనే చదివేయగలదు” అన్నారు జేడీ వాన్స్.
నా పక్కనుండి ధైర్యాన్ని నింపే మహిళ ఆమె అని, తనకు మార్గదర్శిగా వ్యవహరిస్తుందని వాన్స్ తరచూ చెబుతుంటారు.
”నేను మరీ ఊహల్లో తేలుతుంటే ఉషా నన్ను అప్పుడప్పుడు భూమి మీదకు దింపుతుంటారు” అని 2020లో మేగిన్ కెల్లీ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు జేడీ వాన్స్.
”నేనెప్పుడైనా అతి గర్వంగానో, మేథావిగానో ఫీలయినప్పుడు వెంటనే ఆమె గుర్తుకు వస్తుంది. ఆమె నాకన్నా చాలా సాధించింది అన్న విషయం గుర్తు చేసుకుంటాను” అని వాన్స్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)