SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, NASA/Johns Hopkins
44 నిమిషాలు క్రితం
డొనల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య బడ్జెట్ బిల్లుపై రేగిన వివాదం నాసా బడ్జెట్ భవితపై అనిశ్చితిని పెంచింది. ఇప్పటికే నాసా భారీగా కోతలను ఎదుర్కొంటోంది.
తన బడ్జెట్ ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన ఈ అంతరిక్ష సంస్థ, సైన్స్ ప్రాజెక్టులకు దాదాపు సగం నిధులు తగ్గించే ప్రతిపాదన కూడా చేసింది.
అభివృద్ధిదశలో ఉన్న లేదా ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న నలభై సైన్స్ మిషన్లు మూతపడే పరిస్థితి వచ్చింది.
మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీతో ఫెడరల్ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని , సామాగ్రిని పంపడానికి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌పై నాసా ఆధారపడుతోంది. నాసా స్టార్‌షిప్ రాకెట్ ద్వారా చంద్రుడితో పాటు అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపాలని భావిస్తోంది. కానీ ఈ రాకెట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.


ఫొటో సోర్స్, Reuters
నాసా భవిష్యత్ లక్ష్యాలపై ప్రభావం?
మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికపై ఈ అనిశ్చితి ‘‘నిరుత్సాహపరిచే ప్రభావాన్ని’’ చూపుతుందని ఓపెన్ యూనివర్శిటీలో అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ సిమియన్ బార్బర్ చెప్పారు.
“గత వారంలో మనం చూసిన ఆశ్చర్యకరమైన మార్పులు, తక్షణ నిర్ణయాలు, యూ-టర్న్‌లు మన ఆశయాల పునాదులను బలహీనపరుస్తున్నాయి. స్పేస్ సైన్స్, అన్వేషణ అనేవి దీర్ఘకాలిక ప్రణాళికపైన, ప్రభుత్వం, కంపెనీలు, విద్యాసంస్థల మధ్య సహకారంపైన ఆధారపడి ఉంటాయి” అని ఆయనన్నారు.
అధ్యక్షుడు ట్రంప్, మస్క్ మధ్య వివాదం సంగతి పక్కనపెడితే బడ్జెట్‌లో భారీగా కోతలు విధిస్తామని నాసా కోరడంపై కూడా ఆందోళన నెలకొంది.
అంగారకునిపైకి వ్యోమగాములను పంపే ప్రణాళిక తప్ప, మిగిలిన అన్ని విభాగాల్లో పొదుపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. దీనివల్ల 100 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయి.
అమెరికా అంతరిక్ష కార్యక్రమం గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అనడానికి ఈ కోతలు ఉదాహరణ అని పసడేనా కేంద్రంగా పనిచేసే ప్లానెటరీ సొసైటీ స్పేస్ పాలసీ చీఫ్ కాసీ డ్రేయర్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్థ అంతరిక్ష అన్వేషణను ప్రోత్సహిస్తుంటుంది.

ఫొటో సోర్స్, NASA
చంద్రుడు, అంగారకుడిపైనే ప్రధాన దృష్టి
తన మొత్తం బడ్జెట్‌లో పావువంతును తగ్గించాలంటూ చేసిన విన్నంపై నాసా మాట్లాడుతూ
“మేము చంద్ర, అంగారక గ్రహాల అన్వేషణకు అవసరమైన మిషన్లను దృష్టిలో ఉంచుకొని, మా శాస్త్రీయ, సాంకేతిక ప్రాజెక్టుల వ్యయాన్ని అందుకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నాం”
ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ ఆమోదిస్తే, సంస్థ దృష్టి పూర్తిగా మారిపోతుందని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలో అంతరిక్ష విశ్లేషకుడైన డాక్టర్ ఆడమ్ బేకర్ అన్నారు.
“అధ్యక్షుడు ట్రంప్ నాసాను రెండు విషయాలు కోరుతున్నారు. చైనీయుల కంటే ముందు చంద్రుడిపై వ్యోమగాములను దించడం, అంగారకునిపై అమెరికా జెండాను ఎగరవేయడం. మిగిలినవన్నీ అప్రాధాన్యమైనవి” అని ఆయన తెలిపారు.
1960,70 దశకాల్లో చంద్రునిపై అపోలో లాండింగ్ తరువాత, ఇంతకాలానికి తొలిసారి శ్వేతసౌధం నాసాకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించే బడ్జెట్‌ను ఇచ్చిందని, ఈ ప్రతిపాదనలకు మద్దతు ఇచ్చేవారు చెబుతున్నారు.
1960, 70 దశకాలలో చంద్రునిపై ముందుగా అడుగుపెట్టే విషయంలో సోవియట్ యూనియన్‌ను నాసా ఓడించాలనే లక్ష్యాన్ని విధించింది. ఆ తర్వాత నాసా దశ, దిశలేని వ్యవస్థగా మారిందని, అంతరిక్ష కార్యకలాపాల కోసం నిర్దేశించిన బడ్జెట్‌ను భారీగా అధిగమిస్తూ పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పెనం మీద నుంచి పొయ్యిలోకి?’
దీనికి ప్రత్యేకమైన ఉదాహరణ అమెరికా వ్యోమగాములను మరోసారి చంద్రుడిపైకి పంపే ప్రణాళిక కోసం రూపొందించిన కొత్త రాకెట్, స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్). దీనిని రూపొందించడం ఆలస్యమవడంతో ఖర్చులు పెరిగి ప్రతి ప్రయోగానికి 4.1 బిలియన్ డాలర్లు (దాదాపు 34వేల 30 కోట్లరూపాయలు) ఖర్చవుతోంది.
అదే సమయంలో స్పేస్‌ఎక్స్ రాకెట్ సిస్టమ్‌కు చెందిన స్టార్‌షిప్ ప్రతి లాంచ్‌కు సుమారు 100 మిలియన్ డాలర్ల (సుమారు 830 కోట్లరూపాయలు) ఖర్చవుతుందని అంచనా వేసింది. ఎందుకంటే తిరిగి ఉపయోగించుకునేలా దాన్ని డిజైన్ చేశారు.
జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష సంస్థ తన ప్రతిపాదిత న్యూ గ్లెన్ రాకెట్ కోసం ఇలాంటి పొదుపు చర్యలనే పాటిస్తోంది.
ఎస్ఎల్ఎస్ స్థానాన్ని స్టార్‌షిప్, న్యూ గ్లెన్ భర్తీ చేయగలవన్న భావనతో వైట్ హౌస్ ప్రతిపాదనల్లో దాన్ని నిలిపివేస్తే ఎవరికీ ఆశ్చర్యం కలగదు.
కానీ స్టార్‌షిప్ గత ప్రయోగాలు విఫలమయ్యాయి, బ్లూ ఆరిజిన్ ఇటీవలే తన మూన్ రాకెట్‌ను పరీక్షించడం ప్రారంభించింది.
“నాసా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టవడం ఆందోళనకరం” అని డాక్టర్ బార్బర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, NASA
40 మిషన్లు నిలిపివేయాల్సిన స్థితి
“ఎస్‌ఎల్‌ఎస్‌కు ప్రత్యామ్నాయాల అభివృద్ధికి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆర్థికతోడ్పాటునందిస్తున్నారు. ఒకవేళ ఆ సంస్థలు దీనిపై ఆసక్తిని కోల్పోతే, స్పేస్‌ఎక్స్ లేదా బ్లూ ఆరిజిన్ తమ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరింత పెట్టుబడి అవసరమని చెబితే, కాంగ్రెస్ వారికి నిధులు కేటాయించాల్సిఉంటుంది” అని డాక్టర్ బార్బర్ అభిప్రాయపడుతున్నారు.
”మరింత ఆందోళన కలిగించే విషయం..ఇతర గ్రహాలను అన్వేషించడానికి, అంతరిక్షం నుంచి భూమిపై వాతావరణ మార్పు ప్రభావాన్ని పర్యవేక్షించడానికి సంబంధించిన 40 మిషన్లకు నష్టం కలిగే ప్రమాదం ఉండడం. చాలావాటిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం ఉంది.
“ఇంతకాలం కష్టపడి నిర్మించిన దానిని, తిరిగి నిర్మించడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించకుండానే ఒక్కసారిగా కూల్చివేయడం చాలా బాధాకరం” అని డాక్టర్ బార్బర్ ఆవేదన వ్యక్తంచేశారు.
కోతలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులలో”ఇప్పటికే చాలా మిషన్ల అభివృద్ధి, ప్రయోగానికి అయ్యే ఖర్చులు వెచ్చించేశాం. ఇప్పుడు వాటిని నిలిపేస్తే, కేవలం నిర్వహణా పరమైన వ్యయంలో మాత్రమే కొంచెం పొదుపు అవుతుంది. అంతేకానీ పెద్దగా లాభం ఉండదు.”

ఫొటో సోర్స్, ప్లానెటరీ సొసైటీ, నాసా, ఈఎస్ఏ, గెట్టీ
యూరప్ ఒప్పందాల పరిస్థితి ఏంటి?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో రెండు ఒప్పందాలపై కూడా ఆందోళన నెలకొంది. నాసా పెర్సివరెన్స్ రోవర్ సేకరించిన అంగారక గ్రహ శకలాలను భూమికి తిరిగి తీసుకురావడమనే ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళిక వాటిలో ఒకటికాగా, గతంలో అక్కడెవరన్నా జీవించారా అనే ఆనవాళ్లను వెతకడానికి యూరప్ రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్‌ను అరుణ గ్రహానికి పంపే మిషన్ మరొకటి.
ఈ మార్పు అవాంఛనీయమైనప్పటికీ “తన అంతరిక్ష కార్యకలాపాలలో యూరప్ ఎలా మెరుగ్గా రాణించగలదో ఆలోచించడానికి ఇది ఒక అవకాశం.”అని ప్రొఫెసర్ సర్ మార్టిన్ స్వీటింగ్ అన్నారు. ఆయన యూకే అంతరిక్ష సంస్థ సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ అధిపతి. దీంతోపాటు అంతరిక్ష భవిష్యత్తుపై రాయల్ సొసైటీ నివేదిక సహ-రచయిత కూడా . అయితే తక్కువ కాలంలో యూరోప్‌కు చాలా ఎక్కువ నష్టం కలిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
” అంతరిక్షరంగంలో స్వతంత్రంగా మరింత సామర్థ్యాన్నిపెంచుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలతో నమ్మకమైన, బలమైన భాగస్వామిగా కొనసాగేందుకు ప్రయత్నిస్తాం” అని తాజాగా ప్రచురించిన ఆర్టికల్‌లో ఈఎస్ఏ తెలిపింది. నాసా ఉన్నా లేకపోయినా దీనిని సాధిస్తామనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కసారి నిలిపివేస్తే ఏం జరుగుతుంది?
ప్రస్తుతం నిర్వహిస్తున్న, ప్రతిపాదన దశలో ఉన్న భూపరిశీలనా కార్యక్రమాలపై కూడా నిధుల కోతలున్నాయని డాక్టర్ బేకర్ చెప్పారు.
“ఈ భూపరిశీలన కార్యక్రమాలు భవిష్యత్తులో ఎదురయ్యే పర్యావరణా పరమైన ప్రమాదాలను ముందుగానే హెచ్చరిస్తాయి ” అని ఆయన బీబీసీ న్యూస్‌తో అన్నారు.
వీటిని నిలిపివేయడమంటే..
” వాతావరణ మార్పు ప్రభావాన్ని అంచనా వేయగల, ఆ ప్రభావాన్ని తగ్గించగల మన సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఆపివేయడం భయానకమైన విషయం.” అని ఆయనన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా కాంగ్రెస్ ఆమోదం పొందలేదు. చాలా మంది రిపబ్లికన్లు కోతలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని లాబీయిస్టులతో ప్రైవేట్‌గా చెప్పినట్టు ప్లానెటరీ సొసైటీకి చెందిన కాసీ డ్రేయర్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
రాజకీయ ప్రతిష్ఠంభన కారణంగా ఏరకమైనా బడ్జెట్‌ను ఆమోదించకపోయే ప్రమాదం ఉందని డ్రైయర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ తగ్గించిన బడ్జెట్ తాత్కాలిక చర్యగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది, దానిని తర్వాత మార్చడం కష్టం కావచ్చు. ఎందుకంటే అంతరిక్ష మిషన్లను ఒకసారి ఆపేస్తే వాటిని మళ్లీ ప్రారంభించడం కష్టం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)