SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది.
చైనా నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 245 సుంకాలు విధిస్తుంటే, అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా కూడా 125 శాతం సుంకాలతో ఎదురుదాడి చేస్తోంది.
తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో అవసరమైతే ‘చివరి వరకు పోరాడేందుకు’ కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై పోరాటంలో చైనా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి?


ఫొటో సోర్స్, Getty Images
చైనా నొప్పిని భరించగలదా?
చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా సుంకాల పెంపు ప్రభావాన్ని చాలా చిన్న దేశాల కంటే మెరుగ్గా ఎదుర్కోగలదు.
వంద కోట్లకు పైగా జనాభాతో చైనాకు దేశీయంగా పెద్ద మార్కెట్ ఉంది. సుంకాల వల్ల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని స్థానిక మార్కెట్లు కొంతమేర భరించగలవు.
చైనా ప్రజల కొనుగోలు శక్తి పుంజుకోకపోవడంతో బీజింగ్ ఇప్పటికీ తడబడుతోంది. అయితే గృహోపకరణాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు, పదవీ విరమణ చేసిన వారికి దేశంలో ప్రయాణించేందుకు ‘సిల్వర్ ట్రైన్లు’ ఏర్పాటు లాంటివి పరిస్థితుల్లో కొంత మార్పు తేగలవు.
ట్రంప్ సుంకాలు పెంచడం, తమ దేశంలోని వినియోగదారుల సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
‘‘అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోందని భావిస్తున్న చైనా నాయకత్వం, దానికి లొంగకుండా, బాధను భరించడానికి సిద్ధంగా ఉంటుంది’’ అని వాషింగ్టన్‌లోని పీటర్సన్ ఇన్స్టిట్యూట్లో అమెరికా చైనా వాణిజ్య వ్యవహారాల నిపుణురాలు మేరీ లవ్లీ బీబీసీ న్యూస్ అవర్ కార్యక్రమంలో చెప్పారు.
చైనాలో నిరంకుశ పాలన కాస్త ఎక్కువ నొప్పిని భరించగలదు. అక్కడి పాలకులు స్వల్పకాలంలో ప్రజాభిప్రాయాన్ని పెద్దగా పట్టించుకోరు. చైనా పాలకుల నిర్ణయాలకు పరీక్ష పెట్టేందుకు ఎన్నికలేవీ లేవు.
అయినప్పటికీ, ప్రజల్లో అశాంతి ఆందోళన కలిగిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూలిపోవడం, నిరుద్యోగితపై ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి ఉంది.
ఎదుగుతున్న చైనాను మాత్రమే చూస్తున్న ప్రస్తుత యువతకు సుంకాల పెంపు వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి ఎదురు దెబ్బ లాంటిదే.
చైనా కమ్యూనిస్టు పార్టీ పరస్పర సుంకాల ప్రకటనను జాతీయ భావానికి ముడిపెట్టి సమర్థించుకుంటోంది. “తుపానులను కలిసి ఎదుర్కోవాలని” ప్రభుత్వ మీడియా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆందోళన చెందుతూ ఉండవచ్చు, అయితే ఇప్పటి వరకు బీజింగ్ నాయకత్వం ధిక్కార స్వరంతో, ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత పరిస్థితులపై”ఆకాశం కూలిపోదు” అంటూ అధికారి ఒకరు దేశానికి హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్‌పై చైనా పెట్టుబడి
చైనా.. ప్రపంచానికి తయారీ కర్మాగారం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఆ దేశ నాయకత్వం లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. సాంకేతిక రంగంలో ఆధిపత్యం సాధించేందుకు అమెరికాతో పోటీ పడుతోంది.
పునరుత్పాదక ఇంధన వనరులు, కంప్యూటర్ చిప్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఉదాహరణకు తీసుకుంటే చాట్‌జీపీటీకి పోటీగా డీప్‌సీక్ చాట్‌బోట్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలో అతి పెద్దదైన టెస్లాను ఢీ కొట్టే బీవైడీ లాంటివి ఉన్నాయి.హువావే, వివో లాంటి పోటీదారుల వల్ల యాపిల్ సంస్థ తన మార్కెట్ వాటాను కోల్పోతోంది.
రానున్న పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు బీజింగ్ ఇటీవల ప్రణాళికలు ప్రకటించింది.
చైనా నుంచి తమ కర్మాగారాలను తరలించేందుకు అమెరికన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ చైనా స్థాయిలో మౌలిక వసతులు, నిపుణులైన కార్మికులు ఎక్కడా దొరక్క ఇబ్బంది పడుతున్నాయి.
చైనాలో తయారీ సంస్థలకు ప్రతి దశలోనూ ముడి సరకులు అందుబాటులో ఉండటం ఆ దేశానికి సానుకూలంగా మారింది. దీన్ని మరో చోట భర్తీ చేయడానికి చాలా సమయం పడుతుంది.
పోటీ లేని సరఫరా వ్యవస్థలతో చైనాకున్న నైపుణ్యం, ప్రభుత్వ మద్దతు లాంటివి, ఈ వాణిజ్య పోరాటంలో బీజింగ్‌ను కొన్ని మార్గాల్లోనైనా ఒత్తిళ్లకు లొంగకుండా చేశాయి. ట్రంప్ గత హయాం నుంచే చైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ 1.0 నుంచి పాఠాలు
2018లో ట్రంప్ సుంకాలు చైనా సోలార్ప్యానల్స్ను తాకినప్పటి నుంచి చైనా నాయకత్వం భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలుపెట్టింది.
వివాదాస్పద వాణిజ్య, మౌలిక వసతుల కల్పన కార్యక్రమం కోసం చైనా లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించింది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో చైనా గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంది.
అమెరికాతో దూరం జరుగుతూ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో చైనా వాణిజ్యాన్ని విస్తృతం చేసుకుంటోంది.
చైనాకు అవసరమైన సోయాబీన్లో 40 శాతం ఒకప్పుడు అమెరికన్ రైతులు సరఫరా చేసేవారు. ఇప్పుడది 20శాతానికి తగ్గిపోయింది. గతంలో అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తర్వాత చైనా దేశీయంగా సోయా ఉత్పత్తిని భారీగా పెంచింది. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సోయాబీన్ సరఫరాదారుగా ఉన్న బ్రెజిల్ నుంచి రికార్డు స్థాయిలో సోయాను దిగుమతి చేసుకుంది.
“ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే వ్యూహం. ఇది అమెరికా వ్యవసాయ మార్కెట్లను దెబ్బ తీయడమే కాక చైనా ఆహార భద్రత ప్రమాణాలను పెంచుతుంది” అని అసోసియేట్ ప్రొఫెసర్ మరినా యూవే జాంగ్ చెప్పారు.
అమెరికా ఇప్పుడు చైనా అతి పెద్ద ఎగుమతి మార్కెట్‌గా లేదు. ఇప్పుడీ స్థానాన్ని ఆగ్నేయాసియా ఆక్రమించింది. 2023లోనే చైనా 60 దేశాలకు భారీ వాణిజ్య భాగస్వామిగా ఉంది. అమెరికాతో పోలిస్తే ఈ దేశాల వాణిజ్యం రెట్టింపు స్థాయిలో ఉంది. 2024 చివరి నాటికి ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతిదారు ట్రిలియన్ డాలర్ల మిగులును సాధించింది.
దీనర్థం ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా చైనాకు కీలక వాణిజ్య భాగస్వామి కాదని కాదు. అయితే చైనాను ఏకాకిని చేయడం అమెరికా అనుకున్నంత తేలిక కాదు.
చైనాను ఏకాకిని చేసేందుకు వైట్‌హౌస్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను ఉపయోగించు కుంటుందని కథనాలు వస్తున్నాయి. అయితే చైనా ప్రయోజనాలకు విరుద్దంగా ఒప్పందాలు చేసుకునే దేశాలను బీజింగ్ హెచ్చరించింది.
చైనాకు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకోవడం ప్రపంచంలో అనేక దేశాలకు అసాధ్యమైన ఎంపిక. “అమెరికా చైనా మధ్య మేం దేన్నీ ఎంచుకోలేం. దేన్నీ ఎంచుకోం” అని మలేషియా వాణిజ్య మంత్రి తెంగ్కు జఫ్రుల్ అజీజ్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఎలా దిగివస్తారో చైనాకు అర్థమైందా?
ఏప్రిల్ మొదటి వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించినప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోయినా ఆయన తన నిర్ణయాన్ని సమీక్షించలేదు. తన టారిఫ్ పాలసీ ఆర్థిక వ్యవస్థకు ఔషధం లాంటిదన్నారు.
అయితే ప్రభుత్వ బాండ్ల విక్రయం ఒక్కసారిగా పెరగడంతో యూటర్న్ తీసుకున్నారు. కొన్ని దేశాల మీద సుంకాల విధింపును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ బాండ్లను ట్రెజరీస్ అని కూడా అంటారు. ఈ బాండ్లను కొనడం సురక్షితమైన పెట్టుబడిగా చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం వీటిపైన కూడా నమ్మకాన్ని దెబ్బ తీసింది.
చైనాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు ట్రంప్ ఇప్పుడు కొన్ని సంకేతాలు ఇచ్చారు. చైనా ఉత్పత్తులపై విధించిన పన్నులు “క్రమేపీ తగ్గుముఖం పడతాయి, కానీ అవి సున్నాకు చేరవు” అని అన్నారు.
కాబట్టి బాండ్ల మార్కెట్ ట్రంప్‌ను దారికి తెస్తుందని చైనా గ్రహించిందని నిపుణులు చెబుతున్నారు.
చైనా వద్ద 700 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. అమెరికాకు బలమైన మిత్ర దేశమైన జపాన్ వద్ద వద్ద అంత కంటే ఎక్కువ ఉన్నాయి.
ఇది బీజింగ్ పరపతి పెంచే అంశమని కొందరి వాదన. అమెరికా బాండ్లను అమ్మడం లేదా, కొనుగోళ్లను నిలిపివేయడం అనే ఆలోచనను “ఆయుధంగా” ప్రచారం చేస్తోంది చైనా మీడియా. కానీ అటువంటి పరిస్థితి నుంచి చైనా సురక్షితంగా బయటపడలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అలా చేయడం వల్ల బాండ్ల మార్కెట్లో బీజింగ్ పెట్టుబడులకు భారీ నష్టాలు వస్తాయని, చైనా కరెన్సీ యువాన్ బలహీనపడుతుందని చెబుతున్నారు.
అమెరికా ప్రభుత్వ బాండ్లతో చైనా “ఒక స్థాయి వరకు మాత్రమే” ఒత్తిడి తీసుకు రాగలదని డాక్టర్ జాంగ్ చెప్పారు. “చైనా వద్ద బేరసారాల చిప్ ఉంది. ఆర్థిక ఆయుధం కాదు”అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖనిజాల విషయంలో ఉక్కిరిబిక్కిరి
ఆధునిక సాంకేతిక ఉపకరణాల తయారీలో కీలకమైన అరుదైన మూలకాలను వెలికి తీయడం, శుద్ధి చేయడంలో తన గుత్తాధిపత్యాన్ని చైనా ఆయుధంగా మార్చుకోగలదు.
ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లలోని అయస్కాంతాల తయారీకి ఉపయోగించే డిస్ప్రోసియం, జెట్ ఇంజన్లకు వేడి తగలకుండా పూతగా వాడే యట్రియం వంటి అరుదైన మూలకాలు చైనా వద్ద భారీగా ఉన్నాయి.
ట్రంప్ సుంకాలపై స్పందించిన బీజింగ్ ఇప్పటికే ఏడు రకాల మూలకాల ఎగుమతులను నిలిపివేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ తయారీకి అవసరమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.
అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 61 శాతంగా ఉంది. వాటి శుద్ధిలో 92శాతం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది.
ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం అరుదైన ఖనిజాల కోసం తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, చైనా స్థాయిలో వాటిని ఎగుమతి చేయడానికి చాలా ఏళ్లు పడుతుంది.
వివిధ వస్తువుల తయారీలో కీలకమైన ఖనిజం యాంటీమోనీ ఎగుమతులను చైనా 2024లో నిషేధించింది. కొనుగోలు భయాలు, ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెదుకులాట మధ్య ఈ ఖనిజం ధర రెట్టింపైంది.
అరుదైన మూలకాల విషయంలో ఇదే జరగవచ్చనే భయాలు ఉన్నాయి. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి రక్షణ రంగ పరికరాల వరకు అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఉంది.
“మీరు ఆన్ లేదా ఆఫ్ చేయగలిగిన ప్రతి వస్తువు అరుదైన మూలకాల మీద నడుస్తుంది” అని జింజర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ థామస్ క్రూమ్మెర్ బీబీసీతో చెప్పారు.
“దీని ప్రభావం అమెరికా రక్షణరంగంపై గణనీయంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)