SOURCE :- BBC NEWS
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ సోమవారం (జనవరి 20) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వారి అధికారిక చిత్రాలను విడుదల చేశారు.
ఇందులో ట్రంప్, వాన్స్ నీలిరంగు సూటు, తెల్ల చొక్కా, నీలిరంగు టై ధరించి ఉన్నారు. ట్రంప్ కోటు మీద ఎడమ వైపు జెండా ఉన్న సింబల్‌ను పెట్టుకున్నారు.
ట్రంప్, వాన్స్ హావభావాల్లో తేడా ఉంది. అధికారిక చిత్రంలో ట్రంప్ కాస్త కిందకు చూస్తూ, ఎడమ కంటి రెప్పను పైకి లేపి ఉంచారు. ఆయన పెదాలను గట్టిగా అదిమి పట్టి చూస్తున్నారు.
వాన్స్ మాత్రం రెండు చేతులు కట్టుకుని, చాలా ఉల్లాసంగా కెమెరా వైపు నవ్వుతూ చూస్తున్నారు.
కొందరు ట్రంప్ తాజా అధికారిక చిత్రాన్ని 2023 నాటి ఆయన మగ్‌షాట్‌తో పోల్చి చూస్తున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుగు ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో ట్రంప్‌ను ఫల్టన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. అప్పుడు తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు.
జైలులోకి వచ్చే ఇతర ఖైదీల ఫొటోలు తీసినట్లే 2023లో ట్రంప్ ఫొటోలు తీశారు అధికారులు. ఆ ఫోటోతో తాజా అధికారిక ఫొటోను పోల్చి చూస్తున్నారు అమెరికన్లు.
ట్రంప్ తాజా అధికారిక చిత్రం 2017లో ఆయన తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఉపయోగించిన చిత్రంతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది.
అప్పట్లోనూ ఆయన డ్రెస్ అలాగే ఉన్నా, ఆయన కెమెరా వైపు నవ్వుతూ చూశారు.
“ట్రంప్ ఈసారి ధిక్కార ధోరణితో వ్యవహరించవచ్చు. న్యాయపరంగా తనకు ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించడానికి ధిక్కార ధోరణిని నమూనాగా భావిస్తూ ఉండవచ్చు” అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం బోధించే ప్రొఫెసర్ ఖ్వాడిక్రోస్ డ్రిక్సెల్ బీబీసీతో చెప్పారు.
“ట్రంప్ గత చిత్రపటానికి పూర్తి భిన్నంగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పడు, ఈసారి మరింత కఠిన వైఖరితో వ్యవహరిస్తానని చెప్పే ప్రయత్నాన్ని సూచిస్తోంది” అని ప్రొఫెసర్ డ్రెసెల్ అన్నారు.
అధ్యక్ష అధికార మార్పిడి కోసం పని చేస్తున్న ట్రంప్ బృందం విడుదల చేసింది.
గతంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుగా ట్రంప్, మైక్ పెన్స్ ఉన్నప్పుడు వారి అధికారిక చిత్రాలను, వారు బాధ్యతలు చేపట్టిన 9 నెలల తర్వాత విడుదల చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)