SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, X/White House

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తనను తాను పోప్‌గా చూపించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చిత్రాన్ని పోస్ట్ చేయడంపై కొందరు కేథలిక్స్ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఏప్రిల్ 21న మరణించిన పోప్ ఫ్రాన్సిస్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ, తదుపరి పోప్‌ను ఎన్నుకునేందుకు కేథలిక్స్ సిద్ధమవుతున్న తరుణంలో వైట్‌హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటో పోస్ట్ అయింది.

ట్రంప్.. తమ విశ్వాసాలను అపహాస్యం చేస్తున్నారని న్యూయార్క్ స్టేట్ కేథలిక్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. “నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను” అని ట్రంప్ విలేఖరులతో జోక్ చేసిన కొద్దిరోజుల తర్వాత సోషల్ మీడియాలో ఈ పోస్ట్ దర్శనమిచ్చింది.

కేథలిక్స్ విశ్వాసాలను అపహాస్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్ మొదటివారేమీ కాదు. గతేడాది ఫ్లోరిడాలోని టంపాలో, గర్భస్రావానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో శిలువ గుర్తు చూపించినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆగ్రహం వ్యక్తమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ పోస్ట్‌పై శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూని నిరాకరించారు.

మరోవైపు, ఫ్రాన్సిస్ వారసుడిని ఎన్నుకోవడానికి బుధవారం నుంచి సమావేశాల నిర్వహణకు వాటికన్ సన్నాహాలు చేస్తోంది.

శుక్రవారం రాత్రి ట్రంప్ పోస్ట్ చేసిన చిత్రంలో బిషప్ ధరించే సంప్రదాయ తెల్తని దుస్తులు, తలపై పొడవైన మిట్రే(టోపీలాంటిది) ధరించి ఉన్నారు. మెడలో పెద్ద శిలువతో, వేలు పైకెత్తి, గంభీరమైన ముఖకవళికలతో ఉన్నారు.

ఈ ఫోటోపై న్యూయార్క్‌లోని బిషప్‌లకు ప్రాతినిధ్యం వహించే న్యూయార్క్ స్టేట్ కేథలిక్ కాన్ఫరెన్స్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది.

“ఈ చిత్రంలో తెలివైనదిగానూ, ఫన్నీగానూ ఏమీ లేదు మిస్టర్ ప్రెసిడెంట్” అని ఆ బృందం రాసింది.

“మేం ఇటీవలే మా ప్రియమైన పోప్ ఫ్రాన్సిస్‌‌కు అంత్యక్రియలు నిర్వహించాం. కొత్త వారసుడిని ఎన్నుకునే ప్రక్రియలోకి అడుగుపెట్టబోతున్నాం. మమ్మల్ని ఎగతాళి చేయకండి” అని ఎక్స్‌లో రాసింది.

వామపక్ష భావాలున్న ఇటలీ మాజీ ప్రధాని మాటియో రెంజీ కూడా ట్రంప్ పోస్టును తప్పుబట్టారు.

“ఇది విశ్వాసులను కించపరిచే, సంస్థలను అవమానించే రైట్‌వింగ్ ప్రపంచ నాయకుడు.. ఎగతాళి చేయడాన్ని ఆనందిస్తాడని చూపించే చిత్రం” అని ఎక్స్‌లో రెంజీ ఇటాలియన్‌లో రాశారు.

అయితే, రిపబ్లికన్ అధ్యక్షుడు పోప్‌ను ఎగతాళి చేస్తున్నారనే వాదనను వైట్ హౌస్ తోసిపుచ్చింది.

”పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులు అర్పించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటలీ వెళ్లారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కేథలిక్స్‌కు, మత స్వేచ్ఛకు ట్రంప్ బలమైన మద్దతుదారు” అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)