SOURCE :- BBC NEWS
9 జనవరి 2025
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఎందుకు జరిగింది? అధికారులపై చంద్రబాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? టిటీడీ చైర్మన్ ఏం చెబుతున్నారు?
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు.
48 మంది గాయపడ్డారని, వీరందరికి స్విమ్స్, ప్రభుత్వ రుయాస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించారు.
మృతుల వివరాలు
మృతుల వివరాలను కలెక్టర్ ప్రకటించారు.
1.బుద్దేటి నాయుడుబాబు (51) -నర్సిపట్నం
2. రజిని (47) – విశాఖపట్నం
3. లావణ్య (40) – విశాఖపట్నం
4. నిర్మల (50) బళ్లారి
5. శాంతి (34) – బళ్లారి
6. మల్లిగ (49) –సేలం
టోకెన్లు ముందే ఎందుకిచ్చారు.?
తిరుమల శ్రీవారిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు ఈనెల 9వ తేదీ నుంచి తిరుపతిలో టోకెన్లు జారీచేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలోని ఎనిమిది సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. 10, 11, 12 తేదీలలో దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. భక్తులు సంయమనంతో టోకెన్లు పొందాలని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు కోరారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని తెలిపారు.
9వ తేదీ టిక్కెట్ల కోసం ఎనిమిదో తేదీ ఉదయం నుంచే టోకెన్ జారీ కేంద్రాలకు భక్తులు భారీగా చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికల్లా టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గరకి వేలాది మంది భక్తులు చేరుకున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నిర్ణీత సమయం కన్నా ముందుగానే టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు చెప్పారు.
భక్తుడికి అస్వస్థతే కారణమా?
బైరాగి పట్టడంలోని రామానాయుడు స్కూల్ దగ్గర టోకెన్లు కోసం వచ్చిన భక్తులను పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపించారు. సాయంత్రానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసంతో వేచి ఉన్న ఒక వ్యక్తి రాత్రి 8గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక్కసారిగా భక్తులంతా ఆ గేటుపై పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరిగి గేటు తెరుచుకుంది. దీంతో వేలాది మంది భక్తులు క్యూ లైన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో ఐదుగురు చనిపోగా ఆ ఘటనకు ముందే శ్రీనివాసం దగ్గర ఒకరు అస్వస్థత గురై మరణించారు అని తిరుపతి కలెక్టర్ ప్రకటించారు.
తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక చోట భక్తురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో డీఎస్పీ గేట్లు తీశారని, దీంతో ఒక్కసారిగా భక్తులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
ముందుగా తెలియదా? – సీఎం ఆగ్రహం
దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై చంద్రబాబు రాత్రి సమీక్ష జరిపారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.
విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు.
ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు…అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని, ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్నారు.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది
ప్రధాని ఆవేదన
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.
‘పట్టించుకున్నవాళ్లు లేరు’
ఉదయం 10 గంటలకు క్యూ లైన్ లోకి వచ్చాం. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు అని తొక్కిసలాటలో గాయపడిన బళ్లారికి చెందిన శ్రీదేవి చెప్పారు.
“క్రౌడ్ ఎక్కువైంది. కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. మహిళలకు అయితే ఏ విధంగా రక్షణ కూడా లేకుండా పోయింది. మేము బళ్లారి నుంచి వచ్చాం ఉదయం నుంచి పార్కులో ఉంచి తాళం వేశారు. తర్వాత సాయంత్రం వరకు భోజనం గానీ ఏమీ రాలేదు. దీంతో నరకయాతన అనుభవించాము’’ అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS