SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, celebiaviation.com
26 నిమిషాలు క్రితం
తుర్కియేకు చెందిన విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియాకు భద్రతాపరమైన అనుమతులను భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ (బీసీఏఎస్) రద్దు చేసింది.
దీనిపై చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా స్పందిస్తూ .. ” నిజానికిది భారతీయ నిపుణుల నేతృత్వంలో నిర్వహించే భారతీయ సంస్థ. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది తుర్కిష్ సంస్థ కాదు.” అని తన ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌లో భారత్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండించిన తుర్కియే, పాకిస్తాన్‌కు అండగా నిలవడంతో భారత్ ఈ చర్యలు తీసుకుంది.
భారత్‌లోని తొమ్మిది విమానాశ్రయాల్లో 15 ఏళ్ల నుంచి చెలేబీ తన సేవలను అందిస్తోంది.

‘‘జాతి ప్రయోజనాలు, ప్రజల భద్రత చాలా ముఖ్యం. ఈ విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడేది లేదు.” అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు.
‘‘జాతీయ భద్రత దృష్ట్యా, చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు’’ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో కార్యకలాపాలను నిర్వహించే చెలేబీ సంస్థతో తమ భాగస్వామ్యం అధికారికంగా ముగిసినట్లు దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ (డీఐఏఎల్) ఓ ప్రకటనలో తెలిపింది.
దిల్లీ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో టర్మినల్ కార్యకలాపాలను చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెలేబీ దిల్లీ కార్గో టర్మినల్ మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చూసుకునేవి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయారు. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
మే 6,7వ తేదీ మధ్యరాత్రి పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడులు చేసినప్పుడు, తుర్కియే అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్ పాకిస్తాన్‌కు సంఘీభావం ప్రకటించారు.
దీని తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున వాడినట్లు భారత్ చెప్పింది.
”డ్రోన్ల శకలాలపై ఫోరెన్సిక్ విచారణ చేపడుతున్నాం. ప్రాథమిక పరిశీలనల్లో ఇవి తుర్కిష్ ఆసిస్‌గార్డ్ సోన్‌గార్ డ్రోన్లుగా తేలింది.” అని మే 9న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు.
ఆ తర్వాత తుర్కియేకు చెందిన ఉత్పత్తులను, పర్యటకాన్ని నిషేధించాలని భారత్‌లో అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.
తుర్కియేకు వెళ్లొద్దని కొన్ని ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టళ్లు, అసోసియేషన్లు సూచనలు జారీ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చెలేబీ ఏవియేషన్ ఇండియా ఏం చెప్పింది?
”భారత విమానయానం, జాతి భద్రత, పన్ను నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. పూర్తి పారదర్శకతతో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం.” అని చెలేబీ ఏవియేషన్ ఇండియా తన ప్రకటనలో చెప్పింది.
యాజమాన్యం, నిర్వహణ విషయంలో వస్తున్న అన్ని ఆరోపణలను కంపెనీ తన ప్రకటనలో తోసిపుచ్చినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.
దేశ విమానయాన రంగంలో నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని కంపెనీ చెప్పింది.
” ఏ ప్రమాణాల ప్రకారం కూడా మాది తుర్కియే సంస్థ కాదు. కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన సంప్రదాయాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఏ విదేశీ ప్రభుత్వం లేదా వ్యక్తులతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు.” అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
చెలేబీ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను బీసీఏఎస్ రద్దు చేయడం కంపెనీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెలేబీ మాజీ అధికారులు చెప్పారు.
చెలేబీకి తుర్కియే తర్వాత భారత్ రెండో అతిపెద్ద విమానయాన నిర్వహణ మార్కెట్ అని అధికారులు తెలిపారు.
తమ సంస్థలో 65 శాతం వాటా కెనడా, అమెరికా, బ్రిటన్, సింగపూర్, యూఏఈ, పశ్చిమ యూరప్‌కు చెందిన ఇన్వెస్టర్ల చేతిలో ఉందని చెలేబీ ఏవియేషన్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.
చెలేబీ కంపెనీ 1958లో విమానయాన రంగంలోకి ప్రవేశించి, చెలేబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది.
తుర్కియేలో తొలి ప్రైవేట్ రంగ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ కంపెనీ ఇది.

ఫొటో సోర్స్, celebiaviation.com
చెలేబీ వ్యాపారాలు
పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో నిర్వహణ సేవలను చెలేబీ బహుళ జాతీయ కంపెనీ అందించింది.
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, టాంజానియా, జర్మనీ, హంగేరి, తుర్కియే, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 43 విమానాశ్రయాల్లో చెలేబీ సేవలందిస్తోంది.
భారత్, యూరప్‌లలో అతిపెద్ద ఇండిపెండెంట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 13 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
గత ఏడాది దిల్లీలో జీ-20ను నిర్వహించినప్పుడు, దిల్లీ విమానాశ్రయంలో జీ-20 ప్రతినిధుల, వీవీఐపీల రాకపోకలను చూసుకోవడంలో చెలేబీ కీలక పాత్ర పోషించింది.
”భారత్‌లో జీ-20 సదస్సు నిర్వహణలో సంస్థ తరఫున కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉంది.” అని చెలేబీ ఇండియా సీఈఓ తౌసీఫ్ ఖాన్ అన్నారు.
భారత్‌లో తొమ్మిది విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో టర్మినల్ నిర్వహణ సేవలను ఈ కంపెనీ అందించింది.
హైదరాబాద్, ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్, గోవా, బెంగళూరు, కొచిన్, కన్నూర్, చెన్నై విమానాశ్రయాల్లో ఇది కార్యకలాపాలు సాగించింది.
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. భారత్‌లో 7,800 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇది 58 వేల విమానాలను, ఐదున్నర లక్షల టన్నుల కార్గోను నిర్వహించింది.
చెలేబీ దిల్లీ కార్గో టర్మినల్ మేనేజ్‌మెంట్ ఇండియాగా దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది కార్గో సేవలను అందించింది.
చెలేబీ ఇండియా ప్రధానంగా ప్రయాణికుల సేవలు, లోడ్ కంట్రోల్, ఫ్లయిట్ ఆపరేషన్స్, ర్యాంప్ సర్వీసులు, జనరల్ ఏవియేషన్ సర్వీసులతో పాటు కార్గో, పోస్టల్ వంటి ఇతర సేవలను అందించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)