SOURCE :- BBC NEWS

చపాట మిర్చి

అది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామం. పాలడుగుల రామయ్య అనే వ్యక్తి తన ఇంటి అరుగుపై కూర్చుని కొడుకు, కోడలు, ఇంజినీరింగ్ చదువుతున్న మనవడితో తమ కుటుంబ వ్యవసాయ నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు. మూడు తరాల అనుభవాల ముచ్చట్లు అవి.

”మా తాత, నాన్న, నేను, ఆ తర్వాత నా కొడుకు వరకు ఇలాగే కొనసాగుతోంది. ఆ విత్తనాల మూలం ఎక్కడ? ఎలా, ఎప్పుడు అనే విషయాలేవీ మాకు తెలియదు” అన్నారు రామయ్య.

దేశవాళీ రకం ‘చపాట మిరప’ పంట గురించి వారు మాట్లాడుతున్నారు. దీన్నే ‘టమోటా మిర్చి’ అని కూడా పిలుస్తారు. ఈ పండు మిరపకాయలు టమోటా ఆకారంలో ఉంటాయి.

సాధారణ మిరప రకాలతో పోలిస్తే ఎక్కువ ఎరుపు, తక్కువ కారం చపాట మిర్చీ ప్రత్యేకత. అంతేకాదు ఈ పంట తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకే పరిమితమని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

చపాట మిర్చికి జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉంది. ఇటీవల ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్’లో చపాట మిర్చి వివరాలు ప్రచురితం అయ్యాయి.

ఏవైనా ఉత్పత్తులకు ప్రత్యేక లక్షణాలుంటే వాటి భౌగోళిక స్థానం, లక్షణాలను జీఐ ట్యాగ్ గుర్తిస్తుంది. దీనిద్వారా ఆ ఉత్పత్తిని ఇతరులు కాపీ చేయకుండా వాటి మేథోపరమైన హక్కులపై చట్టపరంగా రక్షణ లభిస్తుంది.

‘‘జీఐ గుర్తింపు వస్తే ఖచ్చితంగా అది మాకు గర్వకారణం. ఎక్కడా లేనిది మా దగ్గరుందంటే గొప్పతనమే కదా!’’ అని అన్నారు లక్ష్మీప్రసాద్.

“చిన్నప్పుడు సెలవుల్లో మా పొలానికి వెళ్లేవాడిని. ఇతర రాష్ట్రాల మార్కెట్లకు ఎగుమతి చేసే మిరప బస్తాలను గుర్తుపట్టేలా వాటిపై మా తాతయ్య, నాన్న పేరు మార్కర్‌ పెన్‌తో రాయడం, బస్తాలు లెక్కపెట్టడం నాకింకా గుర్తుంది” అని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
లక్ష్మీప్రసాద్ కుటుంబం

చపాట మిర్చి

చపాట మిర్చిని స్థానికంగా దొడ్డుకాయ, లబ్బకాయ, నీటి కాయ, మోదాలు, దేశవాళీ, సింగిల్ పట్టి, డబుల్ పట్టీ, టమోటా.. ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.

జీఐ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ములుగు, శాయంపేట్, పరకాల, నడికుడ, మొగుల్లపల్లి, టేకుమట్ల, చిట్యాల, ఘనపూర్, భూపాలపల్లి, వెంకటాపూర్ ప్రాంతాలకు ఈ పంట సాగు పరిమితమైంది.

చపాట పంట

కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త భాస్కర్ కొంతకాలం ‘చపాట’పై పరిశోధనలు చేశారు. ఈ పంట కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంపై ఆయన బీబీసీకి వివరించారు.

‘ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం, చల్లటి వాతావరణం, కాయ అభివృద్ది దశలో పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడి ఎర్ర, నల్ల రేగడి నేలల్లో ఉదజని సూచిక (పీహెచ్) 7.5 వరకు ఉండటం వల్ల సాధారణ మిరప రకాలతో పోలిస్తే అధిక రంగు, తక్కువ కారం లక్షణాలుంటాయి. మిరపలోని అతి తక్కువ ఎస్‌హెచ్‌యూ (స్కావిల్లే హీట్ యూనిట్స్)వల్ల ఘాటు తక్కువగా ఉంటుంది” అని భాస్కర్ చెప్పారు.

చపాట మిర్చిలోని ప్రత్యేక లక్షణాల వల్ల పచ్చళ్లు, పానీయాలు, ఆహారశుద్ధి, ఐస్‌క్రీమ్ కలర్స్, లిప్ స్టిక్, నూనెల తయారీలలో వాడుతున్నారని ఆయన తెలిపారు.

సునీత

స్థానిక మార్కెట్‌లతో పాటూ జాతీయస్థాయిలో దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చపాట మిర్చి ఎగుమతి చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల ఎకరాల్లో 10 వేల మెట్రిక్ టన్నుల చపాట మిర్చి ఉత్పత్తి జరుగుతోందని భాస్కర్ తెలిపారు.

“ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట ఎక్కువగా పండిస్తుంటారు. మాకు చపాట మిర్చి ప్రత్యేకం. దీని రంగు బాగుంటుంది. పచ్చళ్లకు ఉపయోగిస్తాం. కూరల్లో చిక్కదనం (గ్రేవీ) వస్తుంది. ఏటా ఈ కారం పొడిని పంపాలని దూరప్రాంతాల బంధువులు, స్నేహితుల నుంచి కాల్స్ వస్తాయి” అని తిమ్మంపేటకు చెందిన మహిళా రైతులు, గృహిణులైన నరహరి సునీత, పాలడుగుల స్వప్న వివరించారు.

చపాట విత్తనాలు

విత్తనాలు

రైతులు చపాట మిర్చి విత్తనాలను సంప్రదాయ పద్దతిలో ఇంటి వద్దే తయారు చేస్తున్నారు.

ఆగస్టులో విత్తనాలు వేసి, నారు పోస్తారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో నాట్లు వేస్తారు. పంట కాలం 5 నుంచి 6 నెలలు.

చపాట విత్తన నిల్వలో మహిళలది చెప్పుకోదగ్గ పాత్ర ఉంది.

తిమ్మంపేటకు చెందిన శ్రీమతమ్మ ఈ పంట గురించి మాట్లాడుతూ.. ”చపాట మిర్చి మా జీవితంలో ఒక భాగం. ఈ పంట సాగులో 50 ఏళ్ల అనుభవం నాది. విత్తనాలు ఇంటి వద్దే తయారు చేస్తాం. నాణ్యమైన కాయల నుంచి విత్తనాలు తీసి ఎండబెట్టి, పురుగు పట్టకుండా పౌడరు (రసాయనం కలిపి) నిల్వచేస్తాం. నారు పోసే ముందు మరోసారి ఎండబెడతాం” అని అన్నారు.

చపాట మిర్చికి కొన్నేళ్లుగా దోమ, నల్లి తెగుళ్లు సోకుతున్నాయి. తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఇలాంటి పంటల విత్తనాలు భద్రపరచడం, పరిరక్షించడం సవాల్‌తో కూడుకున్న పని అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి ఏటా విత్తనశుద్ది క్రమం తప్పకుండా జరపాలని సూచిస్తున్నారు.

శ్రీమతమ్మ

జీఐతో మార్కెట్

వ్యవసాయ శాస్త్రవేత్తల రిపోర్టుల ప్రకారం.. గత 80 ఏళ్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చపాట మిర్చి సాగవుతోంది.

ప్రత్యేక లక్షణాలున్న ఈ చపాట మిర్చికి జీఐ గుర్తింపు కోసం వరంగల్ జల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రైతులు సంఘంగా ఏర్పడి ‘తిమ్మంపేట చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ పేరుతో 2022లో దరఖాస్తు చేశారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని జన్నారెడ్డి వెంకట్ రెడ్డి హార్టికల్చర్ రీసర్చ్ స్టేషన్ (మల్యాల, మహబూబాబాద్ జిల్లా) జీఐ గుర్తింపునకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, పరిశోధనా సహకారాలను అందించింది.

నరహరి రాజ్‌కుమార్ రెడ్డి

”జీఐ గుర్తింపుతో దూరప్రాంతాల నుంచి మా దగ్గరికే కొనుగోలుదారులు వస్తారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయి. మధ్యవర్తులు లేకుండా మా సంఘంతో నేరుగా వ్యాపారం చేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. తక్కువ విస్తీర్ణంలో పండించే పంట కాబట్టి స్థిరమైన ధర పలుకుతుంది” అని తిమ్మంపేట చిల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్యక్షుడు నరహరి రాజ్‌కుమార్ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘జీఐ ట్యాగ్‌తో చపాట సాగు చేసే రైతులు సొంత లోగోతో బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో వీరి ఉత్పత్తులకు ఎక్కువ ధర పలికే అవకాశాలుంటాయి. ఈ పంట సాగు ప్రాంతాల్లో లోకల్ టూరిజం కూడా అభివృద్ది చెందుతుంది. అంతర్జాతీయ ప్రదర్శనల్లో వరంగల్ చపాట చిల్లీ ఉత్పత్తులు ప్రదర్శించవచ్చు’’ అని శాస్త్రవేత్త భాస్కర్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS