SOURCE :- BBC NEWS
శ్రీలతకు 26 సంవత్సరాలు. మూడు సంవత్సరాల క్రితం వాళ్ళున్న ప్రాంతంలో వరదలు బాగా రావడంతో గర్భిణీ అయినప్పటికీ ఆసుపత్రికి వెళ్ళలేకపోయారు. అలా తన మొదటి కాన్పు ఇంటి దగ్గరే అయింది. బిడ్డ ఎనిమిదో నెలలోనే పుట్టి, నాలుగో నెల వచ్చేసరికి విరేచనాలు అయి చనిపోయింది.
ఆ తర్వాత సంవత్సరానికి రెండో గర్భం వచ్చి ఎనిమిది నెలలు పడేసరికి బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇప్పుడు మూడోసారి నెల తప్పారు.
ఆసుపత్రికి వెళితే చాలా ఖర్చు అవుతుందేమో అని ఎప్పుడూ వెళ్ళడానికి ఇష్ట పడేవారు కాదు. కానీ, ఈసారి కూడా వెళ్లకపోతే ఇక తనకి పిల్లలు దక్కరేమో అని భయపడ్డారు.
తప్పనిసరి పరిస్థితుల్లో భర్తను తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు. విషయం చెప్పాక, డాక్టర్ కొన్ని రక్త పరీక్షలు రాశారు. రిపోర్టు వచ్చాక చూసి, తనది ఏ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పారు.
భర్తకు కూడా పరీక్ష చేసి, తనది బీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పారు. ఇలా తల్లికి నెగెటివ్ గ్రూప్ ఉండి, తండ్రికి పాజిటివ్ గ్రూప్ ఉంటే, వారికి ఉన్న జన్యువులను బట్టి బిడ్డకు పాజిటివ్ లేదా నెగెటివ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారు.
బిడ్డకు నెగెటివ్ గ్రూప్ వస్తే ప్రమాదం లేదు కానీ, పాజిటివ్ గ్రూప్ వస్తే మాత్రం ప్రమాదం అని చెప్పారు.
అయితే కంగారు పడొద్దనీ, క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి, మందులు వాడితే బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పారు.
బ్లడ్ గ్రూప్‌లు ఎలా సంక్రమిస్తాయి?
మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలపైన రీసస్ (Rhesus) అనే ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి.
అయితే, ఈ ఎర్ర రక్త కణాలపై ఆర్. హెచ్ డి (Rhesus D) అంటిజెన్ ఉంటే పాజిటివ్ గ్రూప్ అనీ, ఆ ప్రోటీన్ ఎర్ర రక్త కణాలపైన లేకపోతే నెగెటివ్ గ్రూప్ అని అంటాం.
ఏ జన్యువు కారణం?
ఆర్.హెచ్ పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది ఒకటవ క్రోమోజోమ్ పైన ఉన్న జన్యువులను బట్టి నిర్ణయమవుతుంది. దీనికి A, B, O బ్లడ్ గ్రూపులకు సంబంధం లేదు.
ఈ ఆర్.హెచ్ అనేది కేవలం రెండు రకాల అల్లీల్స్ వలన నిర్ణయమవుతుంది. కింది టేబుల్లో తల్లిదండ్రుల నుంచి సంక్రమించే Dd అల్లీల్లు, బిడ్డల ఆర్.హెచ్ పాజిటివ్ లేదా నెగెటివ్ స్టేటస్‌లను ఎలా నిర్ణయిస్తాయో చూడవచ్చు.
తల్లిదండ్రులిద్దరికీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా, వారికి ఉన్న జన్యువుల అల్లీల్స్ బట్టి బిడ్డకు నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రతి వంద మందిలో ఐదు నుంచి పది మందికి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అదే విదేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ.
నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వల్ల బిడ్డకి హాని కలుగుతుందా?
తల్లికి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, బిడ్డకు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే దానిని ఆర్. హెచ్ ఇన్ కంపాటిబిలిటీ (Rh incompatibility) అంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసినప్పుడు, బిడ్డ రక్తకణాల పైన ఉన్న ఆర్ హెచ్ ఆంటీజెన్ (Rh antigen)కు వ్యతిరేకంగా తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి.
అయితే, తల్లి నుండి బిడ్డకి నేరుగా రక్త సరఫరా జరగదు. తల్లికీ బిడ్డకుమధ్యలో మావి (ప్లాసెంటా) ఉంటుంది. తల్లి రక్తం నుంచి కేవలం ప్రాణవాయువైన ఆక్సిజన్, పోషకాలు మాత్రమే మావిలోకి, అక్కడి నుండి బిడ్డ రక్తనాళాల్లోకి ప్రసరిస్తాయి.
కానీ, తల్లి రక్తంలో ఉన్న కొన్ని రకాల ఆంటీజెన్లు, యాంటీబాడీలు, చిన్న చిన్న వైరస్లు మాత్రం బిడ్డలోకి ప్రసరించే అవకాశం ఉంటుంది. అందుకే పాజిటివ్ రక్త కణాలకి వ్యతిరేకంగా తయారైన యాంటీబాడీలు మావి ద్వారా బిడ్డలోకి ప్రవేశించి ఆర్ హెచ్ పాజిటివ్ ఉన్న బిడ్డ రక్త కణాలను చంపే ప్రయత్నం చేస్తాయి.
అప్పుడు బిడ్డకు ఎర్ర రక్తకణాలు తక్కువై, మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. రక్తకణాలు ఎక్కువగా చనిపోవడం వల్ల బిడ్డకి జాండిస్ వస్తుంది. దీనిని హెమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబోర్న్ (HDNB) అంటారు. దీని బారిన పడ్డ పసిపిల్లలు బ్రతికే అవకాశాలు తక్కువ.
అందుకే తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఆర్ హెచ్ నెగెటివ్ మహిళకు ఎప్పుడూ కూడా పాజిటివ్ రక్తం ఎక్కించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటి కాన్పు సమయం నుంచే అప్రమత్తంగా ఉండి, డాక్టర్ సూచించినపుడు యాంటి డి ఆర్ హెచ్ ఆంటీబాడీ అనే ఇంజెక్షన్‌ను తీసుకోవాలి.
బిడ్డ రక్త కణాలు తల్లిలోకి ఎప్పుడెప్పుడు ప్రవేశిస్తాయి?
అబార్షన్ అయినప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు పొట్టకి గట్టిగా దెబ్బ తాకితే, ఆమ్నియోసెంటసిస్ లేదా కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అనే టెస్టులు చేసినప్పుడు బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసే అవకాశం ఉంటుంది.
కాన్పు సమయంలో కూడా బిడ్డ రక్తం చాలా కొద్ది మోతాదులో (1-5ml) తల్లి రక్తంలో కలిసే అవకాశం ఉంటుంది. పై పరిస్థితుల్లో వెంటనే తల్లి రక్తం బిడ్డ రక్తంలో ఉన్న యాంటిజెన్లను గుర్తించి, ఆంటీబాడీలను తయారు చేసుకుంటుంది.
దానికి సంబంధించిన జ్ఞాపక కణాలను (మెమరీ సెల్స్)ను కూడా తయారు చేసుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి యాంటీజెన్ మళ్ళీ కనపడితే (తల్లి రక్తంతో కలిస్తే) వెంటనే ఈ జ్ఞాపక కణాలు స్పందించి బోలెడు ఆంటీబాడీలను తయారు చేస్తాయి.
అప్పుడు బిడ్డకీ, తల్లికీ ఇద్దరికీ ప్రమాదమే. అందుకే మొదటి బిడ్డ కాన్పు మామూలుగా జరిగినా, తర్వాత వచ్చే గర్భాలు ప్రమాదకరం అవుతాయి.
ఏం చేయాలి?
నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న గర్భిణికి, (పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న భర్త/పార్టనర్ ఉంటే) ఆ గర్భిణికి యాంటీ-డీ యాంటీబాడీ (Anti Rh D antibody) అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
మొదటి డోసు ఏడో నెల దాటాక, రెండో డోసు బిడ్డ పుట్టాక 72 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండో డోసు బిడ్డకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటేనే ఇస్తారు.
తల్లికి అబార్షన్ అయినా లేదా పైన పేర్కొన్న ఎలాంటి సందర్భాల్లో అయినా ఈ యాంటీ-డి యాంటీబాడీ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
మనదేశంలో గర్భం నమోదు చేసుకున్న ప్రతి స్త్రీకి బ్లడ్ గ్రూప్ పరీక్ష చేస్తారు. అయితే చాలా జంటలకు ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మళ్లీమళ్లీ అబార్షన్లు జరగడం లేదా శిశువు చనిపోయి పుట్టడం వంటివి జరుగుతుంటాయి.
అందుకని ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పట్ల గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చాలా అవసరం.
స్త్రీలకి మాత్రమే ఈ అవగాహన అవసరమా?
నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ విషయాలను తెల్సుకోవాలి. ఎందుకంటే ఏదైనా పరిస్థితిలో రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు (ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, సర్జరీలు, రక్త హీనత, పైల్స్ సమస్య ఉన్న వారు, అవయవ మార్పిడి సమయాలు, క్యాన్సర్ మొదలైనవి వచ్చినపుడు) వీరికి కచ్చితంగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది.
ఏదైనా ఆపరేషన్ కోసం వైద్యుల దగ్గరకి వెళ్ళినపుడు తప్పనిసరిగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అని వారికి చెప్పాలి. జేబులో బ్లడ్ గ్రూప్‌ను తెలిపే ఐడి కార్డు పెట్టుకోవడం, తెలిసిన వాళ్ళలో/బంధువుల్లో నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఉంటే, వారి పేరు, ఫోన్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోవడం ఉత్తమం.
రక్తదానం చేయచ్చా?
అన్ని ఆవిష్కరణల్లాగే, బ్లడ్ గ్రూప్‌లను కనుగొనడం ఒక ఎత్తు అయితే దాన్ని సమాజం కోసం లేదా వ్యక్తుల ప్రాణాలను కాపాడటం కోసం ఉపయోగించడం మరొక ఎత్తు.
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆరోగ్యం, చికిత్స విభాగాల్లో జరిగిన వేగవంతమైన అభివృద్ధి వలన, ఆ కాలంలోనే యుద్ధంలో గాయపడిన ఎందరో జవానులకి రక్తం ఎక్కించి, వారి ప్రాణాలు కాపాడారు.
కానీ, ఇప్పటికీ ప్రతీ ఏటా మన దేశంలో సరైన సమయంలో రక్తం అందకపోవడం వల్ల కొన్ని లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
అందులోనూ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి రక్తం దొరకడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యంగా ఉన్న నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఈ చర్య ద్వారా కచ్చితంగా కొంత మంది ప్రాణాలను నిలబెట్టవచ్చు.
రక్తదానం, రక్త మార్పిడి గురించి తెలుసుకోవడానికి ఫ్రీ టోల్ నెంబర్ 104 కి కాల్ చేయవచ్చు.
మనకు దగ్గరలో రక్తం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం e-RaktKosh (www.eraktkosh.in) అనే వెబ్సైట్ ఏర్పాటు చేసింది. అందులో ఏ బ్లడ్ గ్రూప్ రక్తం ఏ ఆసుపత్రిలో ఎంత అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంటే ఎన్ని యూనిట్లు ఉన్నాయి అనే వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)