SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాం దాడి తరువాత దానికి సంబంధించినవి, బాధితులవి పలు వీడియోలు బయటికి వచ్చాయి. ఈ వీడియోలలో ఒకటి గుజరాత్‌కు చెందిన శీతల్ కలాథియాది. శీతల్ భర్త 44 ఏళ్ల శైలేష్‌భాయ్ కలాథియా కూడా ఈ దాడిలో మరణించారు.
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సూరత్‌లోని శీతల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు.
శీతల్ కేంద్రమంత్రితో మాట్లాడుతూ “మీకు చాలా వీఐపీ కార్లున్నాయి. మరి, పన్ను చెల్లించే వారి సంగతేంటి? అక్కడ సైనికులు, వైద్యులు లేరు” అని అన్నారు.
పహల్గాం దాడి నుంచి మహారాష్ట్రకు చెందిన పరాస్ జైన్ బయటపడ్డారు. ఆయనతో ‘ది హిందూ’ మీడియా మాట్లాడింది. ఈ దాడి 25-30 నిమిషాల పాటు కొనసాగిందని పరాస్ చెప్పారు. అక్కడ పోలీస్, జవాన్ ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు.
దాడి జరిగిన ప్రదేశానికి ఏడు కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) శిబిరం ఉంది. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్) శిబిరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఫొటో సోర్స్, ANI
బైసరన్‌లో భద్రత ఎందుకు లేదు?
పహల్గాంలో దాడి తర్వాత, చాలామందికి వస్తున్న ప్రశ్న.. ఈ పర్యటక ప్రదేశంలో భద్రత ఎందుకు లేదు?.
“1990ల నుంచి జమ్ముకశ్మీర్‌లో సైనిక భద్రత లేని బహిరంగ ప్రదేశం నేనెప్పుడూ చూడలేదు. ప్రతిచోటా భద్రతా సిబ్బంది కనిపిస్తారు. కానీ, ఈ ప్రాంతంలో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది ” అని జర్నలిస్ట్, కశ్మీర్ వ్యవహారాల నిపుణురాలు అనురాధ భాసిన్ అన్నారు.
దాడి జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుల పేర్లు ఎలా బయటికొచ్చాయని అనురాధ ప్రశ్నించారు.
“భద్రతా దళాలు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కొంత సమయం తర్వాత వారి వద్ద నిందితుల స్కెచ్‌లు ఉన్నాయి. వారిని ఎలా గుర్తించారు?” అని ఆమె ప్రశ్నించారు.
“గత ఐదేళ్లలో పలు సంఘటనలు జరిగాయి. ఉగ్రవాదం ముగిసిందని చెప్పలేం. భద్రతా అధికారులు కూడా ఈ సమస్య గురించి మాట్లాడేటప్పుడు ‘నియంత్రించాం’ వంటి పదాలను ఉపయోగించారు తప్ప ‘అంతం’ వంటి పదాలను వాడలేదు. ఉగ్రవాదం అంతమైందనేది ‘రాజకీయ కథనం’. గత ఐదేళ్లలో ఎలాంటి శాంతి ఏర్పడినా అది కేవలం సైనిక నియంత్రణ కారణంగానే జరిగింది” అని అనురాధ భాసిన్ అన్నారు.
ప్రొఫెసర్ అమితాబ్ మట్టూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో బోధిస్తుంటారు. అంతర్జాతీయ సంఘర్షణ, భద్రత విషయాలలో ఆయన నిపుణుడు.
అనురాధ ప్రశ్నలకు మట్టూ సమాధానమిస్తూ “గత కొన్ని సంవత్సరాలుగా పర్యటక ప్రాంతాలలో సైనిక దళాలను తక్కువగా మోహరించే విధానాన్ని తీసుకొచ్చారు” అని ఆయన అన్నారు.
“వారు ఒక వ్యూహాన్ని అవలంబించారు, అది ప్రభావవంతంగానే ఉంది కానీ, స్పష్టంగా లేదు. ఇది పెద్ద భద్రతా లోపం” అని మట్టూ అభిప్రాయపడ్డారు.
పర్యటకులు మారుమూల ప్రాంతానికి వెళుతున్నందున అక్కడ కూడా భద్రత పెంచి ఉండాల్సిందని జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ బీబీసీతో అన్నారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా కూడా చాలాకాలం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు.
దువా మాట్లాడుతూ “సైన్యం, నేషనల్ రైఫిల్స్ దేశం లోపల ప్రతిచోటా ఉండలేవు. వారిని సరిహద్దులో మోహరిస్తారు. పోలీసుల గురించి మాట్లాడుకుంటే.. కశ్మీర్ లోయ 120 కిలోమీటర్ల పొడవు, 38 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రతిచోటా పోలీసులను మోహరించడం సాధ్యం కాదు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సామాన్య ప్రజలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
పహల్గాం దాడిలో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడిలో భిన్నమైన విధానం అనుసరించారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చాలాకాలం తర్వాత సాధారణ ప్రజలను ఇంత పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్న దాడి ఇదే.
సతీశ్ దువా దీనిని గురించి మాట్లాడుతూ.. “గత ఐదేళ్లలో కశ్మీర్ లోయలో పరిస్థితి మెరుగుపడింది, సానుకూల మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి తిరిగి రావడం ప్రారంభించారు. పర్యటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెర్రరిస్టులు ఎక్కువగా పర్యటక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోరు. అది కశ్మీర్‌లోనైనా మరెక్కడైనా. ఎందుకంటే టెర్రరిస్టులు అలా చేస్తే, అది స్థానిక కశ్మీరీల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకోవడమే అవుతుంది. టెర్రరిస్టులు స్థానికుల నుంచి మద్దతు ఆశిస్తారు. అలా దాడిచేస్తే వారికి మద్దతు దొరకదు” అని అన్నారు.
“నేను కార్ప్స్ కమాండర్‌గా పనిచేసినపుడు కశ్మీర్‌కు రావొచ్చా అని ప్రజలు నన్ను అడిగేవారు. దయచేసి రండి అని చెప్పేవాడిని. దాల్ సరస్సు దగ్గర కూర్చోవచ్చు, పర్యటక ప్రదేశాలను సందర్శించవచ్చని చెప్పేవాడిని. ఎందుకంటే ఆ ప్రాంతాలలో ఎలాంటి దాడులు జరగవు” అని ఆయన అన్నారు.
ఈసారి హిందువులే లక్ష్యంగా దాడి జరిగిందని అమితాబ్ మట్టూ అభిప్రాయపడ్డారు.
“ఉగ్రవాద గ్రూపులు పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఎందుకు ప్రారంభించాయి? కశ్మీర్లో సాధారణ స్థితి ఉందనే ఆలోచన తప్పని చెప్పడానికా? గతంలో ఉగ్రవాద గ్రూపులకు ఒక వ్యూహం ఉండేది. వారు స్థానిక ప్రజలుండే ప్రాంతాలలో కాకుండా, సైనిక లక్ష్యాలపై దృష్టి సారించేవారు. కానీ ఇప్పుడు ఆ తేడా లేదు, ఈసారి హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు” అని మట్టూ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని ఇతర ప్రాంతాలలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం కూడా పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక కారణమని దువా అభిప్రాయపడ్డారు.
“ఉగ్రవాదులు హిందూ పురుషులను వేరు చేసి చంపారు. మహిళలు తమ నగరాలకు తిరిగి వెళ్లి వీటన్నింటి గురించి చెప్పడమే వారి ఉద్దేశం. ఒక మహిళ ఆవేదన ప్రతిచోటా ప్రభావం చూపుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాలలో భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. మనం వారి ఉచ్చులో పడకూడదు” అని దువా అన్నారు.
ఇది 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి లాంటిదేనని దువా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
నిఘా వైఫల్యమా?
పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయంపై తనకు ఎలాంటి సందేహం లేదని అమితాబ్ మట్టూ అన్నారు.
“పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా వంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయని అక్కడి ప్రభుత్వానికి తెలియదా? దాడిలో పాకిస్తాన్ ప్రమేయంపై నాకు ఎటువంటి సందేహం లేదు. ఇది నిఘా వైఫల్యం. ఈ దాడిని పసిగట్టి, దానిని విఫలం చేయగలిగే ఎలక్ట్రానిక్ వ్యవస్థ భారత్ వద్ద ఎందుకు లేదు?” అని మట్టూ ప్రశ్నించారు.
సతీశ్ దువా కూడా ‘నిఘా వైఫల్యమే ఇక్కడ జరిగిన పెద్ద తప్పు’ అని అభిప్రాయపడ్డారు.
“ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక ప్రకటన చేశారు. ఇందులో ఆయన హిందువులు, ముస్లింల గురించి మాట్లాడారు. ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థాయి ఉగ్రవాద దాడిని ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఆమోదిస్తారు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి” అని దువా అన్నారు.
“దేశం మానవ నిఘా (హ్యూమన్ ఇంటెలిజెన్స్) మెరుగుపరుచుకోవాలి. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ రెండు రకాల నిఘా వ్యవస్థల మేలు కలయిక అత్యంత అవసరం” అని ఆయన సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)