SOURCE :- BBC NEWS

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

ఫొటో సోర్స్, Getty Images

47 నిమిషాలు క్రితం

పహల్గాం దాడి అనంతర పరిస్థితులపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ల మధ్య ఆదివారం ఫోన్ సంభాషణ జరిగింది.

భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను చైనా నిశితంగా గమనిస్తోందని ఈ సందర్భంగా చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. పహల్గాం దాడిపై వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తు ప్రారంభించడానికి మద్దతు ఇస్తున్నట్లు చైనా తెలిపింది.

ఈ విషయంలో రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని చైనా ఆశిస్తోందని ఆ పత్రిక రాసింది.

ఇంతకీ చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య ఇంత దగ్గరి స్నేహం ఎక్కడిది? గతంలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? అసలు ఈ పహల్గాం ఘటనలో చైనా ఎలా స్పందించింది?

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది మరణించారు.

ఈ దాడిని ఖండిస్తూ చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ప్రకటించారు.

మరోవైపు ఈ దాడులపై పాకిస్తాన్ కూడా స్పందించింది. బాధ్యతాయుతమైన దేశంగా నిష్పాక్షికమైన, పారదర్శకమైన, విశ్వసనీయ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం ప్రకటించారు.

కానీ, భారత్, పాకిస్తాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు మారిపోతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇషాక్ దార్

ఫొటో సోర్స్, Getty Images

పాక్, చైనాలు ఏం చర్చించాయి?

గ్లోబల్ టైమ్స్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి ఫోన్‌లో ఇషాక్ దార్ వివరించారు.

“ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ దృఢంగా నిలబడుతుంది. ఉద్రిక్తతలను పెంచే ఏ చర్యలనైనా వ్యతిరేకిస్తుంది” అని ఇషాక్ దార్ అన్నారు.

ఆ పోస్టులో “పాకిస్తాన్ శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి అనే ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అన్ని స్థాయిలలో సన్నిహిత సంబంధాలు, సమన్వయాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు” అని తెలిపింది.

“ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్ని దేశాల బాధ్యత. పాకిస్తాన్ తీసుకునే ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు చైనా మద్దతు ఉంటుంది” అని వాంగ్ యి అన్నారు.

“పాకిస్తాన్ భద్రతా సమస్యలను చైనా పూర్తిగా అర్థం చేసుకుంటుంది. పాక్ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆ దేశం చేసే ప్రయత్నాలకు మద్దతిస్తుంది” అని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా పహల్గాం దాడి ఘటనపై న్యాయమైన దర్యాప్తు జరగాలంటూ పాకిస్తాన్ చేసిన డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది.

పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, @CMShehbaz

పాకిస్తాన్ ప్రధాని ఏమన్నారు?

పహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్‌పై భారత్ ‘తప్పుడు ఆరోపణలు’ చేసిందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ శుక్రవారం అన్నారు.

“మా పొరుగు దేశం ఎటువంటి దర్యాప్తు, ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌పై నిరాధార ఆరోపణలు చేసింది. న్యాయమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తులో సహకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది” అని ఆయన అన్నారు.

“మేం శాంతిని కోరుకుంటాం, కానీ దానిని మా బలహీనతగా పరిగణించకూడదు” అని షాబాజ్ షరీఫ్ అన్నారు.

పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని అన్ని విధాలుగా కాపాడుకుంటుందన్నారు. సరిహద్దులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉందని, దీనిలో ఎటువంటి సందేహం లేదన్నారు షరీఫ్.

పాకిస్తాన్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్, చైనా సంబంధాలు

పాకిస్తాన్, చైనాలు ప్రస్తుతం సన్నిహిత మిత్రులు. ఆర్థిక, రక్షణ రంగంలో పాకిస్తాన్‌కు చైనా సహాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు దేశాల స్నేహం ప్రతిబింబిస్తుంటుంది. అయితే, ఈ స్నేహం గతంలో ఇంత సన్నిహితంగా లేదు.

1956లో అప్పటి చైనా ప్రధానమంత్రి చౌ ఎన్ లై పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ పర్యటన చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు నాంది పలికింది.

అయితే, 1958లో పాకిస్తాన్‌లో సైనిక పాలన వచ్చింది. అప్పుడు చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌గా ఆర్మీ జనరల్ అయూబ్ ఖాన్ ఉన్నారు. చైనా విస్తరణ విధానంపై అయూబ్ ఖాన్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో 1959లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కలిశారు అయూబ్ ఖాన్.

ఆ ఏడాది ఏప్రిల్ 24న ‘ఉమ్మడి రక్షణ ఒప్పందం’ను ప్రతిపాదించారు అయూబ్ ఖాన్. కానీ నెహ్రూ తిరస్కరించారు.

1961లో జుల్ఫికర్ అలీ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఆ సమయంలో చైనాకు మద్దతుగా సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టినపుడు పాక్ దానికి అనుకూలంగా ఓటు వేసింది. అప్పటి నుంచి చైనాకు పాకిస్తాన్ మద్దతుదారుగా ఉంటోంది.

1962లో సరిహద్దు విషయంలో భారత్‌, చైనాల మధ్య యుద్ధం కూడా జరిగింది. చాలా సంవత్సరాలుగా ఇండియాతో ఉన్న ఈ ఉమ్మడి శత్రుత్వమే చైనా, పాక్ స్నేహానికి ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు.

అయితే, వారి స్నేహానికి ఇది మాత్రమే కారణం కాదు. ఎందుకంటే, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో చైనాకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి.

మిలటరీ భాగస్వామ్యం

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ స్థాయిలో..

భారత్‌కు వ్యతిరేకమైన విషయాలలో పాకిస్తాన్‌కు చైనా నిర్భయంగా మద్దతు ఇచ్చిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ హర్ష్ పంత్ 2021లో బీబీసీతో జరిగిన ఒక సంభాషణలో చెప్పారు.

హర్ష్ పంత్ చెప్పిన ప్రకారం.. ఉగ్రవాద అంశంపై పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకుండా, ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్టులో పడకుండా పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది చైనా.

అంతేకాదు, కశ్మీర్ సమస్యను చైనా ద్వైపాక్షికంగా చూడొచ్చు కానీ, అలా చేయలేదు. పాకిస్తాన్‌లో చైనా ప్రతిష్టాత్మకమైన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ కింద నిర్మిస్తున్న వాణిజ్య నెట్‌వర్క్‌లో ‘చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్’ లేదా సీపీఈసీ ఒక భాగం. ఈ ప్రాజెక్టు కింద పాకిస్తాన్‌లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో వేల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది చైనా.

పాకిస్తాన్‌ను చైనా ఆర్థికంగానూ ఆదుకుంది, పాక్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నపుడు చైనా అప్పులిచ్చింది. చైనాలో వీగర్ ముస్లింల కోసం పాకిస్తాన్ ఎక్కువగా గొంతెత్తలేదు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) విస్తరించాలనుకున్నపుడు భారత్‌ను చేర్చుకోవాలని రష్యా సూచించగా, పాకిస్తాన్ పేరును ముందుకు తెచ్చింది చైనా.

పాకిస్తాన్‌కే అత్యధికంగా చైనా ఆయుధాలు

చైనా, పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యం చైనాలో శిక్షణ పొందుతోంది. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తుంటారు.

అణ్వాయుధాలు, యుద్ధనౌకలు, విమానాలు, క్షిపణులు వంటి సైనిక పరికరాలను తయారు చేయడంలోనూ పాకిస్తాన్‌కు సహాయం చేస్తుంది చైనా.

పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం.. చైనా ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం పాకిస్తాన్. 2000-14 కాలంలో చైనా మొత్తం ఆయుధ అమ్మకాలలో 42 శాతం పాకిస్తాన్ కొనుగోలు చేసిందని అమెరికన్ వెబ్‌సైట్ రాండ్ కార్పొరేషన్ చెప్పినట్లు పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)