SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలోని ఈ చిన్న ఊరి పేరు ఒకప్పుడు ప్రపంచమంతటా మార్మోగింది..
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది.
1980లో ఈ గ్రామానికి పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు క్యూ కట్టారు. ఇంతకీ ఈ గ్రామంలో ఏముంది?
పాలెం తెలంగాణలోని అన్ని గ్రామాల్లాంటిదే.
కానీ 1980లో ఇక్కడ కనిపించిన ఓ దృశ్యం ఈ గ్రామాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపింది.


ఫొటో సోర్స్, opensky.ucar.edu/islandora
సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980
1980 ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. పాలెం గ్రామం నుంచి ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు.
దీంతో సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడానికి పెద్ద ఎత్తున పరిశోధకులు ఈ గ్రామానికి వచ్చారు.
అమెరికాలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసర్చ్’ సంస్థకు చెందిన ‘హై ఆల్టిట్యూడ్ అబ్జర్వేటరీ’ ఈ గ్రహణాన్ని ఫోటోలు తీసేందుకు పాలెం గ్రామానికి కెమెరాను పంపింది.
గార్డన్ న్యూక్రిక్ ఆ కెమెరాను డిజైన్ చేశారు.
పాలెంలో జరిగిన ఈ పరిశోధన సూర్యుడి వలయాన్నిబాగా అర్థం చేసుకుని, సోలార్ ఫిజిక్స్‌లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం బీబీసీకి చెప్పింది.
అదే ఏడాది ‘ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ జర్నల్‌లో ”అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980” పేరుతో ఒక పత్రాన్ని ప్రచురించారు.
వీపీ గౌర్, కేఆర్ బొండాల్, కే సిన్హా, జీసీ జోషి, ఎంసీ పాండే ఈ పత్రాన్ని ప్రచురించారు.
”క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిపి, (అప్పటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు పశ్చిమాన 110 కిమీల దూరంలో పాలెం (మహబూబ్‌నగర్ జిల్లా) అనే చిన్న గ్రామాన్ని ఈ సూర్యగ్రహణ పరిశీలనకు ఎంచుకున్నాం.” అని ఆ పత్రంలో రాశారు ఈ పరిశోధకులు.
వీరి పరిశీలనకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా, అమెరికాకు చెందిన ‘స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ’ సహకారం అందించింది.
‘‘1980 ఫిబ్రవరిలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలించడానికి పాలెం గ్రామానికి సుమారు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వచ్చి దాదాపు 40 రోజుల పాటు ఇక్కడే ఉండి పరిశోధనలు చేశారు’’ అని పాలేంకు చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తన వెబ్సైట్ లో పేర్కొంది.

ఫొటో సోర్స్, eclipse.gsfc.nasa.gov
పాలెంలో తీసిన ఫోటోలతో..
సంపూర్ణ సూర్య గ్రహణాలు భారతదేశంలో చాలా తక్కువ సార్లు కనిపించాయంటున్నారు శాస్త్రవేత్తలు.
”ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణాలను పరిశీలించడం ద్వారా, సూర్యుడి గురించి, సౌర మండల పుట్టుక గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. మూన్ మిషన్ లాంటి సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో ఈ గ్రహణాల పరిశీలన చాలా ముఖ్యమైనది. గుంటూరు దగ్గర ఇలానే ఒక గ్రహణాన్ని పరిశీలించినప్పుడే హీలియంను కనుగొన్న విషయం తెలిసిందే. అందుకే గ్రహణాల పరిశీలన శాస్త్రవేత్తలకు ప్రత్యేకమైనది.” అని బీబీసీకి చెప్పారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు రఘునందన్.
”ఇక పాలెం విషయానికి వస్తే, ఒక గ్రహణాన్ని ఎక్కడ నుంచి పరిశీలించాలన్నది శాస్త్రవేత్తలు ముందుగానే నిర్ణయించుకుంటారు. గ్రహణ మార్గంలో అత్యంత చీకటిగా ఉండేది అంబ్రాపాథ్. ఆ మార్గంలో పాలెం గ్రామం ఉండడం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ సేపు (సుమారు 4 నిమిషాలు) గ్రహణం చూడగలిగే అవకాశం ఉండడం వల్ల ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆకాశం నిర్మలంగా ఉండడమూ అనుకూలించింది. పాలెంలో ఎన్సీఏఆర్ సంస్థ ఒక కెమెరా పెట్టింది. గ్రహణాల ఫోటోగ్రఫీలో పాలెంలో కొత్త పద్ధతులు అనుసరించారు. గ్రహణాల పరిశీలన పద్ధతులు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలం అది. అందుకే అంత ప్రత్యేకంగా పాలెం వచ్చి ఉంటారు వారు. పాలెంలో జరిగిన పరిశీలనలో సూర్యుని ఔటర్ కరోనాలో మధ్య భాగాన్ని బాగా అధ్యయనం చేశారు.” అని చెప్పారు రఘునందన్.
ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం వివరాల ప్రకారం, పాలెంలో జరిగిన పరిశీలన సూర్యుని గురించిన కొత్త విషయాలను అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడింది.
వాటిలో కొన్ని:
- సూర్యుని కరోనా హై రెజల్యూషన్ ఫోటోలు దొరికాయి.
- వాటివల్ల సూర్యుని కరోనాలోని సంక్లిష్ట అయస్కాంత నిర్మాణాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి.
- భూవాతావరణంతో పాటూ ఐనో స్ఫియర్ పై సూర్యుని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.
- భారత్ – అమెరికా శాస్త్రవేత్తలు కలసి పనిచేయడానికి అవకాశం కల్పించింది.
అప్పట్లో ఒక గ్రహణం ఎక్కడ ఏర్పడితే అక్కడకు పరుగులు తీసిన శాస్త్రవేత్తలు, ఇప్పుడు తమ పరిశీలన కోసం అవసరమైతే కృత్రిమ గ్రహణాలు సృష్టించే స్థాయికి ఎదిగారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS