SOURCE :- BBC NEWS

పిల్లులు

ఫొటో సోర్స్, Getty Images

గార్‌ఫీల్డ్, పస్ ఇన్ బూట్స్, డిస్నీ ‘ది అరిస్టోకాట్స్‌’లో టౌలౌస్ పాత్ర.. ఇవన్నీ సినిమాల్లో చూపించే పిల్లుల సాంస్కృతిక చిహ్నాలు. సందేహమే లేదు, ఇవన్నీ నారింజ రంగులోనే కనిపిస్తుంటాయి.

నారింజ రంగు బొచ్చుతో చూడముచ్చటగా ఉండే ఈ పెంపుడు పిల్లుల, మరీముఖ్యంగా మగ పిల్లుల డీఎన్ఏ రహస్యాన్ని, వాటి అద్భుతమైన రంగు వెనుకాల ఉన్న కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఎరుపు లేదా నారింజ రంగు బొచ్చు ఉండే పిల్లులు తమ జెనెటిక్ కోడ్‌లో ఒక భాగాన్ని కోల్పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల వాటి బొచ్చు, కళ్లు, చర్మ రంగుకు కారణమయ్యే కణాలు లేత రంగులను (లైటర్ కలర్స్‌) ఉత్పత్తి చేస్తున్నాయని కనుగొన్నారు.

శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ రహస్యం కేవలం వారికి మాత్రమే కాదు, ఈ పరిశోధన కోసం నిధులు సమకూర్చిన వేల మంది పిల్లుల అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

నారింజ రంగు పిల్లులు కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి కూడా సాయపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ పరిశోధన

నారింజ రంగులో బొద్దుగా ఉండే పిల్లులకు ఈ వైవిధ్యమైన వర్ణం వాటి జెనెటిక్స్ మూలంగా వచ్చిందని దశాబ్దాలుగా మనకు తెలుసు. కానీ, జెనెటిక్ కోడ్‌లో దీని కచ్చితమైన స్థానాన్ని శాస్త్రవేత్తలు ఇన్నిరోజులూ గుర్తించలేకపోయారు.

జపాన్‌లోని క్యుషు యూనివర్సిటీ, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల రెండు బృందాలు ఈ రహస్యాన్ని వెల్లడిస్తూ గురువారం ఒకే సమయంలో కథనాలను ప్రచురించాయి.

పిల్లి చర్మం, వెంట్రుకల కుదుళ్లు, కంటి రంగులకు కారణమయ్యే కణాల మెలనోసైట్లలో ARHGAP36 జన్యువు చాలా చురుగ్గా ఉందని శాస్త్రవేత్తల బృందాలు కనుగొన్నాయి.

మెలనోసైట్లు అనేవి చర్మంలోని ప్రత్యేక కణాలు మెలనిన్ (melanin)ను ఉత్పత్తి చేస్తాయి. చర్మ రంగుకు ఈ మెలనినే కారణం.

డీఎన్ఏ కణాలతో జన్యువులు రూపొందుతాయి. ఇతర జీవుల మాదిరిగానే పిల్లుల కణాలకు ఇవెలా పనిచేయాలో సూచనలు ఇస్తాయి.

నారింజ రంగులో ఉన్న, లేని డజన్ల పిల్లులను తీసుకుని వాటి డీఎన్ఏను పరీక్షించారు.

నారింజ రంగు పిల్లుల ఈ ARHGAP36 జన్యువులో డీఎన్ఏ కోడ్‌లోని ఒక భాగం లేదని వారు కనుగొన్నారు.

ఈ డీఎన్ఏ లేకపోవడంతో, ARHGAP36 మరింత చురుగ్గా పనిచేస్తుంది. లేత వర్ణాన్ని ఉత్పత్తి చేసేలా ఈ మెలనోసైట్లకు జన్యువులు సూచనలు ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

చాలా వరకు మగ పిల్లులే

నారింజ వర్ణంలో ఉండే పిల్లులు చాలా వరకూ మగవే ఉంటున్నాయని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు గమనించిన విషయం. ఈ జన్యువు ఎక్స్ క్రోమోజోమ్‌పై ఉందనే వాస్తవానికి ఇది దగ్గరగా ఉంది.

డీఎన్ఏలో ఎక్కువ భాగం క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇతర పెద్ద జంతువుల మాదిరిగానే మగ పిల్లులకు ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. వీటిల్లో వేర్వేరు సంఖ్యలో జన్యువులు ఉంటాయి.

ఈ జన్యువు కేవలం ఎక్స్ క్రోమోజోమ్‌పై ఉంటుంది కాబట్టి, వర్ణ ఉత్పత్తిని ఇది నియంత్రిస్తుంది. పిల్లి పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులోకి మారడానికి కోల్పోయిన డీఎన్ఏ భాగం సరిపోతుంది.

ఆడ పిల్లులకు రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. లేతైన వర్ణపు ఉత్పత్తిని ఒకే స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఈ రెండు క్రోమోజోమ్‌లపై కూడా డీఎన్ఏ కోల్పోవాల్సి ఉంటుంది. అంటే మిశ్రమ రంగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

” అభివృద్ధి ప్రారంభ క్రమంలో ప్రతి ఒక కణంలో ఉన్న ఒక ఎక్స్ క్రోమోజోమ్ యాదృచ్ఛికంగా మార్పుకు గురైనప్పుడు, ఈ నారింజ, నలుపు రంగులు వస్తుంటాయి” అని క్యుషు యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ హిరోయుకి ససాకి చెప్పారు.

క్యాట్స్

ఫొటో సోర్స్, Getty Images

శాస్త్రీయ ఉత్సుకత

ఈ అధ్యయనం శాస్త్రీయ సిద్ధాంతాల ఆధారంగా జరిగినప్పటికీ, తొలుత ఈ ప్రాజెక్టును ప్రొఫెసర్ ససాకి తన ఆసక్తితోనే ప్రారంభించారు.

ఆయన యూనివర్సిటీ నుంచి పదవీ విరమణ పొందారు. పిల్లుల ప్రేమికుడు. నారింజ రంగు పిల్లుల జన్యువును కనుగొనడం ”పిల్లుల వ్యాధులను అరికట్టేందుకు సహకరిస్తుంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిశోధన కోసం క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా, జపాన్‌లోని వేల మంది పిల్లుల ప్రేమికుల నుంచి 10.6 మిలియన్ యెన్‌లను (రూ.62,74,820) ససాకి, ఆయన బృందం సేకరించింది.

” మేం తోబుట్టువులం. మేం ఒకటో తరగతి, మూడో తరగతి చదువుతున్నాం. మా పాకెట్ మనీని ఈ ప్రాజెక్టు కోసం విరాళం ఇచ్చాం. కాలికో క్యాట్‌లపై అధ్యయనం కోసం వీటిని వాడండి” అని ఒక దాత రాశారు.

ప్రొఫెసర్ ససాకి

ఫొటో సోర్స్, Hiroyuki Sasaki/Kushu University

శరీరంలో ఇతర భాగాల్లో కూడా ARHGAP36 జన్యువు చురుగ్గా ఉంది. ముఖ్యంగా మెదడు, హర్మోనల్ గ్రంథుల్లో ఇది ఉంది.

జన్యువులోని డీఎన్ఏ మ్యుటేషన్, ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉండే శరీర భాగాల్లో ఇతర మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మానవుల్లో కూడా ARHGAP36 జన్యువును గుర్తించారు. ఇది చర్మ కేన్సర్, జుట్టు ఊడిపోవడంతో లింక్ అయి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)