SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Nitesh Raut/BBC
మహారాష్ట్రలోని యవత్మాల్ నగరం సమీపంలోని చౌసాలా అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని మే 15న గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇది హత్య కేసుగా తేలింది.
ఈ హత్యకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసే భార్య, తన ఇద్దరు విద్యార్థుల సాయంతో భర్తకు విషమిచ్చి చంపేసినట్లు తెలిసింది. తరువాత శవాన్ని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టినట్టు పోలీసులు చెప్పారు.
ఆ మృతదేహం 32 ఏళ్ల శంతన్ దేశ్ముఖ్ది. నిందితురాలు ఆయన భార్య నిధి దేశ్‌ముఖ్ అని పోలీసులు తెలిపారు.

శంతన్ మే 13 నుంచి కనిపించడం లేదు. విషం కలిపిన పండ్ల రసాన్ని ఇచ్చి భర్తను హత్య చేసి, ఇద్దరు విద్యార్థుల సాయంతో శవాన్ని తగలబట్టినట్టు నిధి దేశ్‌ముఖ్‌పై అభియోగం ఉంది.
నిధి దేశ్‌ముఖ్‌పై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. మూడు రోజులు ఆమెను పోలీసు కస్టడీకి పంపించారు.
మృతదేహాన్ని కాల్చేందుకు నిధికి సాయపడ్డ ఇద్దరు మైనర్ నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలు ఈ కేసులో ఏం జరిగింది? భార్యే తన భర్తను ఎందుకు చంపింది? పోలీసుల విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి?

ఫొటో సోర్స్, Family
అసలేంటీ కేసు?
ఏడాది కిందట శంతన్, నిధి ప్రేమ వివాహం చేసుకున్నారు. శంతన్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అప్పటికే శంతన్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఆయన అలవాట్లతో కుటుంబం ఇబ్బంది పడింది. తమకు దూరంగా ఉండమని ఆయనను తల్లిదండ్రులు హెచ్చరించారు.
దీంతో భార్యతో కలిసి శంతన్ వేరు కాపురం పెట్టారు. ఈ ఇద్దరూ సుయోగ్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ ఒకటే స్కూల్లో పనిచేసేవారు.
శంతన్ యవత్మాల్లోని సన్‌రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండగా… ఆయన భార్య నిధి దేశ్‌ముఖ్ అదే స్కూల్‌కు ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు.
పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే, శంతన్ భార్యను వేధించడం మొదలు పెట్టారు. శంతన్ మద్యానికి బానిస అవ్వడంతో రోజూ గొడవలు జరిగేవి. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తరచూ శంతన్ భార్యను వేధించేవారు. డబ్బులు ఇవ్వకపోతే, ఆమెను కొట్టేవారు. శంతన్ తన భార్యకు సంబంధించిన అశ్లీలఫోటోలు తన ఫోనులో భద్రపరిచారని పోలీసులు తెలిపారు.మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే, ఆ ఫోటోలు వైరల్ చేస్తానని నిధిని తరచూ బెదిరించేవారు. దీంతో విసిగిపోయిన నిధి, ఆయన్ని హతమార్చాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్య ఎలా చేశారు?
భర్తను చంపడానికి, విషాన్ని ఎలా తయారు చేయాలనే విషయంపై నిధి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత, మహాదేవ ఆలయ ప్రాంతం నుంచి పండ్లు, పూలు తీసుకొచ్చారు. ఆ పండ్లు, పూలతో రసాన్ని తయారుచేసి, అందులో 15 పారాసిటమల్ టాబ్లెట్లను కలిపారు.
ఇంటర్నెట్లో విషపూరిత పూల గురించి నిధి సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. దాంతో అలాంటి పువ్వులను వీలైనన్ని సేకరించి, వాటితో రసాన్ని తయారు చేసి మద్యం మత్తులో ఉన్న తన భర్తకు ఇచ్చారు. మే 13 మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంతన్ మరణించారు.
ట్యూషన్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు నిధి విషయమంతా వివరించి, వారి సాయం కోరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
శవాన్ని ఎలా మాయం చేయాలో కూడా పిల్లలకు ఆమె వివరించారు. తరువాత ఆమె, విద్యార్థులు కారులో శవాన్ని తీసుకువెళ్లి అడవిలో పడేశారు. కానీ పోలీసుల కనిపెడతారేమోనన్న భయంతో, మరుసటి రోజు ముగ్గురు కలిసి పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు.
తర్వాత శంతన్ కనిపించకుండా పోయినట్టు నిధి నటించారు. శంతన్ ఫోన్‌ను నిధి ఆన్‌లోనే ఉంచారు. ఆయనకు పదేపదే కాల్స్ చేశారు.
పోలీసులకు అనుమానం రాకుండా, ఆమె శంతన్ ఫోన్లకు మెసేజ్‌లు కూడా పంపేవారు.
సాక్ష్యాధారాలను తుడిచివేసేందుకు ఆమె శాయశక్తులా ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
చొక్కా రంగుతో కనిపెట్టారు
పోలీసులు ఈ కేసు విచారణలో సరైన ఆధారాలను పట్టుకున్నారు. గుర్తు తెలియని మృతదేహం కనిపించినట్లు లోహారా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉంది.
ఆ పోలీసు స్టేషన్ పరిధిలో ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ఈ నేరాన్ని దర్యాప్తు చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే తమ దర్యాప్తులో పోలీసులు ఓ కీలక విషయాన్ని కనుక్కున్నారు.
మే 13వ తేదీన శంతన్తో కలిసి బార్లో మద్యం సేవించిన స్నేహితుడి గురించిన సమాచారం పోలీసులకు తెలిసింది. ఇది పోలీసు దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.
అనుమానంతో ఆ స్నేహితుడిని పోలీసులు ప్రశ్నించారు. అతని మొబైల్లో మే13వ తేదీన తీసిన శంతన్ ఫోటో ఉంది.
”మృతదేహాన్ని గుర్తించిన తర్వాత, దర్యాప్తును ప్రారంభించాం. స్నేహితుని మొబైల్ ఫోన్లో తీసిన ఫోటోలో ఉన్న చొక్కా రంగు, సంఘటనా స్థలం వద్ద కాలిపోయిన మృతదేహంపై ఉన్న చొక్కా రంగు ఒకేలా ఉంది.” అని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ సంతోష్ మాన్వార్ చెప్పారు.
పూర్తి సమాచారం కోసం తాము శంతన్ భార్యను ప్రశ్నించామని చెప్పారు. కానీ, దానికి ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదు. దర్యాప్తు తర్వాత, శంతన్ భార్య నిధి దేశ్‌ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
”నేరాన్ని ఆమె అంగీకరించారు. తాగుబోతు భర్త నుంచి విముక్తి పొందేందుకే ఈ హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు.” అని సంతోష్ మాన్వార్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)