SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలోని మహానగరాలు క్రమక్రమంగా, ఆందోళన కలిగించేంత వేగంతో సముద్రంలో మునిగిపోతున్నాయని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) అధ్యయనం హెచ్చరించింది.
ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికాల్లోని 48 తీరప్రాంత మహానగరాలను ఎన్‌టీయూ బృందం అధ్యయనం చేసింది.
వాతావరణ మార్పుల కారణంగా, సముద్ర మట్టాలు పెరగడం వల్ల మునిగిపోయే ప్రమాదం ఉన్న భూభాగాలు ఈ నగరాల్లో ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి సేకరించిన గణాంకాలు, జనాభా ప్రకారం ఆయా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా 16 కోట్ల జనాభా ఉన్నట్లు బీబీసీ అంచనా వేసింది.
ముంపు ప్రమాదం వైపు పయనిస్తున్న నగరాల్లో చైనాలోని తియాంజిన్ ముందుంది. ఈ నగరంలో కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 18.7 సెంటీమీటర్ల చొప్పున కుంగిపోయాయి.
ఎన్‌టీయూ అధ్యయనం చేసిన 48 నగరాల జాబితాలో భారత్‌లో ఐదు నగరాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
అహ్మదాబాద్, గుజరాత్
ఎన్‌టీయూ అధ్యయనం ప్రకారం… అహ్మదాబాద్‌లో కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 0.01 సెంటీమీటర్ల నుంచి 5.1 సెంటీమీటర్ల వరకు మునిగిపోయాయి.
బీబీసీ అంచనా ప్రకారం మునిగిపోతోన్న ఈ ప్రాంతాల్లో 51 లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు.
అహ్మదాబాద్‌లో అత్యంత వేగంగా ముంపుకు గురవుతున్న ప్రాంతాలలో టెక్స్‌టైల్ కంపెనీలు అత్యధికంగా ఉండే పిప్లజ్ ఒకటి. ఏటా సగటున 4.2 సెంటీమీటర్లు మునిగిపోతోంది.
నాసా విశ్లేషణ ప్రకారం, సముద్ర నీటి మట్టం కూడా 2024 సంవత్సరంలో 0.59 సెంటీమీటర్లు పెరిగింది.
భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం, సముద్ర మట్టం పెరగడం, అతి వృష్టి పరిస్థితుల వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో తరచూ వరదల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్షపు నీటి పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ తదితర లక్ష్యాలతో ‘క్లైమేట్ రెసిలియంట్ సిటీ యాక్షన్ ప్లాన్’ను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
చెన్నై, తమిళనాడు
చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున 0.01 సెంటీమీటర్ల నుంచి 3.7 సెంటీమీటర్ల వరకు మునిగిపోయాయని ఎన్‌టీయూ అధ్యయనంలో వెల్లడైంది.
ఆ ప్రాంతాలలో 14 లక్షల మంది నివసిస్తున్నారని బీబీసీ అంచనా.
వాటిలో అత్యంత వేగంగా మునిగిపోతోన్న ప్రాంతం తారామణి. సగటున ఏటా 3.7 సెంటీమీటర్ల వరకు ఈ ప్రాంతం కుంగిపోయింది.
నాసా అధ్యయనం ప్రకారం, 2024లో సముద్ర మట్టం ఇక్కడ 0.59 సెంటీమీటర్ల మేర పెరిగింది.
వ్యవసాయం, పారిశ్రామిక, గృహ అవసరాలకు అత్యధికంగా భూగర్భ జలాలను తోడేయడమే దీనికి కారణమని నిపుణులు చెప్పారు.
ఈ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం భూగర్భ జలాల నిర్వహణను మెరుగు పరచడం, జల వనరులను గుర్తించడం, పర్యావరణ ప్రభావ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ నిర్మాణాలు చేపట్టడం వంటి తదితర కార్యక్రమాలను చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున 0.01 సెంటీమీటర్ల నుంచి 2.8 సెంటీమీటర్ల వరకు మునిగిపోయాయన్నది ఎన్‌టీయూ అధ్యయన సారాంశం.
ఆ ప్రాంతాలలో 90 లక్షల మంది వరకూ జనాభా ఉన్నారని బీబీసీ అంచనా.
ఇక్కడి భట్పారా ప్రాంతం అత్యంత వేగంగా ఏడాదికి సగటున 2.6 సెంటీమీటర్ల చొప్పున కుంగిపోయింది.
నాసా విశ్లేషణ ప్రకారం, 2024లో ఇక్కడ సముద్రమట్టం 0.59 సెంటీమీటర్లు పెరిగింది.
భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగించడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్పారు.
ఇలా భూమి కుంగుబాటు వల్ల భూకంపాలు, వరదలు, సముద్రపు నీరు చొచ్చకురావడం వంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వీటి నుంచి రక్షణగా కేంద్ర ప్రభుత్వం భూగర్భ జలాల వృద్ధి, నీటివనరుల గుర్తింపు, పర్యావరణ ప్రభావ నివేదికకు అనుగుణంగా నిర్మాణాలను పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయి, మహారాష్ట్ర
ఎన్‌టీయూ నివేదిక ప్రకారం, ముంబయిలో కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున 0.01 సెంటీమీటర్ల నుంచి 5.9 సెంటీమీటర్ల మేర కుంగిపోయాయి.
ఆయా ప్రాంతాలలో 32 లక్షల మంది వరకూ నివసిస్తున్నారని బీబీసీ అంచనా వేసింది.
అక్కడ అత్యంత వేగంగా కుంగిపోతున్న ప్రాంతాల్లో మాతుంగ ఈస్ట్ ఏరియాలోని కింగ్స్ సర్కిల్ స్టేషన్ పరిసర ప్రదేశం ఉందని, ఏటా సగటున 2.8 సెంటీమీటర్ల మేర మునిగిపోతుందని తెలిపింది.
ఇక్కడ సముద్రమట్టం 2024లో 0.59 సెంటీమీటర్ల మేర పెరిగిందని నాసా విశ్లేషణ.
భూగర్భ జలాలు అత్యధికంగా తోడేయడం, ఆకాశహర్మ్యాలు, మెట్రో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న చిత్తడి నేలలు అందుకు కారణాలవుతున్నాయని నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సూరత్, గుజరాత్
ఎన్‌టీయూ సర్వే ప్రకారం సూరత్‌లో కొన్ని ప్రాంతాలు 2014 నుంచి 2020 వరకు సగటున 0.01 సెంటీమీటర్ల నుంచి 6.7 సెంటీమీటర్ల వరకూ కుంగిపోయాయి.
ఆయా ప్రాంతాలలో 30 లక్షల మంది వరకూ నివాసం ఉంటున్నారని బీబీసీ అంచనా.
ఏడాదికి సగటున 6.7 సెంటీమీటర్ల చొప్పున మునిగిపోతోన్న కరంజ్… అత్యంత వేగంగా మునిగిపోతున్న ప్రాంతాలలో ఒకటిగా ఉంది.
నాసా విశ్లేషణ ప్రకారం.. 2024లో ఇక్కడ సముద్ర మట్టం 0.59 సెంటీమీటర్లు పెరిగింది.
వ్యవసాయ, పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఈ పరిస్థితికి కారణం భూగర్భ జలాలను వ్యవసాయం, టెక్సటైల్ పరిశ్రమలు, నివాసాల అవసరాలకు భారీ ఎత్తున తోడేయడమేనని నిపుణులు చెప్పారు.
ఈ నగరంలో వరదల నివారణకు స్థానిక ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
ఉకాయ్ డ్యామ్‌ను పూర్తిస్థాయిలో మెరుగుపరిచింది. వర్షపాతం అంచనా, వరదలపై ముందస్తు హెచ్చరికల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)