SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
కొల్హాపుర్ శాండల్స్ డిజైన్స్‌ను ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడా తన సొంత సృజనగా చెప్పుకుందనే విమర్శలు వచ్చిన కొన్ని నెలల తరువాత ఇప్పుడా కొల్హాపూర్ శాండల్స్ ప్రేరణతో ఓ లిమిటెడ్ ఎడిషన్ పాదరక్షల శ్రేణిని విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
ఈ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ మహారాష్ట్ర, కర్ణాటకలో 2వేల జతల శాండల్స్ తయారు చేయనుంది. ఇందుకు సంబంధించి ఆ రెండు రాష్ట్రప్రభుత్వాల మద్దతుతో పనిచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
”నిజమైన తయారీదారుల ప్రామాణిక సామర్థ్యాలకు మా తయారీ మెళకువలను జతచేస్తాం ” అని ప్రాడా కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగాధిపతి లొరెంజో బెర్టెల్లీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాడాపై వివాదం ఎందుకంటే…
ఈ లిమిటెడ్ ఎడిషన్ చెప్పులను ఫిబ్రవరి 2026 నుంచి విక్రయించనున్నారు. ఇవి ఆన్‌లైన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాడా దుకాణాలలో అందుబాటులో ఉంటాయి. వీటి ధర 939 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్టు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 84,000 రూపాయలు ఉంటుంది.
ఇటలీ-భారత్ బిజినెస్ ఫోరమ్ 2025 సందర్భంగా గురువారం(డిసెంబరు 11)న ఈ ఒప్పందం కుదిరింది.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో తయారయ్యే సంప్రదాయ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్న ఓపెన్ టో బ్రేడెడ్ డిజైన్ శాండల్స్‌ను జూన్ నెలలో ప్రాడా ప్రదర్శించింది. ఈ శాండల్స్‌ను కేవలం ‘‘లెదర్ ఫుట్‌వేర్’’గా మాత్రమే ప్రాడా పేర్కొంది. అయితే వాటికి భారతీయ మూలాలున్నాయని చెప్పకపోవడంతో భారత్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సాంస్కృతిక దోపిడీ అనే ఆరోపణలు కూడా వచ్చాయి.
తరువాత తమ చెప్పుల డిజైన్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని ప్రాడా అంగీకరించింది.
“మేమెప్పుడూ కళాత్మక నైపుణ్యం, వారసత్వం, డిజైన్ సంప్రదాయాలను గౌరవిస్తూనే వచ్చాం. ఈ విషయమై మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ఆ సమయంలో ప్రాడా ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
శుక్రవారం మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి సంజయ్ సిర్సాత్ బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ, ఈ కొత్త కార్యక్రమానికి ‘ప్రాడా మేడ్ ఇన్ ఇండియా – ఇన్‌స్పైర్డ్ బై కొల్హాపురి చెప్పల్స్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఫొటో సోర్స్, Getty Images
చెప్పుల తయారీదార్లకు శిక్షణ
“ప్రాడా అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది కళాకారులకు ప్రాడా , లిడ్‌కామ్ (మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ) ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తాం. ఇంకా ఇటలీలో శిక్షణకు మూడేళ్లపాటు సుమారు 200 మంది కొల్హాపురి పాదరక్షల కళాకారులను పంపిస్తాం” అని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందం ఐదేళ్ల కాలానికి కుదిరిందని, తరువాత కూడా కొనసాగవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయ డిజైన్లను తమ కంపెనీ ఎప్పుడూ గౌరవిస్తుందని ప్రాడా ప్రతినిధి బీబీసీతో చెప్పారు
ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం ఈ చెప్పులు తయారుచేసేవారికి ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
‘తోలు, సహజ రంగులు’
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తయారయ్యే చెప్పులు ఆ నగరం పేరుతోనే ప్రసిద్ధి పొందాయి. దీని మూలాలు 12వ శతాబ్దం నుంచి ఉన్నాయి.
తోలుతో వీటిని తయారుచేస్తారు. కొన్నిసార్లు సహజరంగులు వేస్తారు. సంప్రదాయ హస్తకళలకు చెందిన ఈ చెప్పులు భారత్‌లోని వేడి వాతావరణానికి సరిగ్గా సరిపోతాయి.
తమకు గుర్తింపు ఇవ్వకుండా తమ డిజైన్ ఉపయోగించుకోవడంపై కొల్హాపూర్ పాదరక్షల తయారీదార్లు అనేకమంది గతంలో ఆవేదన చెందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)







