SOURCE :- BBC NEWS

బగ్లిహార్ ఆనకట్ట

ఫొటో సోర్స్, ANI

2 గంటలు క్రితం

పహల్గాం దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో తమకు రావాల్సిన నీటిని భారత్ తనవైపు మళ్లించుకుంటుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జమ్మూలోని రాంబన్‌లో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ ఆనకట్ట అన్ని గేట్లు మూసి ఉన్నట్లు వార్తా కథనాలు , వీడియోలు ఇప్పుడు బయటకొస్తున్నాయి.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం , సింధు జల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత తర్వాత మొదటిసారిగా, ఈ ఒప్పందంలో భాగమైన ఆనకట్టపై కొంత పనిని ప్రారంభించింది భారత్.

ఉత్తర కశ్మీర్‌లోని జీలం నదిపై నిర్మించిన కిషన్‌గంగా ఆనకట్ట గేట్లను కూడా ఇదే విధంగా మూసేయాలని భారత్ భావిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది .

బగ్లిహార్, కిషన్‌గంగా జలవిద్యుత్ ఆనకట్టలని, నీటి విడుదల సమయాన్ని నిర్ణయించే అధికారం భారతదేశానికి ఉంటుందని, ఈ విషయం గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపినట్లు పీటీఐ పేర్కొంది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల మాట్లాడుతూ, భారతదేశం పాకిస్తాన్‌లోకి ప్రవేశించే నీటిని ఆపడానికి లేదా దిశను మార్చడానికి ప్రయత్నిస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని అన్నారు.

‘యుద్ధం అంటే కేవలం ఫిరంగి గుండ్లు లేదా తుపాకులను కాల్చడమే కాదు. దీనికి అనేక రూపాలు ఉన్నాయి. నీటిని నిలిపేయడం కూడా యుద్ధం కిందికే వస్తుంది’ అని ఆయన అన్నారు. దీని కారణంగా, దేశ ప్రజలు ఆకలితో లేదా దాహంతో ప్రాణాలు కోల్పోతారని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

బగ్లిహార్ ఆనకట్ట ఎందుకు?

1960లో, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. సింధు, దాని ఉపనదుల వినియోగానికి సంబంధించి రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.

బగ్లిహార్ ఆనకట్ట చాలా కాలంగా ఈ రెండు దేశాల మధ్య వివాదానికి కేంద్రం. ఈ విషయంలో పాకిస్తాన్ గతంలో ప్రపంచ బ్యాంకు జోక్యాన్ని కోరింది. ప్రపంచ బ్యాంకు కూడా ఈ విషయంలో కొంతకాలంగా మధ్యవర్తిత్వం వహిస్తోంది.

దీనితో పాటు, కిషన్‌గంగా ఆనకట్టపై పాకిస్తాన్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవి రెండూ జల విద్యుత్ ప్రాజెక్టులు.

బగ్లిహార్ ఆనకట్ట విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. ఈ ఆనకట్ట నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళికకు ‘బగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్’ అని పేరు పెట్టారు.

ఈ ప్రాజెక్ట్ 1992 నుంచి పరిశీలనలో ఉంది. చివరికి 1999లో పని ప్రారంభించారు. తరువాత అనేక దశల్లో పని కొనసాగింది, 2008లో పూర్తయింది.

నది

ఫొటో సోర్స్, ANI

గేట్లు ఎందుకు మూసి ఉన్నాయి?

బగ్లిహార్ ఆనకట్ట గేట్లను మూసివేయడంపై ఆంగ్ల వార్తాపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వివరణాత్మక రిపోర్టును ప్రచురించింది.

రిజర్వాయర్ నుంచి బురదను తొలగించడానికి గేట్లను చాలావరకు మూశారని, దీని కారణంగా పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం 90 శాతం తగ్గిందని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారి ఒకరు చెప్పినట్లు రిపోర్టు పేర్కొంది .

కిషన్‌గంగ ఆనకట్టకు కూడా ఇలాంటి ప్రణాళికే అమలులో ఉందని ఆ అధికారి వార్తాపత్రికకు తెలిపారు.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో అధికారి వార్తాపత్రికతో మాట్లాడుతూ, “బగ్లిహార్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ గేట్లు మూసేశారు. మేం రిజర్వాయర్ నుంచి బురదను తొలగించే పనిని పూర్తి చేసాం, ఇప్పుడు దానిని నీటితో నింపాలి. ఈ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది” అని అన్నారు.

ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం, రిజర్వాయర్‌ పూడిక తీసి, నీటిని నింపే ప్రక్రియ ఇదే మొదటిసారి కాదు. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని ఆనకట్టలపై ఆగస్టు నెలలో ఈ పని చేస్తారు.

మే నుంచి సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలం కారణంగా ఉత్తర భారతదేశంలోని ఆనకట్టలు, జలాశయాలలో గరిష్టంగా నీరు ఉంటుంది. ఇప్పుడు బగ్లిహార్ జలాశయంలో నీటిని నింపే ప్రక్రియ ఆగస్టు నెలలో పూర్తికాకపోవచ్చనీ, ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

చీనాబ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ దేనికి భయపడుతోంది?

సింధు జల ఒప్పందంలోని పశ్చిమ నదులలో ఒకటి చీనాబ్ .

ఈ ఒప్పందం వ్యవసాయం, గృహ, విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, 1992 నుంచి కూడా బగ్లిహార్ ఆనకట్టపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది.

ఈ ఆనకట్టపై ఒక ఒప్పందానికి రావడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి.

నీటి కొరత ఉన్నప్పుడు పాక్‌కు భారతదేశం నీటిని ఆపేయగలదని, అదనపు నీరు ఉంటే విడుదల చేయగలదని పాక్ భయపడుతోంది.

అయితే పాకిస్తాన్ భయాలను తొలగించడానికి తమ దగ్గర పరిష్కారం ఏమీ లేదని భారత్ అంటోంది.

రెండు దేశాల మధ్య చర్చోపచర్చల తర్వాత, 1999 లో ఆనకట్ట నిర్మించడానికి ఒక ఒప్పందం కుదిరింది. చివరికి దాని నిర్మాణం ప్రారంభమైంది, కానీ తరువాత కూడా, పాకిస్తాన్ దానిపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహాన్ని తగ్గిస్తారని ఆందోళన చెందుతూనే ఉంది పాక్.

సింధు జల ఒప్పందం ప్రకారం, సింధు పరీవాహక ప్రాంతంలోని మూడు తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలను భారతదేశానికి కేటాయించారు. అదే సమయంలో, మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల నీటిలో 80 శాతం పాకిస్తాన్‌కు కేటాయించారు.

ఈ ఒప్పందం ప్రకారం, కొన్ని మినహాయింపులు పోను, భారతదేశం తూర్పు నదుల నీటిని ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు.

అలాగే పశ్చిమ నదుల నీటిని ఉపయోగించుకోవడానికి విద్యుత్ ఉత్పత్తి లాగానే, వ్యవసాయానికి పరిమిత నీరు వంటి…కొన్ని పరిమిత హక్కులు భారతదేశానికి ఉన్నాయి.

పాకల్ దుల్ ప్రాజెక్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు భారత్ ప్లాన్ ఏంటి?

బగ్లిహార్‌తో పాటు, చీనాబ్ నదిపై అనేక ఇతర జల విద్యుత్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. చీనాబ్, దాని ఉపనదులపై అలాంటి నాలుగు ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోంది. ఇవి 2027-28 నాటికి అందుబాటులోకి వస్తాయి.

వీటిలో పాకల్ దుల్ (1000 మెగావాట్స్), కిరు (624 మెగావాట్స్), క్వార్ (540 మెగావాట్స్) రాట్లే (850 మెగావాట్స్) ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, జమ్మూకశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో పాకల్ దుల్ ప్రాజెక్టుకు, 2019లో కిరు ప్రాజెక్టుకు, 2022లో క్వార్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, పాకల్ దుల్ దగ్గర 66 శాతం, కిరు దగ్గర 55 శాతం, క్వార్ దగ్గర 19 శాతం, రాట్లే వద్ద 21 శాతం పనులు పూర్తయ్యాయి.

పాకిస్తాన్ ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించింది. ముఖ్యంగా రాట్లే, కిషన్‌గంగా ప్రాజెక్టులకు సంబంధించి మరింత వ్యతిరేకత ఉంది. ఈ ఆనకట్టల డిజైన్లు సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని పాక్ ఆరోపించింది.

బగ్లిహార్ కాకుండా, పాకల్ దుల్, కిరు, క్వార్, రాట్లే కలిపి 3,014 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ ప్రాజెక్టుల నుంచి ప్రతి సంవత్సరం 10,541 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌కు 18,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉండగా, అందులో 11,823 మెగావాట్లు చీనాబ్ బేసిన్‌ నుంచే వస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)