SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అయిదో ఎడిషన్ నామినీలను ఈ రోజు ప్రకటించనున్నారు.
భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బీబీసీ అందిస్తోంది.
ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్(2024) నామినీలలో నచ్చిన ప్లేయర్‌కు ఓటు వేసి గెలిపించే అవకాశం మీకు ఉంటుంది.
బీబీసీ భారతీయ భాషల వెబ్సైట్లలో, లేదా బీబీసీ స్పోర్ట్ వెబ్సైట్లో మీరు మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయచ్చు.
బీబీసీ ఏర్పాటు చేసిన ఒక ప్యానెల్ ఈ అవార్డు కోసం అయిదుగురు భారతీయ క్రీడాకారిణులను నామినీలుగా ఎంపిక చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది.
ఈ ప్యానెల్ 2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అయిదుగురు క్రీడాకారిణులను ఎంపిక చేసింది.
ఈ అయిదుగురిలో ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు పొందిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంటారు. ఓటింగ్ ఫలితాలు బీబీసీ భారతీయ భాషల వెబ్సైట్లతో పాటు బీబీసీ స్పోర్ట్ వెబ్సైట్లో ప్రచురితమవుతాయి.
2025 జనవరి 31 రాత్రి 11:30 గంటల వరకు ప్రజలు ఓటు వేయవచ్చు.
ఫిబ్రవరి 17 సోమవారం నాడు దిల్లీలో జరిగే అవార్డుల కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.
అవార్డుల వేడుకలో ‘స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో పాటు మరో మూడు కేటగిరీల్లో జ్యూరీ నామినేట్ చేసిన మరో ముగ్గురు క్రీడాకారిణులను బీబీసీ అవార్డులతో సత్కరిస్తుంది.
యువ అథ్లెట్ సాధించిన విజయాలకు ప్రతీకగా ‘బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు, క్రీడల్లో వెటరన్ ప్లేయర్ చేసిన అసమాన కృషికి గుర్తుగా ‘బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు, పారా స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభను చాటిచెప్పేందుకు ‘బీబీసీ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను బీబీసీ అందించనుంది.
ప్లేయర్లు చాంపియన్లుగా ఎదగడంలో వెన్నంటి నిలిచిన వ్యక్తులు, వారు అందించిన సహకారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ‘చాంపియన్స్ చాంపియన్స్’ అనే థీమ్‌తో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ, కథనాలను మేం మీ ముందుకు తీసుకువస్తున్నాం.
భారత్‌లోని మహిళా అథ్లెట్లు సాధించిన విజయాలను వేడుకగా చేయడంతోపాటు వారికి తగిన గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) మొదలైంది.
ప్రస్తుతం ఈ అవార్డుల వేడుక అయిదో ఎడిషన్ మీ ముందుకు వస్తోంది.
మొదటి ఎడిషన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజేతగా నిలవగా, అవార్డుల కార్యక్రమానికి అప్పటి కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
2020 ఎడిషన్‌లో వరల్డ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. తర్వాత వరుసగా రెండేళ్లు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఈ అవార్డును అందుకున్నారు.
గతంలో బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను క్రికెటర్ షెఫాలీ వర్మ, షూటర్ మను భాకర్ గెలుచుకున్నారు. అథ్లెట్లు పీటీ ఉష, అంజు బాబీ జార్జి, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, హాకీ ప్లేయర్ ప్రీతమ్ సివాచ్ ఇప్పటివరకు బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు.
బీబీసీ ఇండియన్ పారా స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కిందటి ఎడిషన్‌లో ప్రవేశపెట్టారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ ఈ అవార్డును గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)