SOURCE :- BBC NEWS
9 జనవరి 2025, 07:33 IST
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ కాలం ముగియనుంది. డోనల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఈ సమయంలో అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సల్లివాన్ భారత్ సందర్శనకు వచ్చి ఓ ప్రకటన చేశారు. భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ప్రకటన ప్రత్యేకమైనది.
భారతీయ పరిశోధనలు, అణు సంస్థలను అమెరికన్ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్- అమెరికా మధ్య జరిగిన పౌర అణు ఒప్పందం కింద ఆయన ఈ ప్రకటన చేశారు.
అణు రంగంలో భారత్- అమెరికా మధ్య సహకారం బలమైన దశకు చేరుకుందని ఆయన దిల్లీ ఐఐటీలో చెప్పారు.
సల్లివాన్ ఇంకా ఏమన్నారు?
“పౌర అణు సహకారానికి సంబంధించి రెండు దేశాల కంపెనీల మధ్య ఉన్న అడ్డంకులు తొలగించేందుకు అమెరికా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని నేను ఇవాళ చెప్పగలను” అని జేక్ సల్లివాన్ అన్నారు.
అణు సహకారం విషయంలో భారత్ సంస్థల మీద ఇకపై అమెరికాలో ఎలాంటి నిషేధం ఉండదు. భారతీయ సంస్థలకు సంబంధించి ఇది పెద్ద నిర్ణయమే అనుకోవాలి.
అమెరికన్ ప్రైవేటు రంగంలోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఇకపై భారత్‌లోని సంస్థలతో కలిసి పని చెయ్యవచ్చని సల్లివాన్ చెప్పారు. రెండు దేశాల మధ్య పౌర అణు సహకారం మరింత విస్తరిస్తుందని అన్నారు.
“ఏదేమైనప్పటికీ 20ఏళ్ల క్రితమే జార్జ్ బుష్- మన్మోహన్ సింగ్ పౌర అణు సహకార ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య బలమైన పునాది వేశారు” అని సల్లివాన్ చెప్పారు.
జేక్ సల్లివాన్ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఆయన పక్కనే ఉన్నారు. “భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త ఎత్తులకు చేరుకుంది. ఇందులో సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, బయో టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు కూడా ఉన్నాయి” అని జైశంకర్ అన్నారు.
సల్లివాన్, పీఎం ప్రత్యేక భేటీ
జేక్ సల్లివాన్ గతంలో భారత్‌లో పర్యటించినప్పుడు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోబాల్ను కలిశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా జేక్ సల్లివాన్ను కలిశారు.
వాస్తవానికి జేక్ సల్లివాన్ అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో ఒక అధికారి మాత్రమే. ఒక అధికారిని ప్రధానమంత్రి కలవడం అసాధారణ అంశం.
“ప్రధానమంత్రి మోదీ సల్లివాన్ను కలవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో జాతీయ భద్రత సలహాదారు అంటే ఒక అధికారి మాత్రమే. అజిత్ డోబాల్ అమెరికా వెళితే జో బైడెన్ ఆయనను కలుస్తారా? అసాధ్యం” అని అమెరికాలోని డెల్వేర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్ పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఖమర్ చీమాతో మాట్లాడుతూ అన్నారు.
“కచ్చితంగా పెద్ద పురోగతి ఉండి ఉంటుంది. భారత్‌లోని ప్రైవేటు అణు సంస్థలను అమెరికా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక జాబితా నుంచి తొలగించింది. భారత్‌కు ఇది పెద్ద విజయం. దీని వల్ల న్యూక్లియర్, మిస్సైళ్లకు సంబంధించి భారత్‌లోని ప్రైవేటు సంస్థలు అమెరికన్ కంపెనీలతో నేరుగా సంబంధాలు నెరపగలుగుతాయి. భారతీయ సంస్థలు అమెరికా వెళ్లి అక్కడ పరిశోధనల్లో పాల్గొంటాయి. మరోవైపు మీరు చూడండి. పాకిస్తాన్ మిస్సైల్ ప్రోగ్రామ్‌ను అమెరికా నిషేధించింది. అదే సమయంలో భారత్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించింది” అని ముక్తదర్ ఖాన్ చెప్పారు.
వైట్ హౌస్ వెబ్సైట్ పరిశీలిస్తే, భారత్ అమెరికా మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న సహకారాన్ని ఖరారు చేసినట్లు భావించవచ్చని ఖాన్ చెప్పారు.
“బైడెన్ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రెండు దేశాలు సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టాయి. బైడెన్ పాలనలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం పెరిగింది.” అని ఆయన అన్నారు.
“బ్లింకెన్‌కు బదులుగా జేక్ సల్లివాన్ ఎందుకు భారత్‌తో దౌత్యం నెరుపుతున్నారన్నదే అర్థం కాకుండా ఉంది. బ్లింకెన్ ఇటీవల సౌత్ కొరియా వెళ్లారు కానీ భారత్‌కు రాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో మూడు దేశాలు కీలకంగా ఉన్నాయి అవి అమెరికా, చైనా, భారత్. ట్రంప్ కూడా భారత్ పట్ల సానుకూలంగా ఉన్నారు. భారత్‌తో దౌత్య వ్యవహారాలు నిర్వహించడానికి జేక్ సల్లివాన్ ఏమీ దౌత్యవేత్త కాదు” అని ఖాన్ చెప్పారు.
భారత్- అమెరికా మధ్య పాత ఒప్పందం
అణు రియాక్టర్ల కోసం భారత్ అమెరికాతో 2000 నుంచి చర్చలు జరుపుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ కథనంలో తెలిపింది.
రానున్న రోజుల్లో భారత్ ఇంధన అవసరాలు మరింత పెరగనున్నాయి. 2007లో నాటి భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్- అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మధ్య కుదిరిన పౌర అణుసహకార ఒప్పందం లక్ష్యం భారత్‌కు అమెరికా అణు రియాక్టర్లు, సాంకేతికతను అందించడమే.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భారత్‌తో ఒప్పందం ఎలా కుదుర్చోవాలనే దానిపై రెండు దేశాల మధ్య ఆంటంకాలు ఏర్పడ్డాయి. అణు ప్రమాదం సంభవించినట్లయితే, ఆ బాధ్యత నిర్వహకులదా లేదా అణువిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించిన వారిదా అనే దానిపై ఏకాభిప్రాయం లేదు.
అణు విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తికాని అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని జేక్ సల్లివాన్ చెప్పారు.
1998లో భారతదేశం అణు పరీక్షలు నిర్వహించినప్పుడు, భారత దేశానికి చెందిన రెండువందలకు పైగా సంస్థలపై అమెరికా నిషేధం విధించింది. అయితే కాలం గడిచే కొద్దీ నిషేధాన్ని తొలగిస్తూ వచ్చింది.
భారత్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అణు రియాక్టర్లతో పాటు అణు విద్యుత్ ప్లాంట్లతో సంబంధం ఉన్న నాలుగు సంస్థలపై అమెరికా వాణిజ్య విభాగం ఇప్పటికీ నిషేధాన్ని కొనసాగిస్తోంది.
అణు ప్రమాదాలు జరిగినప్పుడు చెల్లించాల్సిన పరిహారం విషయంలో భారత్‌లో కఠినమైన చట్టాలు ఉన్నాయని రాయిటర్స్ నివేదిక చెబుతోంది. భారత్‌లో విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించాలని భావించిన సంస్థలు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ఇది ఆటంకంగా మారింది. 2020 నాటికి అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని, అది ఇప్పుడు 2030కి వాయిదా పడిందని రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది.
2019లో భారత్-అమెరికా మధ్య ఆరు అమెరికన్ న్యూక్లియర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. 2022లో సెమీకండక్టర్ల ఉత్పత్తి, కృత్రిమ మేధస్సుపై రెండుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
భారతదేశంలో జెట్ ఇంజిన్ల తయారీకి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్- హిందూస్తాన్ ఏరోనాటికల్స్ మధ్య భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం కీలకంగా మారింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ఇటీవల భారత్, అమెరికా మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు.
2004లో సిక్కు నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారతీయ అధికారుల ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించింది. ఈ కేసులో ఒక భారతీయ పౌరుడిని కూడా అరెస్టు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS