SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ గురించి మీకు తెలిసే ఉండవచ్చు, దీనిని అడ్వాన్స్‌డ్ మిసైల్ షీల్డ్ అని పిలుస్తారు.
ఇరాన్ మిసైల్స్ అయినా, హమాస్ రాకెట్లయినా, హౌతీ తిరుగుబాటుదారుల డ్రోన్లయినా తమ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇజ్రాయెల్ దాని ‘ఐరన్ డోమ్’ సాయంతో ఆకాశంలోనే నాశనం చేస్తుంటుంది.
యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ‘ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు అలాగే రాడార్లు, దాడికి దిగే విమానాలను గుర్తించి, ట్రాక్ చేసే ఇతర పరికరాలు ఉంటాయి.
బుధవారం నాడు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ దాడులు చేసింది. ‘ఉగ్రవాద స్థావరాలను’ మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్ చెప్పింది.
దాడులలో ఏ రకమైన ఆయుధాలను ఉపయోగించారో భారత్ పేర్కొనలేదు.
భారత్ వివిధ రకాల ఆయుధాలతో ఆరు ప్రదేశాలలో 24 దాడులు చేసిందని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి చెప్పారు.
ఈ దాడుల్లో భారత్‌కు చెందిన ఐదు వైమానిక యుద్ధ విమానాలను, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. భారత్ ఇంతవరకు దీనిపై వ్యాఖ్యానించలేదు. బీబీసీ ఈ వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.


ఫొటో సోర్స్, Getty Images
మిసైల్ కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు
పాకిస్తాన్ గడ్డపై భారత మిసైల్ పడిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2022 మార్చిలో భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల మియాన్ చన్ను సమీపంలో కూలిపోయింది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనకు సంబంధించి భారత్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మిసైల్‌ను పొరపాటున పాకిస్తాన్ వైపు ప్రయోగించామని అందులో తెలిపింది.
”పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన ‘భారత మిసైల్’ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్‌సోనిక్ మిసైల్” అని పాకిస్తాన్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖర్ ఆ సమయంలో మీడియాతో చెప్పారు.
భారత్‌లోని సిర్సా నుంచి మిసైల్ ప్రయోగించిన వెంటనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానిని పర్యవేక్షించడం ప్రారంభించిందని పాకిస్తాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బాలాకోట్ తర్వాత మారిన పరిస్థితులు
2019 నుంచి రెండు దేశాలు కొత్త రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఇప్పుడు ఫ్రాన్స్‌లో తయారైన 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి.
లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం, అదే కాలంలో చైనా నుంచి పాకిస్తాన్ కనీసం 20 అధునాతన జే-10 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటిలో పీఎల్-15 మిసైల్స్ ఉన్నాయి.
ఇక, వాయు రక్షణ విషయానికొస్తే.. 2019 తర్వాత, రష్యన్ ఎస్-400 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ సిస్టంను భారత్ కొనుగోలు చేసింది. ఇదే సమయంలో చైనా నుంచి ‘హెచ్‌క్యూ-9’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది పాకిస్తాన్.
రేడియో పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలలో అడ్వాన్స్‌డ్ ఏరియల్ ప్లాట్‌ఫామ్స్, హై టు మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం(హెచ్ఐఎంఏడీఎస్), అన్‌మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్స్ ఉన్నాయని పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. వీటితో పాటు, స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టంలు కూడా ఉన్నాయి.
అయితే, పాకిస్తాన్‌పై భారత మిసైల్ దాడితో చాలా ప్రశ్నలు తలెత్తాయి.
ఇంతకీ భారత్ నుంచి భారీగా మిసైల్స్ వస్తే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకోగలదా?. భారత మిసైల్స్‌ను పాకిస్తాన్ ఎందుకు ధ్వంసం చేయలేకపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అడ్డుకోగలదా?
పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంకు స్వల్ప-శ్రేణి, మధ్యస్థ-శ్రేణి, దీర్ఘ-శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉందని పాక్ ఎయిర్‌ఫోర్స్ మాజీ వైస్ ఎయిర్ మార్షల్ ఇక్రముల్లా భట్టి బీబీసీతో అన్నారు.
ఇక్రముల్లా ప్రకారం, పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలో అనేక క్షిపణి వ్యవస్థలను చేర్చింది, వాటిలో చైనా తయారు చేసిన హెచ్‌క్యూ-16 ఎఫ్‌ఈ రక్షణ వ్యవస్థ కూడా ఉంది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, యుద్ధనౌకలకు ప్రభావవంతంగా అడ్డగిస్తుంది.
కాగా, గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్‌ను అడ్డగించే విషయానికొస్తే.. ప్రస్తుతం అలాంటి రక్షణ వ్యవస్థ అందుబాటులో లేదు.
ఇదే సమయంలో, భారత్ మిసైల్స్‌ను గగనతలం నుంచి ప్రయోగించిందా? లేదా భూమి నుంచి ప్రయోగించిందా అనేది తెలియదు.
ప్రపంచంలోని ఏ ‘డిఫెన్స్ సిస్టం’ కూడా ఖచ్చితమైన రక్షణను అందించదని, ముఖ్యంగా ఇరుగుపొరుగున ఉన్న భారత్, పాకిస్తాన్ వంటి దేశాల విషయంలో కష్టమని మాజీ ఎయిర్ కమెడోర్ ఆదిల్ సుల్తాన్ బీబీసీతో అన్నారు.
గగనతలం నుంచి భూమికి మిసైల్ దాడులను 100 శాతం ఆపడం అసాధ్యమని ఆయన అంటున్నారు. ఒకేసారి వేర్వేరు దిశల నుంచి వచ్చే మిసైల్స్‌ను అడ్డుకునే విషయంలో ఎలాంటి రక్షణ వ్యవస్థ సామర్థ్యానికైనా పరిమితి ఉంటుందని ఆదిల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు కష్టం?
భారత్ ఈ మిసైల్స్‌ను గగనతలం నుంచి భూమికి ప్రయోగించి ఉండవచ్చని ఇక్రముల్లా అభిప్రాయపడ్డారు.
“వాటి వేగం మాక్ 3 (గంటకు 3,675 కి.మీ) నుంచి మాక్ 9 (గంటకు 11,025 కి.మీ) వరకు మారింది. అమెరికా, రష్యా లేదా చైనాతో సహా ఏ దేశానికీ అలాంటి హై-స్పీడ్ క్షిపణిని అడ్డగించే సామర్థ్యం లేదు” అని ఆయన అన్నారు.
”గగనతలం నుంచి ప్రయోగించే మిసైల్ ప్రయాణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. వాటిని అడ్డగించడానికి చాలా తక్కువ సమయమే దొరుకుతుంది” అని ఇక్రముల్లా అన్నారు.
‘ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్ అడ్డుకోవచ్చు ఎందుకంటే, వాటి ప్రయాణ వ్యవధి ఎక్కువ’ అని ఆయన వివరించారు.
ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థ కూడా 100 శాతం దాడులను నిరోధించలేదని ఆదిల్ సుల్తాన్ అభిప్రాయపడ్డారు. వేర్వేరు దిశల నుంచి గగనతలం నుంచి భూమికి ఒకేసారి మిసైల్స్ ప్రయోగిస్తే, వాటిని రాడార్‌లో గుర్తించడం, వెంటనే స్పందించడం కష్టమని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)