SOURCE :- BBC NEWS

ప్రేమ్ సింగ్, జీతూ బాయి

పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గ్రామం ‘పక్కా చిస్తీ’. ఈ గ్రామంలో అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గురుద్వారా సాహిబ్ స్పీకర్ల నుంచి ప్రార్థన వినిపించింది.

ఖాళీ అయిన ఇళ్లు, బోసిపోయిన వీధుల్లో బయట అరుగుల మీద కూర్చున్న కొందరి పెద్దవారిలో యుద్ధం, వలస, బాధతో నిండిన భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అప్పుడప్పుడు రోడ్డుపై ఒక వాహనం వెళ్తూ…అక్కడ చుట్టుముట్టిన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తోంది.

ఈ గ్రామాల్లోని వారు తమ పిల్లలను, మహిళలను సాయంత్రం అయ్యేసరికి సరిహద్దుకు కాస్త దూరంగా ఉన్న సురక్షిత ప్రాంతాలకు, గ్రామాలకు తీసుకెళ్లి వదిలిపెడుతున్నారు.

ఈ గ్రామం మూడువైపులా సరిహద్దు ఉన్న పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో ఉంది.

గ్రామ సర్పంచ్ సుఖ్‌దీప్‌ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం, గ్రామంలో 1425 మంది ఓటర్లు ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రేమ్ సింగ్

‘ఒక్కడినే ఉంటున్నా’

గ్రామంలో యుద్ధ భయంతో చాలామంది తమ ఇళ్లను విడిచిపెట్టి, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లారు.

75 ఏళ్ల సుర్జీత్ సింగ్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. తన కుటుంబ సభ్యులను సరిహద్దుకు దూరంగా ఉన్న గ్రామాల్లోని తమ బంధువుల ఇంటికి పంపినట్లు తెలిపారు.

తన ఇంటిని, పశువులను చూసుకునేందుకు తానొక్కడే ఇక్కడ ఉన్నట్లు చెప్పారు.

”మనవళ్లు, మనవరాళ్లు, కోడలు, కొడుకు, భార్య సరిహద్దుకు దూరంగా ఉన్న తాహ్లి గ్రామానికి వెళ్లారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాత్రికి రాత్రి వెళ్లడం అంటే కష్టం కదా. బలవంతంగా మేమే పంపాం. ఇప్పుడైతే ఒక్కడినే వండుకుని తింటున్నా” అని సుర్జీత్ సింగ్ చెప్పారు.

”నాకు 70-80 ఏళ్లు ఉంటాయి. ఒకవేళ చనిపోయినా పెద్ద విషయం కాదు. నా మనవళ్లు, మనవరాళ్లు నాలుగు రోజులు బతుకుతారు. నేనంతా చూశాను. కానీ, వాళ్లింకా చిన్న పిల్లలు, చాలా ప్రపంచాన్ని చూడాలి” అని సుర్జీత్ సింగ్ తెలిపారు.

1965, 1971 యుద్ధాలను కూడా సుర్జీత్ సింగ్ చూశారు. ఆ సమయంలో ఆయన ఇల్లొదిలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు.

యుద్ధ అనుభవాలను పంచుకున్న సుర్జీత్ సింగ్, ”1971 యుద్ధంలో, గ్రామం బయట నెలన్నర పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నాం. బయట ఉండటం కష్టమైనప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేశాం. మేం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే యుద్ధం ప్రారంభమైంది” అని గుర్తు చేసుకున్నారు.

”1965 యుద్ధ సమయంలో నాకు 13 ఏళ్లు. గ్రామంలోని కుళాయి దగ్గర స్నానం చేస్తున్నప్పుడు బుల్లెట్ దూసుకొచ్చింది. లోదుస్తులు మాత్రమే ధరించి, పరిగెత్తుకుని వచ్చాను. పక్కింటి వారు నాకు దుస్తులు ఇచ్చారు” అని చెప్పారు.

జీతూ బాయి

‘కొన్నిసార్లు బంధువుల ఇళ్లల్లో, కొన్నిసార్లు వేరే ఎవరింట్లోనే ఉంటున్నాం’

గ్రామంలోని మరో వ్యక్తి ప్రేమ్ సింగ్ ఇంటి వద్దకు వెళ్లినప్పుడు, ఆయన భార్య జీతూ బాయి, ఆయన కొడుకు ఉన్నారు.

ప్రేమ్ సింగ్ కోడలు, ఇద్దరు మనవరాళ్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు గ్రామానికి దూరంగా ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లారు.

జీతూ బాయి భర్త, కొడుకు కోసం వంట చేసిపెట్టి, రాత్రంతా సరిహద్దుకు పక్కనున్న గ్రామంలో ఉంటున్నారు.

‘‘మగవాళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. మేం బయటికి వెళ్తున్నాం. దగ్గర్లో ఉన్న ఊళ్లకు వెళ్లి బంధువుల ఇంట్లో ఉంటున్నాం. ఉదయం తిరిగి వచ్చి, ఇక్కడున్న వారికి వండిపెడుతున్నాం” అని జీతూ బాయి తెలిపారు.

కశ్మీర్ సింగ్

‘తిరిగి రాక కోసం ఎదురుచూస్తున్నాం.’

గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న కశ్మీర్ సింగ్, రోజంతా ఖాళీగా షాపులో ఉండాల్సి వస్తోంది. కుటుంబ సభ్యులు, కస్టమర్ల తిరిగి రావడం కోసం వేచిచూస్తున్నారు కశ్మీర్ సింగ్.

కస్టమర్లు ఎవరూ రాకపోయినా, గ్రామమంతా ఖాళీగా ఉన్నా, తన దుకాణాన్ని, వస్తువులను విడిచిపెట్టి వెళ్లలేం కదా అన్నారు కశ్మీర్ సింగ్.

కశ్మీర్ సింగ్ కూడా 1971 యుద్ధాన్ని చూశారు. సాయంత్రం పూట యుద్ధం ప్రారంభమైన తర్వాత, గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

రాత్రిపూట పిల్లల్ని, అమ్మాయిలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం కష్టమని, అందుకే సాయంత్రం వేళల్లోనే వారిని బయటికి పంపేస్తున్నామని కశ్మీర్ సింగ్ తెలిపారు. ఇళ్లలోని పెద్ద వారు ఇంటికి కాపలాగా ఉంటున్నారు.

పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు, ఇళ్లకు తాళం వేసి, సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నామని తెలిపారు. అవసరమైతే, బియ్యం, నీళ్లు వంటి నిత్యావసర వస్తువులను సైనికులకు ఇస్తామని చెప్పారు.

” సరిహద్దుకు సమీపంలో మా గ్రామం ఉంది. అదే చివరి గ్రామం. నా షాపు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఆ వస్తువులన్నింటినీ ఎక్కడికి పట్టుకుని వెళ్లగలను? కస్టమర్లు ఎవరూ రావడం లేదు. గ్రామానికి ఎవరైనా తిరిగి వస్తే, కస్టమర్లు వస్తారు” అని కశ్మీర్ సింగ్ తెలిపారు.

”యుద్ధం వచ్చినప్పుడు, మేం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆర్థికంగా ఐదు నుంచి ఏడేళ్లు వెనక్కిపోతాం” అని చెప్పారు.

యుద్ధంవల్ల ఎన్నోసార్లు నష్టపోయిన ఈ గ్రామం, మళ్లీ యుద్ధం రావొద్దని కోరుకుంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)