SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1965, 1971లో యుద్ధాలు జరిగాయి. ఆ రోజుల్లో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమిలో పాకిస్తాన్ భాగం. అదే కాలంలో సోవియట్ యూనియన్ 1979లో అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది.
అఫ్గాన్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండాలని, ఇస్లామిక్ ఛాందసవాదులను అధికారానికి దూరంగా ఉంచాలని సోవియట్ యూనియన్ భావించింది. అదే సమయంలో, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్న దేశాలను బలహీనపరచడం అమెరికా విధానంగా పెట్టుకుంది.
అప్గానిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌ను ఓడించడానికి పాకిస్తాన్ సాయం తీసుకుంది అమెరికా. ప్రతిగా, అమెరికా నుంచి పాకిస్తాన్ ఆర్ధిక, సైనిక సాయం పొందేది.
వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్తాన్‌తో అమెరికాకు సాన్నిహిత్యం ఉంది. అదింకా ముగిసిపోలేదు.
అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్, అమెరికా ప్రోత్సహించిన ఛాందసవాదులు ఆ రెండు దేశాలకు ఒక సవాలుగా మారారు. ఈ సవాలు ఇప్పటికీ అలాగే ఉంది.
1962లో భారతదేశంపై చైనా దాడి చేసింది. ఈ దాడి జరిగిన దాదాపు మూడు సంవత్సరాల తరువాత, పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసింది.


ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అంచనా తప్పింది…
కానీ, ఈ యుద్ధం విషయంలో పాకిస్తాన్ అంచనా తప్పని రుజువైంది.
అప్పుడు చైనాతో యుద్ధం కారణంగా భారత్ నైతిక స్థైర్యం బాగా దెబ్బతిని ఉంటుందని, దానివల్ల భారత్‌ను ఓడించొచ్చని పాకిస్తాన్ భావించింది. కానీ అది తన లక్ష్యాన్ని సాధించలేకపోయింది.
1965 యుద్ధంలో పాక్‌కు అమెరికా సైనిక సహాయం చేయలేదు. అదే సమయంలో భారత్‌కు కూడా మద్దతు ఇవ్వలేదు.
1971 యుద్ధంలో పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేసింది. యుద్ధనౌక యూఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్ కూడా వియత్నాం నుంచి బంగాళాఖాతానికి చేరుకుంది. అవసరమైతే పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేయగలదన్న సందేశం సోవియట్ యూనియన్‌కు పంపడానికే అమెరికా ఇలా చేసిందని భావిస్తారు.
యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోనప్పటికీ దౌత్యపరంగా, నైతికంగా పాకిస్తాన్‌తో ఉంది.
1971 ఆగస్టులో, అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ‘భారత్-సోవియట్ శాంతి, స్నేహం, సహకార ఒప్పందం’పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, యుద్ధం జరిగితే దౌత్యపరంగా ,ఆయుధాల ద్వారా మద్దతు ఇస్తామని సోవియట్ యూనియన్ భారతదేశానికి హామీ ఇచ్చింది.
1971లో భారత్, పాకిస్తాన్ మధ్య 13 రోజుల పాటు యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్‌లో తలెత్తిన మానవతా సంక్షోభం కారణంగా ఈ యుద్ధం వచ్చింది. దీని తర్వాతే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అంటే పాకిస్తాన్‌ను రెండు భాగాలుగా విభజించడంలో భారత్ విజయవంతమైంది.
పాశ్చాత్య దేశాలకు మిత్రదేశంగా ఉన్నప్పటికీ, భారత్‌తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు పాశ్చాత్యదేశాల నుంచి మాత్రమే కాదు…గల్ఫ్‌లోని ఇస్లామిక్ దేశాల నుంచి కూడా మద్దతు ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, 1999లో, పాకిస్తాన్ మరోసారి కార్గిల్ దాడి చేసింది. కానీ అప్పుడు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఈ మూడు యుద్ధాల తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. సోవియట్ యూనియన్ ముక్కలయింది. ప్రపంచం ఏకధ్రువంగా మారింది. ప్రపంచక్రమాన్ని మార్చేందుకు చైనా బలంగా ప్రయత్నిస్తోంది.
మరోవైపు, భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించింది. మారుతున్న ప్రపంచంలో భారత్‌కు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోగలిగింది. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక రంగంలో సౌదీ అరేబియా, చైనా, ఇంకా కొన్ని ప్రపంచసంస్థలపై ఆధారపడి ఉంది.
అఫ్గానిస్తాన్‌లో ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉందో అమెరికా ఇప్పుడు పెద్దగా పట్టించుకోదు. ఇలాంటి పరిస్థితిలో మునుపటిలా అమెరికాకు పాకిస్తాన్ అవసరం లేదు.
రెండు దేశాల మధ్య లోతైన, బలమైన సంబంధాలు ఇప్పుడు… ఒకదేశం ఆర్థిక వ్యవస్థకు ఇంకొక దేశం ఎంత దోహదపడుతుందనే దానిపై కూడా ఆధారపడి ఉంటోంది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను దాటింది. కీలక గల్ఫ్ దేశమైన యూఏఈతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం కూడా 100 బిలియన్ డాలర్లను దాటింది. సౌదీ అరేబియాతో భారతదేశం వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం కూడా దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం రష్యాతో 65 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇప్పుడు భారతదేశపు మూడు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు ఒకప్పుడు పాకిస్తాన్ మిత్రదేశాలు లేదా గతంలో మితృత్వం ఉన్న దేశాలు.
కానీ పాకిస్తాన్‌తో ఈ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పుడు అంత ఎక్కువ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
దేశాల మధ్య సంబంధాలను నిర్ణయిస్తున్న వాణిజ్యం
భారతదేశంలాంటి పెద్ద మార్కెట్‌ను విస్మరించాలని ఏ దేశమూ కోరుకోదు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని సౌదీ అరేబియా వ్యతిరేకించకపోవడంపై పాకిస్తాన్ అప్పట్లో స్పందించిది. సౌదీ అరేబియా వ్యాపార ప్రయోజనాలు భారతదేశంతో ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది.
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోదీని ‘అన్నయ్య’ అని పిలుస్తారు.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత మారిన ప్రపంచంలో భారతదేశం ప్రాధాన్యం పెరిగింది. పాకిస్తాన్ దాని గత ప్రాముఖ్యతను నిలబెట్టుకోవడంలో కూడా విఫలమైంది.
ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత వాణిజ్య లావాదేవీలపై ఆధారపడే సంబంధాలు మరింత ఊపందుకున్నాయి. అంటే, ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాతో ఎవరు ఉన్నారు, అమెరికాను ఎవరు వ్యతిరేకించారు అనే దానికంటే మీరు అమెరికా నుంచి ఎంత కొంటారు, ఎంత అమ్ముతారు అనేది ముఖ్యంగా మారింది.
రష్యాతో కూడా ట్రంప్ మంచి సంబంధాలను కోరుకుంటున్నారు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ అమ్మకాలు, కొనుగోళ్లు చేసే అవకాశం తక్కువగా ఉంది.
భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలు కావడంతో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, రెండు దేశాలు శాంతి చర్చలు జరపాలని అంతర్జాతీయంగా విజ్ఞప్తులు పెరుగుతున్నాయి.
ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వస్తున్న ఈ విజ్ఞప్తులు గమనిస్తే ఎవరు భారత్‌కు అనుకూలంగా ఉన్నారు, ఎవరు పాకిస్తాన్‌కు సానుభూతి చూపిస్తున్నారు అనేదానిపై ఓ అవగాహన వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
తుర్కియే ఎవరితో ఉంది?
“భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. ఈ ఉద్రిక్తత యుద్ధంగా మారవచ్చు. క్షిపణి దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్, ఆ దేశ ప్రజలు మాకు సోదరుల లాంటివారు. వారి కోసం మేం అల్లాను ప్రార్థిస్తున్నాం” అని తుర్కియే అధ్యక్షుడు ఎర్దొవాన్ గురువారం రాత్రి(మే 8) ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘’పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌తో నేను ఫోన్‌లో మాట్లాడాను. జమ్మూకశ్మీర్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది మంటల్లో ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఉద్రిక్తతలను తగ్గించి చర్చలు ప్రారంభించాలని తుర్కియే కోరుకుంటోంది. పరిస్థితి చేయిదాటకముందే రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం” అని ఎర్దొవాన్ అన్నారు.
ఎర్దొవాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.
పహల్గాం దాడిని అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ కూడా డిమాండ్ చేస్తోంది. అంతే కాకుండా, పాకిస్తాన్‌లో మరణించిన ప్రజలకు మాత్రమే ఎర్దొవాన్ నివాళులర్పించారు. పాకిస్తాన్ ప్రజలను సోదరులుగా అభివర్ణించారు.
తుర్కియే అధ్యక్షునిగా ఎర్దొవాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఆ దేశానికి పాకిస్తాన్‌తో సైనిక స్థాయి సంబంధాలు పెరిగాయి. భారతదేశంతో దూరం పెరిగింది.
తుర్కియే, పాకిస్తాన్ రెండూ సున్నీ ముస్లిం మెజారిటీ దేశాలు. ఇస్లామిక్ దేశాల ఐక్యత గురించి రెండూ మాట్లాడుతుంటాయి. అయినప్పటికీ, భారతదేశం, తుర్కియే మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకంటే ఎక్కువే. కానీ పాకిస్తాన్‌తో తుర్కియే వాణిజ్యం ఒక బిలియన్ డాలరు మాత్రమే దాటింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్రిక్తతల వేళ భారత్‌లో సౌదీ, ఇరాన్ మంత్రుల పర్యటన
మరోవైపు, సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్-జుబైర్ గురువారం(మే 8) అకస్మాత్తుగా భారత్‌కు వచ్చారు. దీనిపై ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను కూడా జుబైర్ కలిశారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ కూడా భారతదేశానికి వచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది.
అదెల్ అల్-జుబైర్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం, ప్రధాని మోదీని కలవడం కూడా అసాధారణంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు, ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగింది. ఈ దాడి తర్వాత, సౌదీ పర్యటనను ప్రధాని మధ్యలోనే ముగించుకున్నారు.
“సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్-జుబేర్‌తో మంచి చర్చలు జరిగాయి. ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కోవడంపై భారత వైఖరిని అర్ధం చేసుకున్నారు” అని అదెల్ అల్-జుబేర్‌ను కలిసిన తర్వాత, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు.
భారత్, పాకిస్తాన్ మధ్య శాంతిని కోరుతూ సౌదీ అరేబియా ఏప్రిల్ 30న ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. సౌదీ అరేబియా ఏ ఒక్కరివైపో ఉన్న అభిప్రాయాన్ని ఆ ప్రకటన కలిగించలేదు.
ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన పరిస్థితుల్లో సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి భారత్‌లో పర్యటించారు. గతంలో ప్రతి క్లిష్ట సమయంలోనూ సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. 1965, 1971 యుద్ధాల్లో సౌదీ పాకిస్తాన్‌కు అండగా ఉంది.
భారతదేశం 1998లో నిర్వహించిన అణుపరీక్షలకు దీటైన జవాబు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ప్రతిరోజూ 50 బ్యారెళ్ల చమురును అందిస్తామని పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, @DrSJaishankar
కోల్డ్‌వార్ కాలంలో సౌదీ అరేబియా కూడా పాశ్చాత్య శిబిరంలో ఉంది. కాబట్టి పాకిస్తాన్‌తో సౌదీ సాన్నిహిత్యం సహజం. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. పాకిస్తాన్ పట్ల ఆ దేశాల వైఖరి కూడా మారిపోయింది.
పశ్చిమ దేశాలకు భారత్ దగ్గరయింది. పాకిస్తాన్ పట్ల ఆ దేశాలకు అపనమ్మకం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో, పాక్, సౌదీ అరేబియా సంబంధాలు కూడా ప్రభావితమయ్యాయి.
కశ్మీర్ విషయంలో సౌదీ అరేబియా వైఖరి పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండేది. అయితే 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసినప్పుడు, సౌదీ అరేబియా పూర్తిగా తటస్థంగా ఉంది. అప్పుడు పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న షా మహమూద్ ఖురేషి, సౌదీ అరేబియాపై విమర్శలు కూడా చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఇరాన్ ఎవరితో ఉంది?
కశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరికి ఇరాన్ కూడా మద్దతు ఇస్తోంది. అయితే పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఇరాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌లలో ఇరాన్ ఏ దేశం వైపు నిలబడటం లేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తన భారత పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌లతో సమావేశమయ్యారు.
”భారతదేశం, ఇరాన్ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. రెండుదేశాల జాయింట్ కమిషన్ 20వ సమావేశం జరిగింది. ఇరువర్గాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. చాబహార్ పోర్టుకు సంబంధించి అనేక స్థాయిల్లో చర్చలు జరిగాయి. దక్షిణాసియాలో స్థిరత్వం, భద్రత ముఖ్యం. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతను చర్చల ద్వారా తగ్గించాలి” అని ఈ సమావేశాల తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్ లేదా పాకిస్తాన్‌లలో ఇరాన్ ఎవరి వైపు ఉందనే సందేశం ఇచ్చేలా.. ఏ మాటలూ ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పలేదు. ఈ మొత్తం విషయంలో ఇరాన్ తటస్థ వైఖరి ప్రదర్శించింది.
భారతదేశానికి ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వం ఎవరికీ కనిపించదు. భారత్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ రాయబారి అనేకసార్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వైఖరేంటి?
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తోడుగా ఉంటామని రష్యా తెలిపింది.
పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యపై చైనా విచారం వ్యక్తం చేసింది, కానీ ఉగ్రవాదాన్ని కూడా ఖండించింది. ఇరుదేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించింది.
అమెరికా కూడా ఉగ్రవాదాన్ని బహిరంగంగా ఖండించింది. రెండు దేశాలు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, నిక్కీ హేలీ వంటి అమెరికన్ నేతలు భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.
భారతదేశానికి బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునాక్ మద్దతిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)