SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Yahya
పహల్గాం దాడిలో 26 మంది పర్యటకులు మరణించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ పోలీసులు, స్థానిక అధికారులు మదరసాలను మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కనీసం వెయ్యి మదరసాలను పదిరోజుల్లో మూసివేశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచే ఉంచారు.
మదరసాలను మూసివేయడమే కాకుండా ఈ ప్రాంతంలోకి పర్యటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని ప్రభుత్వం లేఖలో ఆదేశించింది.
ప్రస్తుతం పాకిస్తాన్ పాలిత కశ్మీర్, మరీముఖ్యంగా నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుధాలు ఉపయోగించడం, తమను తాము రక్షించుకోవడం, ప్రాథమిక చికిత్స వంటివాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.


ఫొటో సోర్స్, Yahya
ముజఫరాబాద్‌లో అత్యవసర సహాయనిధి ఏర్పాటు చేశారని అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖకు దగ్గరలోని గ్రామాలకు రెండు నెలలకు సరిపడా ఆహారం, నీళ్లు, ఔషధాలు సరఫరా చేశారని తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం గమనించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించే కార్యకర్తలు, ఇతర సిబ్బందిని ఇక్కడకు తరలించామని ముజఫరాబాద్‌లో రెడ్ క్రెసెంట్ హెడ్ గుల్జార్ ఫాతిమా రాయిటర్స్‌తో చెప్పారు.
భారత్ సైనిక చర్యకు దిగితే నియంత్రణ రేఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలసొచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో, కనీసం 500 మందికి సరిపోయేలా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
మదరసాలు ఎందుకు మూసేస్తున్నారు?
నియంత్రణ రేఖకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలోని హజీరా ప్రాంతంలో ఉన్న జామియా మదీనా అరేబియా మదరసాను స్థానిక యంత్రాంగం ఆదేశాల మేరకు పదిరోజుల పాటు మూసివేశారు.
ఈ మదరసాలో 200 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. గురువారం (మే 1) మదరసా అధికార యంత్రాగం ఈ విద్యార్థులందరినీ అత్యవసరంగా ఇళ్లకు పంపించేసింది.
అసాధారణ పరిస్థితి దృష్ట్యా మదరసాను మూసివేయాల్సిందిగా స్థానిక ప్రభుత్వం ఆదేశించిందని జామియా మదీనా అరబియా మదరసా హెడ్ మౌల్వి గులామ్ షకీర్ చెప్పారు.
భారత్ ఏదైనా చర్యకు దిగితే, మదరసాలను లక్ష్యంగా చేసుకోవడం తేలికని అధికారులు చెప్పినట్టు షకీర్ తెలిపారు.
”స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే వారిలో ఎక్కువ మంది పిల్లలు హాస్టళ్లలో ఉండరు. మదరసాల్లో చదువుకునే పిల్లల్లో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటారని, అందుకే మదరసాలు లక్ష్యంగా మారే అవకాశం ఎక్కువ” అని షకీర్ అభిప్రాయపడ్డారు.
”మా మదరసా నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంది. 2019 ఉద్రిక్తతల సమయంలో మా మదరసా దగ్గర తుపాకీ గుండ్లు పడ్డాయి. కానీ, ఆ సమయంలో ఎలాంటి నష్టం జరగలేదు. సరిహద్దుల్లో భారత్ భారీ ఆయుధాలు ఉపయోగిస్తే మా మదరసా కూడా ఆ దాడి పరిధిలోకి వచ్చే ప్రమాదముంది. అందుకే మదరసా మూసివేయాలన్న ఆదేశాన్ని మేం పాటించాం” అని షకీర్ అన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో భారత పారామిలటరీ బలగాలు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు చనిపోయారు.
నిషేధిత తీవ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ దీనికి బాధ్యత ప్రకటించుకుంది.
పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ప్రాంతంలో భారత వాయుసేన ఫైటర్ జెట్లు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ శిక్షణా శిబిరం ధ్వంసమైందని, అనేకమంది ”ఉగ్రవాదులు” చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘కాల్పులు జరిగితే ప్రజలు బంకర్లలోకి వెళ్తారు’
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇళ్లల్లో బంకర్లు నిర్మించుకున్నారు.
”కాల్పులు ప్రారంభమైన వెంటనే ప్రజలు బంకర్లలోకి వెళ్తారు” అని 22 ఏళ్ల ఫైజాన్ ఇనాయత్ రాయిటర్స్‌తో చెప్పారు.
పహల్గాం దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని లిపా వ్యాలీ స్థానిక అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. వారికి ప్రాథమిక చికిత్సకు సంబంధించిన శిక్షణ అందించింది.
అధికారుల విజ్ఞప్తి తర్వాత వలంటీర్లుగా ఉండేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు.
”ఇవాళ కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి.. భారత్‌తో యుద్ధముంటుందని మాకు తెలుసు. నియంత్రణ రేఖ వెంట యుద్ధం జరిగే అవకాశముంది. మా ప్రాంతంపై చాలా ప్రభావం పడుతుంది. అందుకే నా స్నేహితులతో కలిసి ఈ శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నా” అని వలంటీర్ ఉమైర్ మొహమ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Yahya
పర్యటకులు లేక బోసిపోయిన నీలమ్ వ్యాలీ
మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే నీలమ్ వ్యాలీకి పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
గత ఏడాది ఏప్రిల్ చివరివారం, మే మొదటివారాల్లో నియంత్రణ రేఖ వెంబడి నీలమ్ లోయలో చివరి గ్రామమైన తౌబాత్కు పెద్ద సంఖ్యలో పర్యటకులు వచ్చారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరివారంలో పెద్ద సంఖ్యలో పర్యటకులు వచ్చారు. కానీ, భారత్ దాడి చేస్తుందన్న ఆలోచనతో పర్యటకులను అక్కడి నుంచి పంపించేశారు.
నిసార్ అహ్మద్, ఆయన భార్య నస్రీన్ అహ్మద్ బ్రిటన్ నుంచి తమ పిల్లలతో పాకిస్తాన్‌కు వచ్చారు. నీలమ్ లోయతో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తామని ఆ దంపతులు పిల్లలతో చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు.
తక్షణమే ఆ ప్రాంతం విడిచి వెళ్లడం మంచిదని మే 1న నీలమ్ వ్యాలీలో తమకు చెప్పారని నిసార్ అహ్మద్ తెలిపారు.
”మేం నిరుత్సాహంతో తిరిగి వచ్చాం. మా పిల్లలకు నీలమ్ వ్యాలీని చూపించే అవకాశం మళ్లీ వస్తుందో రాదో మాకు తెలియదు” అని ఆయన తెలిపారు.
తౌబాత్, నీలమ్ వ్యాలీ ప్రజలకు ప్రధాన ఉపాధి పర్యటక రంగమేనని తౌబాత్ హోటల్, గెస్ట్ హౌస్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ యాహ్యా చెప్పారు.
రెండు రోజుల క్రితం కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యటకులు వచ్చారు. కానీ ఇప్పుడు తౌబాత్, నీలమ్ వ్యాలీ ఖాళీ అయిపోయాయి.
పర్యటకులను ఆపివేశారని, ఈ నిషేధం తాత్కాలికమని, పరిస్థితి మెరుగపడగానే మళ్లీ అనుమతిస్తామని అధికారులు తనతో చెప్పినట్టు యాహ్యా తెలిపారు.
”మే నెల కోసం ఇప్పటికే 50 శాతం హోటళ్లు, గెస్ట్ హౌస్‌ల బుకింగ్‌లు అయిపోయాయి. ఇప్పుడు పర్యటకులు రాకుండా నిషేధం విధించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి” అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికార యంత్రాగం ఏం చెబుతోంది?
భారత్ చర్య తీసుకుంటుందని ఎవరూ భయపడడం లేదని స్థానిక అధికార యంత్రాగానికి చెందిన పీర్ మజ్హర్ సయీద్ షాహ్ బీబీసీతో చెప్పారు. అయితే, ఎలాంటి చర్యకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
స్కూళ్లు, కాలేజీలు తెరిచి ఉన్నాయని, భారత్ దాడి చేసే అవకాశం ఉండడంతో కొన్ని మదరసాలను మాత్రం మూసివేశామని ఆయన చెప్పారు.
మిగిలిన మదరసాలను మూసి ఉంచాలా? లేదా? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయని, అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
కొన్నిరోజుల పాటు పర్యటకుల రాకను కూడా నిలిపివేశామని పీర్ మజ్హర్ షాహ్ తెలిపారు. ఏప్రిల్ 27,28న 1,250 మంది టూరిస్టులు నీలమ్ వ్యాలీకి వచ్చారని ఆయన చెప్పారు.
”ఎవరూ భయపడడం లేదనడానికి ఈ పెద్ద సంఖ్య ఉదాహరణ. అయినప్పటికీ భారత్ హెచ్చరికల తర్వాత ముందుజాగ్రత్త చర్యగా పర్యటకులను ఆపివేశాం. అయితే, ఇప్పటికే పర్యటక ప్రాంతాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించడం లేదు” అని షాహ్ అన్నారు.
ఈ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని షాహ్ చెప్పుకొచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)