SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, BBC/Lee Durant
మియన్మార్‌లో మార్చ్ నెలాఖరులో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 3,700 మంది మరణించిన తర్వాత మిలటరీ దాడులను నిలిపివేయడానికి అక్కడి సైనిక ప్రభుత్వం అంగీకరించింది.
కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీమళ్లీ ఉల్లంఘిస్తోంది.
ఏప్రిల్ మధ్యలో నేను తూర్పు కరెన్ని రాష్ట్రంలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతంలోకి వెళ్లాను. 10 రోజులు అక్కడున్నాను. జుంటా ప్రభుత్వం ప్రతిరోజూ ఉల్లంఘనలకు పాల్పడడం నేను చూశాను. రాకెట్లు, మోర్టార్లతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సాధారణ ప్రజలు, తిరుగుబాటుదారులు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు.
మృతుల్లో ఒకరు 45 ఏళ్ల ఖలా. మిలటరీ వైమానిక దాడుల్లో ఆయన చనిపోయారు.


ఫొటో సోర్స్, BBC/Lee Durant
కాల్పుల విరమణ నిజమని నమ్మి…
ఏప్రిల్ 2న కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు చాలా ఏళ్ల తర్వాత తొలిసారి తమ ఇళ్లకు రావడానికి ఇది ఒక అవకాశమని ఖలా, ఆయన భార్య మలా భావించారు.
శరణార్థులుగా తాము ఆశ్రయం పొందిన శిబిరం నుంచి నాలుగేళ్ల బిడ్డతో కలిసి స్వగ్రామం పెకిన్ కోకోకు బయలుదేరారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న పోరాటంతో భవనాలన్నీ శిథిలావస్థలో ఉండడాన్ని వారు గుర్తించారు. జుంటా ఆయుధాల బారి నుంచి తప్పించుకునేందుకు దాదాపుగా అక్కడున్నవారంతా వ్యవసాయభూములకు తరలి వెళ్లారు.
ఖలా కుటుంబం తమ వస్తువులన్నింటినీ కారులో ఉంచుకుని, మళ్లీ పెకిన్ కోకో నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరుతుండగా షెల్లింగ్ మొదలయింది.
”మేమంతా ఇంటి ముందు ఉన్నాం. మా దగ్గరలోనే షెల్స్ పడ్డాయి. మేం ఇంటి వెనక దాక్కున్నాం. కానీ ఆయన(ఖలా) అక్కడే ఉండిపోయారు. బాంబులు ఆయన సమీపంలో పడి పేలాయి. ఎక్కడ క్షేమంగా ఉంటానని ఆయన భావించారో అక్కడే ఆయన చనిపోయారు” అని మలా చెప్పారు.
”ఆయన చాలా మంచి వ్యక్తి” అని చెబుతూ ఆమె ఏడ్చారు.
అదే రోజు మధ్యాహ్నం యుద్ధ విమానాలు ఆ వీధిలోని ఓ ఇంటిపై దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు చనిపోయారు.
”వాళ్లంటే నాకు ద్వేషం. ఏ కారణ లేకుండా ఎప్పుడూ ప్రజలపై దాడి చేస్తుంటారు. నాకిక్కడ సురక్షితం అనిపించడం లేదు. జెట్ విమానాలు ఆకాశంలో తరచుగా ఎగురుతుంటాయి. మేం దాక్కోడానికి చోటు లేదు” అని మలా చెప్పారు.
31 ఏళ్ల మలా ఏడునెలల గర్భిణి. శరణార్థుల శిబిరానికి తిరిగివచ్చిన ఆమె భర్తను కోల్పోయిన దు:ఖంలో మునిగిపోయారు. తండ్రిని కోల్పోయిన ఆమె కొడుకు జోయ్ తల్లిని విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదు.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
భూకంపంతో మరింత దిగజారిన పరిస్థితులు
భూకంపానికి ముందు నుంచి మియన్మార్‌లో అంతర్యుద్ధం సాగుతోంది.
2021లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకున్నతర్వాత అనేక మంది చిన్నారులు సహా వేలమంది మరణించారు. మరో 20 లక్షల మందిని భూకంపం నిరాశ్రయులుగా మార్చిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
భూకంపానికి ముందు 25 లక్షల మంది ప్రజలు చెల్లాచెదురయ్యారు.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
భూకంపం కన్నా మిలటరీ దాడుల ప్రభావమే ఎక్కువ
కరెన్ని, కయాహ్ రాష్ట్రం భూకంప కేంద్రానికి దూరంగా ఉంది. అది మారుమూల ప్రాంతం కావడం ఓ రకంగా వరం. మరో రకంగా శాపం. మిలటరీ పాలనను వ్యతిరేకిస్తున్నవారు అజ్ఞాత జీవితం గడపడానికి దట్టమైన అడవి అనుకూలంగా ఉంటుంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడం కష్టం. రోడ్లు అధ్వానంగా ఉంటాయి. ప్రధాన రహదారులు ఆర్మీ తుపాకుల పరిధిలో ఉంటాయి. ఈ రాష్ట్రంలో చాలా భాగం ఇప్పుడు తిరగుబాటుదారులు, ఎథ్నిక్ గ్రూపుల అధీనంలో ఉంది.
మార్చి 28న సంభవించిన భూకంపంలో కరెన్నికి చెందిన వారు ఎవరూ మరణించలేదు. కానీ ఇప్పటికీ వెన్నెముకతో పాటు ఇతర అవయవాలకు గాయాలతో బాధపడుతున్నవారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
డెమోసో పట్టణం చుట్టూ ఉన్న అడవుల్లో వంద అడుగుల సింక్ హోల్ ఏర్పడింది. ఆ శబ్దం విన్నప్పుడు స్థానికులు మరో వైమానిక దాడేమో అనుకున్నారు. తర్వాత వచ్చిన ప్రకంపనలతో చాలా వారాల పాటు ఆ సింక్‌హోల్ మరింతగా విస్తరిస్తూనే ఉంది.
కాల్పుల విరమణను ఉల్లంఘించి భూకంపం తర్వాత కూడా మియన్మార్ సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. వాటిని ముగించాలని కోరింది. ఉల్లంఘనల ఆరోపణలపై జుంటా ప్రభుత్వం స్పందించలేదు. తిరుగుబాటు సైన్యాలు దాడులు చేస్తున్నాయని ఆరోపించింది. కాల్పుల విరమణ సమయంలో దాడులు జరిగితే స్పందించే హక్కు అన్నివర్గాలకు ఉంటుంది.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
కాల్పుల విరమణ ఒక ‘జోక్’
పదిరోజుల పాటు నేను కరెన్నిలోని మొబియెలో ఉన్న సమయంలో జుంటా ప్రభుత్వం రోజూ దాడులు చేసింది.
అక్కడ నేను 23ఏళ్ల స్టెఫానోను కలిశాను. కరెన్ని జాతీయుల రక్షణ దళం(కేఎన్డీఎఫ్)తో కలిసి మిలటరీ నియంతృత్వంపై ఆయన పోరాడుతున్నారు.
స్థావరం చుట్టూ కందకాలు ఏర్పాటు చేసిన ఒక ప్లటూన్‌కు ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
జుంటా స్థావరాలకు కేవలం 330అడుగుల దూరంనుంచి మిలటరీ అన్ని రకాలుగా దాడులకు దిగిందని ఆయన చెప్పారు. సైన్యం డ్రోన్లు, జెట్ విమానాలనూ ఉపయోగించిందని ఆయన తెలిపారు.
”ఇక్కడ డ్రోన్లు ఉపయోగించడం, ఫిరంగుల దాడి సాధారణంగా జరుగుతున్నాయి. వర్షాలు పడేటప్పుడు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు” అని ఆయన తెలిపారు.
కాల్పుల విరమణను ఆయన ఒక ”జోక్”గా అభివర్ణించారు.
”మిలటరీని మేం మొదటి నుంచీ నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు. భవిష్యత్తులో కూడా నమ్మబోం” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
‘జుంటా ఓటమితోనే’
మరుసటి రోజు భారీ ఆయుధాలతో తిరుగుబాటుదారులపై సైన్యం పూర్తిస్థాయి దాడులకు దిగింది. దాడులు జరిగిన ప్రాంతాలలోంచి మేం వెళ్తున్నప్పుడు మోర్టార్ దాడులతో పాటు చిన్న తరహా ఆయుధాలు పేలుతున్న శబ్దం వినిపించింది. డ్రోన్ల దాడుల శకలాలతో అక్కడి ప్రాంతం దద్దరిల్లింది.
కాల్పుల విరమణ సమయంలో తాము అన్ని కార్యకలాపాలు నిలిపివేశామని, దాడి జరిగితే తాము స్పందిస్తామని స్టెఫానో చెప్పారు.
తిరుగుబాటు దళాలనే కాకుండా సాధారణ పౌరులనూ మిలటరీ లక్ష్యంగా చేసుకుంటోంది. దాడుల్లో 60 ఏళ్ల మహిళ చనిపోయారు. నాలుగు రాకెట్ల దాడి జరిగిన పొలాల్లోకి మేం వెళ్లేసరికి వాటి శకలాలతో పిల్లలు ఆడుకుంటున్నారు.
దాడుల్లో గాయపడ్డవారిని జుంటా వైమానికదాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా అడవుల్లోపల ఉన్నస్థానిక ఆస్పత్రులకు తరలించారు
కాల్పుల విరమణ తర్వాత దాడుల్లో గాయపడ్డ చాలామందికి చికిత్స అందించానని ఆస్పత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ అయిన 32 ఏళ్ల థి హ టున్ చెప్పారు.
”ఏ ప్రదేశమూ సురక్షితం కాదు. ఆకాశంలో జెట్ ఫైటర్లు ఎగురుతున్నప్పుడు పై నుంచి ఏం పడుతుందో తెలియదు” అని స్థానిక చర్చి ఫాదర్ ఫిలిప్ చెప్పారు.
”ప్రజల ప్రార్థనలు, ఏడుపులు, అరుపులు నేను వింటాను. నియంతృత్వాన్ని మేం పారదోలుతాం. జుంటా ఓటమితోనే మేం నమ్మగల కాల్పుల విరమణ జరుగుతుంది” అని స్టెఫానో అన్నారు.
ఈ నెల చివరకు కాల్పుల విరమణ ముగుస్తుంది. కానీ ఇక్కడ చాలా మందికి అదసలు అమలయిందనే అనిపించడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)