SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
16 ఏప్రిల్ 2025
ఒక మహిళను చట్టపరంగా ఎలా నిర్వచించాలనే దానిపై యూకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే చట్టప్రకారం లింగపరంగా మహిళల గుర్తింపు దక్కుతుందని యూకే సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
సమానత్వ చట్టం 2010లో “స్త్రీ” “లింగం” అనే పదాలు పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టినవారిని, పుట్టుకతో ఏ లింగానికి చెందినవారు అన్న విషయాలను సూచిస్తాయని యూకే సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పునిచ్చింది.
”సమానత్వ చట్టం 2010లోని లింగం, పురుషుడు, స్త్రీ అన్న పదాలకు.. పుట్టుకతో ఏ లింగానికి చెందిన వారని అర్ధం” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హోడ్జ్ చెప్పారు.
అయితే, ఈ తీర్పును ఒకటి లేదా మరిన్ని గ్రూపుల విజయానికి.. ఇంకో గ్రూపు చెల్లించిన మూల్యంగా చూడొద్దని, ఈ తీర్పు అర్ధం అదికాదని తాము సూచిస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హోడ్జ్ చెప్పారు.
స్కాటిష్ ప్రభుత్వం, ఓ మహిళా గ్రూప్ మధ్య దీర్ఘకాలంగా జరిగిన న్యాయపోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది.
అయితే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రక్షణ ఉందని న్యాయమూర్తి చెప్పారు.

” సమానత్వ చట్టం 2010 ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు లింగమార్పిడిపై వివక్ష నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా మార్పిడి చేయించుకున్న లింగంలో ప్రత్యక్ష, పరోక్ష వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా కూడా రక్షణను అందిస్తుంది” అని లార్డ్ హోడ్జ్ తెలిపారు.
లింగ గుర్తింపు సర్టిఫికెట్(జీఆర్సీ)తో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు లింగ ఆధారిత రక్షణ హక్కు కలిగి ఉంటారన్నది స్కాటిష్ ప్రభుత్వం వాదన. ఆడపిల్లగా జన్మించిన వారికి మాత్రమే అవి వర్తిస్తాయని విమెన్ స్కాట్లాండ్ వాదించింది.
స్కాటిష్ ప్రభుత్వం మార్గదర్శకాలు తప్పని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
స్కాట్లాండ్, ఇంగ్లండ్, వేల్స్లో లింగ-ఆధారిత హక్కులు ఎలా వర్తిస్తాయనే దానిపై ఈ తీర్పు విస్తృత ప్రభావాన్ని చూపవచ్చు.
యూకే సుప్రీం కోర్టు తీర్పుతో స్కాటిష్ ప్రభుత్వంపై ఫర్ విమెన్ స్కాట్లాండ్ కేసు గెలిచినట్టయింది.
ఫర్ విమెన్ స్కాట్లాండ్ గ్రూపు మద్దతుదారులు, ప్రచారకర్తలు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆనందభాష్పాలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇది ఒక గ్రూపు పరాజయంగా, మరొకరి విజయంగా చూడొద్దని న్యాయమూర్తి లార్డ్ హోడ్జ్ చెప్పినప్పటికీ.. కోర్టు బయట పరిస్థితులు గమనిస్తే.. ఒక గ్రూపు సంబరాలు చేసుకుంటున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
లింగమార్పిడి చేయించుకుంటే…
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు) విషయంలో చట్టం తీరు ఈ తీర్పుతో తేలింది.
ఒకే లింగానికే(ఆడ లేదా మగ) చెందిన స్థలాలు, సేవలు, సమాన వేతన దావాలు, ప్రసూతి విధానం, క్రీడా కార్యక్రమాలు వంటివాటిపై ఈ తీర్పు ప్రభావం చూపొచ్చు.
లింగ సంబంధిత సమస్యలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో ఈ వాదనలు ముందుకొచ్చాయి.
2010 సమానత్వ చట్టం సరైన అర్ధాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది. ఇది యూకే అంతటా అమలు కానుంది.
లింగపరమైన గుర్తింపు, లింగ మార్పిడి సహా వివిధ లక్షణాల ఆధారంగా వివక్షకు వ్యతిరేకంగా ఈ చట్టం రక్షణను అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
లింగపరమైన గుర్తింపు ఎలా..?
‘లింగం’ అనే పదం అర్ధంపై లండన్‌లోని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. పుట్టుకతో వచ్చే లింగ గుర్తింపా, లేక 2004 లింగ గుర్తింపు చట్టం ప్రకారం లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు పొందే సర్టిఫికెట్ ఆధారంగా లభించే న్యాయపరమైన గుర్తింపా అన్నది సుప్రీం కోర్టు తేల్చింది.
జీఆర్సీ పొందడమనేది “అన్ని ప్రయోజనాల కోసం” లింగ మార్పుకు సమానమని 2004 చట్టం స్పష్టంగా తెలియజేస్తోందని స్కాటిష్ ప్రభుత్వం చెబుతోంది.
తాము కోరుకున్నట్టుగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి… ఆ లింగానికి సంబంధించిన రక్షణలకు అర్హులని ప్రభుత్వ న్యాయవాది రూత్ క్రాఫోర్డ్ కేసీ కోర్టుకు చెప్పారు,
పురుషుడు, స్త్రీ అనే పదాలకు ఉన్న ”కామన్ సెన్స్”లో అర్ధం గురించి విమెన్ స్కాట్లాండ్ ప్రతినిధి ఐడాన్ ఓ నీల్ కేసీ వాదించారు. లింగపరమైన గుర్తింపు అనేది మార్పులేని జీవస్థితి అని కోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, PA Media
ఇక్కడి వరకు ఎలా వచ్చింది?
ప్రభుత్వ రంగ బోర్డులలో లింగ సమతుల్యతను పాటించేలా స్కాటిష్ పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించినప్పుడు 2018లో ఈ న్యాయ వివాదం ప్రారంభమైంది.
ఆ చట్టంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను కోటాలో భాగంగా చేర్చినందుకు మంత్రులపై ఫర్ విమెన్ స్కాట్లాండ్ ఫిర్యాదు చేసింది.
స్కాటిష్ కోర్టులలో అనేక కేసుల తర్వాత…అంతిమ తీర్పు కోసం లండన్‌లోని సుప్రీంకోర్టుకు ఈ అంశాన్ని బదలాయించారు.
కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే…ఆసుపత్రి వార్డులు, జైళ్లు, శరణార్థి శిబిరాలు, సహాయ గ్రూపులు వంటి ఒకే లింగానికి చెందిన స్థలాలు, సేవల నిర్వహణపై ప్రభావం ఉంటుందని ఫర్ విమెన్ స్కాట్లాండ్ హెచ్చరించింది.
లింగమార్పిడి చేయించుకున్నవారికి వివక్షకు వ్యతిరేకంగా లభించే రక్షణను ఈ కేసు తొలగించివేస్తుందని ట్రాన్స్జెండర్లు హెచ్చరించారు.
సమానత్వ చట్టం ఇతర మైనారిటీ సమూహాలను రక్షిస్తుందని, ఈ కేసు ఇతరుల హక్కులను అణగదొక్కగలిగే ప్రారంభం కావొచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.
2010 చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ కేసు ఫలితంగా చట్ట సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
ఒక వ్యక్తి చట్టబద్ధంగా లభించిన లింగ గుర్తింపును మార్చుకోవడాన్ని సులభతరం చేసే సంస్కరణలను స్కాటిష్ పార్లమెంట్ 2022లో ఆమోదించింది.
ఈ చర్యను యూకే ప్రభుత్వం అడ్డుకుంది. తర్వాత మంత్రులు దీనిని ఉపసంహరించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS