SOURCE :- BBC NEWS

పెలికో కేసు, ఫ్రాన్స్, కరోలిన్ డారియన్

ఫొటో సోర్స్, Jeff Overs/BBC

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక వేధింపుల గురించిన వర్ణన ఉంది.

అది 2020 నవంబర్ నెలలో ఒక సోమవారం. ఆ రోజు సాయంత్రం 8 గంటల 25 నిమిషాలకు వచ్చిన ఒక్క ఫోన్‌ కాల్‌తో కరోలిన్ డారియన్ జీవితం పూర్తిగా మారిపోయింది.

ఆ ఫోన్ చేసింది తన తల్లి జీసెల్ పెలికో.

‘‘డొమినిక్ (మా నాన్న) 10 ఏళ్లుగా ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఇతరులతో అత్యాచారం చేయిస్తున్నట్లు తెలిసిందని మా అమ్మ నాతో చెప్పారు’’ అని బీబీసీ రేడియో 4 టుడే ప్రోగ్రామ్ ఎమ్మా బార్నెట్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో డారియన్ గుర్తు చేసుకున్నారు.

”ఆ క్షణం, ఒక్కసారిగా నిశ్చేష్టురాలినయ్యా” అని డారియన్ చెప్పారు.

ఇప్పుడామెకు 46 ఏళ్లు.

”గట్టిగా అరిచా, ఏడ్చేశా, అతన్ని తిట్టాను కూడా” అని ఆమె చెప్పారు.

”అదొక భూకంపం, సునామీ లాంటిది” అని అన్నారు.

తన తండ్రి ‘జైల్లోనే చచ్చిపోవాలి’ అని డారియన్ అంటున్నారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్

అపస్మారక స్థితిలో ఉన్న తన భార్య జీసెల్ పెలికోపై అత్యాచారం చేసేందుకు డొమినిక్ ఆన్‌లైన్‌ ద్వారా ఆహ్వానించిన 50 మంది పురుషులకు కూడా జైలు శిక్ష పడింది.

ఒక సూపర్ మార్కెట్‌లో మహిళల స్కర్టు లోపలి భాగాలను చిత్రీకరిస్తూ డొమినిక్ పెలికో పోలీసులకు చిక్కారు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపడంతో ఈ దారుణం బయటపడింది. ఈ వృద్ధుడి ల్యాప్‌టాప్‌, ఫోన్‌లలో తన భార్య జీసెల్ పెలికో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తులతో అత్యాచారం చేయించిన వేలాది వీడియోలు, ఫోటోలను పోలీసులు గుర్తించారు.

అత్యాచారం, లైంగిక హింస కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ, విచారణ సందర్భంగా మత్తుమందులు ఇవ్వడం, డ్రగ్స్ తీసుకుని లైంగిక దాడికి పాల్పడడం వంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

కరోలిన్ డారియన్ మత్తుమందులపై పోరాటమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. ఎందుకంటే, చాలా మంది బాధితులకు తమపై జరిగిన దాడుల గురించి తెలియడం లేదు. తాము డ్రగ్స్ బారినపడినట్లు కూడా గ్రహించలేకపోతున్నారు.

పెలికో కేసు, ఫ్రాన్స్, డొమినిక్ పెలికో, జీసెల్ పెలికో, కరోలిన్ డారియన్

బాధిత మహిళల గొంతుక వినిపించాలని అనుకుంటున్న డారియన్

జీసెల్ పెలికో ఫోన్ కాల్ వచ్చిన తర్వాత డారియన్ సహా ఆమె సోదరులు ఫ్లోరియన్, డేవిడ్ తమ తల్లిదండ్రులు ఉంటున్న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఊరికి వచ్చారు. ”గత 20, 30 ఏళ్లలో అత్యంత దారుణమైన లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తి తన భర్త” అని తెలుసుకున్న తల్లికి అండగా నిలిచేందుకు వారంతా బయలుదేరి వచ్చారు.

ఆ తర్వాత పోలీసులు డారియన్‌ను పిలిపించారు, అప్పుడు మరోసారి ఆమె జీవితం తల్లకిందులైంది.

ఆమె తండ్రి ల్యాప్‌‌టాప్‌లో లభించిన రెండు ఫోటోలను పోలీసులు డారియన్‌కు చూపించారు. అందులో ఒంటిపై కేవలం టీషర్ట్, కట్‌డ్రాయర్‌తో అపస్మారక స్థితిలో ఓ మహిళ మంచంపై ఉన్నారు.

ఆ ఫోటోల్లో ఉన్నది తానేనని ఆమె ముందు ఊహించలేకపోయారు. ”ఒక్కసారిగా ఏమీ అర్థంకాలేదు, మొదట నన్ను నేను గుర్తించలేకపోయా” అని ఆమె చెప్పారు.

”అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ‘చూడండి.. మీ చెంపపై బ్రౌన్ కలర మచ్చ ఉంది, అది మీరే’ అన్నారు, ఆ తర్వాత ఆ రెండు ఫోటోలను అటూ, ఇటూ తిప్పి చూశా. మా అమ్మలాగే నేను కూడా ఎడమవైపు తిరిగి పడుకుని ఉన్నా”

తన తండ్రి తనపై కూడా అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అప్పుడు అర్థమైందని డారియన్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని ఆయన ఖండించారు. ఆ ఫోటోల గురించి పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.

”లైంగికంగా వేధించడం కోసం ఆయన నాకు మత్తుమందు ఇచ్చారని తెలుసు. కానీ, దానికి సంబంధించి నా దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవు” అని డారియన్ చెప్పారు.

ఆమె తల్లి కేసు తరహాలో, డొమినిక్ తన కూతురు డారియన్‌పై ఎలాంటి వేధింపులకు పాల్పడ్డారనే దానికి సంబంధించి ఏ విధమైన ఆధారాలూ లేవు.

జీసెల్ పెలికో

ఫొటో సోర్స్, Reuters

”ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారు ఎంతమంది? ఆధారాలు లేవు కాబట్టి వాళ్లని నమ్మరు. వాళ్లనెవరూ పట్టించుకోరు. అండగా నిలవరు” అని డారియన్ అన్నారు.

తన తండ్రి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత డారియన్ ఒక పుస్తకం రాశారు.

‘ఐ విల్ నెవెర్ కాల్ హిమ్ డాడ్ ఎగైన్’ తన కుటుంబంలో జరిగిన దారుణాన్ని వివరిస్తుంది.

మత్తుమందులు ఇవ్వడం గురించి కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అందుకోసం ఉపయోగించే మందులు కూడా ”ఇంట్లో సాధారణంగా వాడే మందులలోనే ఉంటాయి.”

”పెయిన్ కిల్లర్స్, సెడేటవ్స్(మత్తుమందులు), అవే సరిపోతాయి” అని డారియన్ అన్నారు. ఇలా మత్తుమందుల కారణంగా బాధితులుగా మారిన మహిళల్లో, దాదాపు సగం మందికి తమపై వేధింపులకు పాల్పడింది ఎవరో వాళ్లకి తెలుసు. ”దాదాపుగా దగ్గరి వాళ్లే అయి ఉంటారు” అని ఆమె చెప్పారు.

వేర్వేరు వ్యక్తులు, 200 కంటే ఎక్కువ సార్లు తనపై అత్యాచారం చేశారనే విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన అదే సమయంలో, కూతురిపై కూడా తన భర్త అలాంటి దాడికి పాల్పడి ఉంటాడనే విషయం తెలిసి తట్టుకోవడం చాలా కష్టమని ఆమె చెప్పారు.

”ఒక తల్లికి వాటన్నింటినీ తట్టుకోవడం చాలా కష్టం” అని డారియన్ అన్నారు.

తన భర్తతో పాటు డజన్ల కొద్దీ మగవాళ్లు తనను ఏం చేశారో ఈ ప్రపంచానికి, మీడియాకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చారు తల్లీకూతుళ్లు. విచారణ, తమ వివరాలు బహిర్గతం చేసేందుకు కూడా వెనకాడలేదు. ”నాకు తెలుసు.. మేం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని. కానీ, మేం దానిని ధైర్యంగా, గౌరవంగా ఎదుర్కోవాలనుకున్నాం”

డొమినిక్ పెలికో

ఫొటో సోర్స్, Reuters

ఇద్దరికీ.. అంటే హింసకు పాల్పడిన వ్యక్తికి, బాధితురాలికి కూతురిననే విషయాన్ని జీర్ణించుకుని ఎలా బతకాలనేదే డారియన్ ముందున్న పెద్ద సవాల్. దానిని ”పెనుభారం”గా ఆమె అభివర్ణించారు.

ఆమె డొమినిక్ అని పిలుస్తున్న ఆ వ్యక్తితో తన బాల్యాన్ని గుర్తు చేసుకోలేకపోతోంది. అప్పుడప్పుడూ పొరబాటుగా మాత్రమే ఆమె ఆయన్ను తండ్రి అని సంబోధిస్తోంది.

”గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నా, నేను అతన్ని తండ్రిగా భావించలేను. ఒక నేరస్తుడిగా, లైంగిక నేరస్తుడిగానే చూస్తాను” అని ఆమె చెప్పారు.

”కానీ, ఆయన డీఎన్ఏ నాలో ఉంది. నేను బయటికి చెప్పుకోలేని బాధితుల కోసం పనిచేయాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం కూడా ఆ వ్యక్తితో నిజంగా ఎప్పటికీ దూరంగా ఉండడానికి ఎంచుకున్న ఒక మార్గం” అని ఎమ్మా బార్నెట్‌తో కరోలిన్ డారియన్ చెప్పారు. ”నేను డొమినిక్‌కి పూర్తిగా విరుద్ధంగా ఉన్నా.”

అందరూ అంటున్నట్లుగా తన తండ్రి రాక్షసుడో, కాదో తనకు తెలియదని డారియన్ అన్నారు. ”ఆయనేం చేశారో ఆయనకు బాగా తెలుసు. ఆయనకేమీ అనారోగ్యం లేదు, పూర్తి స్పృహతోనే చేశారు” అని ఆమె చెప్పారు.

”ఆయనో ప్రమాదకరమైన వ్యక్తి. తప్పించుకోలేరు, ఆయనకెలాంటి దారీ లేదు.”

పెరోల్‌కి అర్హత పొందేందుకు 72 ఏళ్ల డొమినిక్ పెలికోకి ఇంకా చాలా ఏళ్లు పడుతుంది, అందువల్ల ఆయన తన కుటుంబాన్ని ఎప్పటికీ చూడలేకపోవచ్చు.

ఆ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే వారు కోలుకుంటున్నారు. తన తల్లి జీసెల్ విచారణతో అలసిపోయారని, దాని నుంచి కోలుకుంటున్నారని, ఇప్పుడు బానే ఉన్నారని డారియన్ చెప్పారు.

కరోలిన్ డారియన్, ఫ్రాన్స్, పెలికో కేసు

ఇక డారియన్ విషయానికొస్తే, ఆమె దృష్టంతా ప్రధానంగా మత్తుమందుల బారినపడడం, లైంగిక వేధింపులపై పిల్లల్లో అవగాహన పెంచడంపైనే ఉంది.

తన భర్త, సోదరులు, తన పదేళ్ల కొడుకు వల్ల తాను ధైర్యంగా నిలబడ్డానని ఆమె చిరునవ్వుతో, భావోద్వేగం నిండిన స్వరంతో చెప్పారు.

నవంబర్‌‌లో, ఆ రోజు తెలిసిన విషయాలే తనను ఈ రోజు ఇలా మార్చాయని డారియన్ చెప్పారు.

నవంబర్‌లో ఆ రోజు రాత్రి వచ్చిన సునామీతో జీవితం నాశనమైపోయిన ఈ మహిళ ఇప్పుడు జీవితంలో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)