SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
‘లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఏడు నెలలకే రెండు లక్షలిస్తా..’ ‘కోటి పెడితే ఏడాదిలో రెండు కోట్లు ఇస్తా..’
‘యానిమేషన్ రంగంలో పెట్టుబడి పెడితే వెంటనే రెండు రెట్లు డబ్బులొస్తాయి’
ఇలా ఆశపెట్టి విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ పలువురిని మోసం చేసి, కోట్లాది రూపాయలు కాజేశారని సత్యనారాయణపురం పోలీసులు బీబీసీకి చెప్పారు.
వెంకట సత్య లక్ష్మి కిరణ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి ఫోన్లు పనిచేయడం లేదు.
‘‘కిరణ్, ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు’’ అని పోలీసులు చెప్పారు.
ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఫొటో సోర్స్, SatyanarayanapuramPS
చాలామంది నుంచి వందల కోట్లరూపాయలు వసూలు చేసి కిరణ్ అర్ధంతరంగా పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు.
కిరణ్‌కు డబ్బులు ఇచ్చిన గుంటూరుకు చెందిన ఒక వ్యాపారి బీబీసీతో మాట్లాడారు. తన పేరు బయటపెట్టొద్దని ఆయన కోరారు.
”చిన్నప్పటి నుంచి తెలిసిన కుర్రాడే కదా అని పది లక్షలు పెట్టుబడి పెట్టాను. అన్నట్టుగానే కిరణ్ ఏడు నెలలకే 20 లక్షలు నగదు టేబుల్‌పై పెట్టి చూపించాడు. కానీ చేతికి ఇవ్వలేదు. ఈ 20 లక్షలు నా వద్దనే ఉంచండి.. ఈసారి ఏడాదికి రూ.40 లక్షలిస్తానని చెప్పాడు. సరే అన్నాను. ఏడాది తిరిగేలోపే రెట్టింపు డబ్బులొస్తున్నాయని ఆశపడి… బంగారం కుదువపెట్టి, ఆస్తులు తాకట్టుపెట్టి సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చాను” అని ఆ వ్యాపారి చెప్పారు.
తాజాగా కిరణ్ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్(ఐపీ) దాఖలు చేయడంతో తమ డబ్బు సంగతి ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, SatyanarayanapuramPS
అసలు ఏం జరిగిందంటే..
సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ సీఐ ఎస్‌వివి లక్ష్మీనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘విజయవాడకు చెందిన నిడుమోలు వెంకట సత్య లక్ష్మికిరణ్ అనే వ్యక్తి సత్యనారాయణపురంలో ఏడేళ్ల కిందట యు పిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ పేరిట ఓ ఆఫీసును తెరిచారు.
తాను సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్వేర్ అందిస్తుంటానని, ఆ రంగంలో పెట్టుబడులు పెడితే వేగంగా లాభాలు వస్తాయని, లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఏడు నెలల్లోనే మరో లక్షరూపాయల లాభం వస్తుందంటూ తనకు తెలిసిన వ్యాపారులకు చెప్పుకొచ్చారు.
గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ముందుగా పెట్టుబడి పెట్టారు. మొదట లక్షకు ఏడునెలల్లో రెండు లక్షలు, రూ.కోటి పెట్టుబడి పెడితే 13 నెలల తర్వాత రూ.1.75 కోట్లు కిరణ్ ఇచ్చారు’’ అని లక్ష్మీనారాయణ వివరించారు.
”దీంతో నమ్మకం కలిగి గుంటూరుతో పాటు విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తున్నందున పత్రాలు పక్కాగా ఉండవనీ, ఆదాయపన్ను సమస్యలొస్తాయని చెప్పి గ్యారంటీ పత్రాలు లేకుండా నోటి మాటతోనో, లేదంటే తెల్లకాగితంపై అమౌంట్ రాసి సంతకం పెట్టడం వంటి పద్ధతులనే అనుసరించారు” అని పోలీసులు చెప్పారు.
ఈ వ్యవహారంలో మొత్తంగా వంద మందికిపైగా దాదాపు 400 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook
‘నెల కిందట పరారీ’
మొదట్లో తక్కువ మంది వద్దనే డబ్బులు వసూలు చేసి వడ్డీలు సక్రమంగా చెల్లించిన కిరణ్, రెండేళ్లుగా డబ్బుల చెల్లింపులో జాప్యం చేస్తూ వచ్చారని, ఈ రెండేళ్ల వ్యవధిలో ఎక్కువమంది నుంచి పెద్దమొత్తంలో వసూలు చేశారని, వడ్డీల చెల్లింపులో కూడా జాప్యం చేస్తూ వచ్చారని నరసరావుపేటకి చెందిన ఓ బాధితుడు బీబీసీకి తెలిపారు.
”మేం అడుగుతుంటే ఈసారి కాస్త ఆలస్యమైంది. అందుకే ఇంకా ఎక్కువ వడ్డీ ఇస్తాను అని చెప్పేవాడు. సర్లే అనుకున్నాం. కానీ ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయాడు. ఆఫీసు ఎత్తేశాడు. ఫోన్లు పనిచేయడం లేదు. ఇంట్లో వాళ్లు కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం” అని నరసరావుపేటకి చెందిన బాధితుడు కె.దిలీప్‌కుమార్ బీబీసీకి తెలిపారు.
అదేవిధంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన నరసరావుపేటకు చెందిన టి. శ్రీనివాసరావు కూడా కిరణ్‌పై విజయవాడ సత్యనారాయణపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
”నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి రూ.15 కోట్లు, ఓ వ్యాపారి రూ.15.50 కోట్లు, ఇంకో వ్యక్తి రూ.5 కోట్లు, మరొకరు రూ.18 కోట్లు, ఇంకొకరు రూ.12 కోట్లు, మరికొందరు కోటి నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినప్పటికీ సరైన పత్రాలు లేకపోవడంతో పాటు పెట్టుబడి పెట్టిన సొమ్ము లెక్కల్లో చూపనిది (బ్లాక్‌మనీ) కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు” అని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని బాధితులు బీబీసీకి చెప్పారు.
ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, screengrab
నష్టపోయానంటూ దివాలా పిటిషన్
రంగారెడ్డి జిల్లా కోర్టులో దివాలా పిటిషన్ వేసి, గత నెల నుంచి పరారీలో ఉన్న నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ ఇటీవల సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశారు. తాను నష్టపోయానని, అయితే డబ్బు ఇచ్చినవారికి న్యాయం చేస్తానని అందులో చెప్పుకొచ్చారు.
తాజాగా వారం కిందట రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కోర్టులో దివాలా పిటిషన్(ఐపీ) దాఖలు చేశారు.
2014లో యు పిక్స్ క్రియేషన్స్‌ను ఏర్పాటు చేసి రూ.155.95 కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు ఐపీలో పేర్కొన్నారు. 102 మంది బాధితుల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు. రూ.2.72 కోట్లు మాత్రమే ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
రూ.400 కోట్లకుపైగా వసూలు చేసి, ఐపీలో రూ.155.95 కోట్లు మాత్రమే చూపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
”సెల్ఫీ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే.. కొంతైనా సొమ్ము తిరిగి వస్తుందని ఆశించాం. ఇప్పుడు ఐపీ వేయడంతో ఆ ఆశ కూడా పోయింది” అని గుంటూరుకి చెందిన ఓ బాధితుడు బీబీసీతో అన్నారు.
కిరణ్ న్యాయవాది ఏం చెబుతున్నారు?
కిరణ్‌తో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఐపీ దాఖలు చేయించిన హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది మల్లారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
”తాను నష్టపోయానని క్లయింట్ చెబుతున్నారు. కానీ అతన్ని నమ్మి డబ్బులిచ్చిన వాళ్లు ఇంకా బాగా నష్టపోయి ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతను న్యాయం కోసం నా వద్దకు వచ్చినప్పుడు నేను వాదించాలి కదా. నిజంగా అతని వద్ద ఎంత మొత్తం డబ్బు ఉందో అంతా ఇప్పించడానికే నేను యత్నిస్తాను” అని చెప్పారు.
ఐపీ పెట్టినా కేసు కొనసాగుతుంది: పోలీసులు
ఐపీ పెట్టినా మేం పెట్టిన చీటింగ్ కేసు కొనసాగుతుందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణ బీబీసీకి తెలిపారు.
నిందితుడి అరెస్టు జాప్యంపై ఫిర్యాదుదారుల ఆవేదనను ఆయన దృష్టికి తీసుకురాగా,
”ఇది ఎంతోమందిని, ఎన్నో కుటుంబాలను ఆర్ధికంగా నాశనం చేసిన కేసు. జాగ్రత్తగా కేసు కట్టాలి. నిందితుడు సులువుగా తప్పించుకునే వీలు లేకుండా పకడ్బందీగా కేసు నమోదు చేయాలి. అందుకు సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రస్తుతం ఇద్దరు బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేస్తున్నాం. మరింతమంది బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయచ్చు. త్వరలోనే కిరణ్‌తో పాటు అతనికి సహకరించిన నిందితులను కచ్చితంగా అరెస్టు చేస్తాం” అని సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ బీబీసీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS