SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
1945 తర్వాత యూరప్‌లో మొదలైన అత్యంత ఘోరమైన యుద్ధం మూడేళ్లకు పైగా సాగుతున్న నేపథ్యంలో, ఈ శుక్రవారం దౌత్యపరంగా ఒక చిన్న ముందడుగుపడింది.
రష్యా తన పొరుగుదేశంపై పూర్తి స్థాయి దాడి ప్రారంభించిన నెల రోజుల తర్వాత, అంటే మార్చి 2022 తర్వాత.. యుక్రెయిన్, రష్యా ప్రతినిధులు మొదటిసారి ముఖాముఖి చర్చలు జరిపారు.
ఇస్తాంబుల్‌లోని బోస్ఫరస్ తీరంలో ఓటొమన్ కాలం నాటి రాజభవనంలో ఈ చర్చలు జరిగాయి.
ఇరుదేశాల ప్రతినిధులు చర్చలకు వచ్చేందుకు తుర్కియే, అమెరికాల ఒత్తిడి, ప్రోత్సాహం పనిచేశాయి.
అయితే, చర్చలకు హాజరైన ప్రతినిధుల మధ్య కరచాలనాలు జరగలేదు. తమ దేశంపై దాడులు జరుగుతున్నాయనే విషయం ప్రతిబింబించేలా యుక్రెయిన్ ప్రతినిధుల్లో సగం మంది సైనిక దుస్తుల్లో కనిపించారు.
ప్రతినిధులు కూర్చున్న గదిలో యుక్రెయిన్, తుర్కియే, రష్యా జాతీయ జెండాలను రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. భారీగా పూలతో అలంకరించారు.


ఫొటో సోర్స్, TURKISH FOREIGN MINISTER OFFICE HANDOUT/EPA-EFE
తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ చర్చలకు హాజరైన ప్రతినిధులతో మాట్లాడుతూ, ”మన ముందు రెండు మార్గాలున్నాయి, మొదటిది శాంతి మార్గం. రెండోది మరిన్ని మరణాలు, మరింత విధ్వంసానికి దారితీసేది” అన్నారు.
చర్చలు రెండుగంటల్లోపే ముగిశాయి. కొద్దిసేపటికే, ఇరువర్గాల మధ్య స్పష్టమైన విభేదాలు వ్యక్తమయ్యాయి. యుక్రేనియన్ అధికారి ఒకరు తెలిపిన దాని ప్రకారం, క్లెమ్లిన్ ”నూతన, ఆమోదయోగ్యం కాని డిమాండ్లు” పెట్టింది. కాల్పుల విరమణకు బదులుగా, యుక్రెయిన్ తమ సొంత భూభాగాల నుంచి భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టడం కూడా అందులో ఒకటని ఆయన చెప్పారు.
సంధికి సంబంధించి ఎలాంటి పురోగతీ లేకపోయినప్పటికీ, ఊహించినట్లుగానే ఒక విషయంలో మాత్రం స్పష్టమైన ఫలితం వచ్చింది.
ఇరువైపుల నుంచి, వెయ్యి మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది.
”అత్యంత క్లిష్టంగా గడిచిన రోజుకి, ఇదొక మంచి ముగింపు” అని యుక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ సెర్హి కిస్లిత్స్యా అన్నారు. ”వెయ్యి యుక్రెయిన్ కుటుంబాలకు ఇది శుభవార్త”గా చెప్పారు.
త్వరలోనే యుద్ధ ఖైదీల మార్పిడి జరుగుతుందని ఈ చర్చల్లో యుక్రెయిన్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఆ దేశ రక్షణ మంత్రి రుస్తెమ్ ఉమెరోవ్ అన్నారు. ”అది ఎప్పుడనే తేదీ మాకు తెలుసు. కానీ, దానిని ఇప్పుడు ప్రకటించడం లేదు” అని చెప్పారు.
‘తదుపరి దశ’లో జెలియెన్ స్కీ, పుతిన్‌ల మధ్య సమావేశం జరగాలని ఆయన కోరారు.
ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రతినిధి, ఆ దేశ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ తెలిపారు.
చర్చలపై రష్యన్ ప్రతినిధుల బృందం సంతృప్తికరంగా ఉందని, చర్చలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఒక ”క్లోన్, లూజర్” (హాస్యాస్పద వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి) అంటూ గురువారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యల అనంతరం, ఇదొక గమనించదగ్గ మార్పు.

ఫొటో సోర్స్, Reuters
అయితే, కేవలం కాలం వెళ్లదీసేందుకు, కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నుంచి దృష్టి మరల్చేందుకు, 18వ విడత యూరోపియన్ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే రష్యా దౌత్యపరమైన చర్చల్లో పాల్గొంటుందనే భయాలు యుక్రెయిన్ సహా దాని కొన్ని మిత్రదేశాల్లో ఉన్నాయి.
చర్చల కోసం ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమైనప్పటికీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, తనకు మధ్య జరిగే చర్చలే కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
” నేను, పుతిన్ కూర్చుంటే తప్ప ఏదీ తేలదు” అని ఎయిర్‌ఫోర్స్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, గురువారం ఆయన ఈ ప్రకటన చేశారు.
అయితే, ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే స్పష్టత లేదు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, ఉన్నత స్థాయి చర్చలు ”కచ్చితంగా అవసరం”, కాకపోతే సమావేశానికి సన్నద్ధమయ్యేందుకు సమయం పడుతుందన్నారు.
ఈ చర్చలకు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని ఆహ్వానించకపోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)