SOURCE :- BBC NEWS

అర్సా కంపెనీ, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఫొటో సోర్స్, I &PR AP

అర్సా క్లస్టర్(URSA CLUSTERS) అనే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించడం వివాదంగా మారింది.

ఆ కంపెనీకి అర్హత లేకున్నా భూమి ఉచితంగా ఇచ్చారన్న వాదనలు ఒకవైపు.. తమ కంపెనీ ఉచితంగా భూమి అడగలేదన్న సంస్థ వాదన మరోవైపు.

ఇంతకీ ఏం జరిగింది?

ఈ అర్సా క్లస్టర్ కంపెనీ ఎవరిది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అర్సా  క్లస్టర్స్, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఫొటో సోర్స్, URSA CLUSTERS

‘ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకు కేటాయింపులు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే ఐటీ సంస్థలకు తక్కువ ధరకే భూమి కేటాయించాలంటూ ఏప్రిల్ 10న ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి నారా లోకేశ్ ఈ ప్రతిపాదన తెచ్చారు.

”ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూకేటాయింపులు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు మంత్రి లోకేశ్. భూములు తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా మరిన్ని ఐటీ కంపెనీలను ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. అందుకు తగ్గట్టు ఐటీ పాలసీని సవరించి తీసుకురావాల్సిందిగా సూచించారు” అంటూ దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

ఆ సమావేశంలో టాటా సహా మొత్తం 16 కంపెనీల గురించి చర్చ జరగ్గా అందులో అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఉంది.

ఆ కంపెనీ విశాఖలో రూ. 5,278 కోట్ల పెట్టుబడులు పెట్టి, 2,500 ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తరువాత ఏప్రిల్ 15న ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో భూ కేటాయింపుపై చర్చ జరిగింది.

”వివిధ పరిశ్రమలు, ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా 10.04.2025న జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం కోసం ప్రతిపాదన, వాటికి అవసరమైన భూముల కేటాయింపు, సక్రమంగా ఆమోదించడం, మౌలిక వసతులను కల్పించడం, సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది” అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

అర్సా కంపెనీ, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఎకరా 99 పైసలకే అన్న ప్రచారంలో నిజమెంత?

”విశాఖపట్నంలో అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డేటా సెంటర్, ఐటీ కార్యాలయ స్థలం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా కొత్త ఐటీ క్యాంపస్ కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం లభించింది. విశాఖపట్నంలోని హిల్ నం.3 (సెజ్)లోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని, ఐపీ కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ప్రస్తుతం అమలులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది” అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసుకు ఎకరా కేవలం 99 పైసలకే భూమి కేటాయిస్తున్నారని తెలియడంతో ఈ అర్సా కంపెనీకి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున ఇస్తున్నట్టుగా సోషల్ మీడియాలో హోరెత్తింది.

ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పెద్ద చర్చే నడిచింది. ఏప్రిల్ 21న టీసీఎస్‌కు భూమి కేటాయింపు వివరాలతో జీవో వచ్చింది.

అయితే ఇప్పటివరకు అర్సా క్లస్టర్‌కు భూమి కేటాయింపు వివరాలతో ఉత్తర్వులు రాలేదు.

కేబినెట్ నిర్ణయం ప్రకటన తప్ప, ఇతర వివరాలు వెల్లడించలేదు.

ఎంతధరకు కేటాయించారనే వివరాలు ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

అర్సా కంపెనీ, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఫొటో సోర్స్, ELYSIUM ANALYTICS

ఇంతకీ ఏంటీ అర్సా క్లస్టర్?

హైదరాబాద్ కేంద్రంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైంది అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.

ఈ సంస్థలో పెందుర్తి విజయ కుమార్, అబ్బూరి సతీశ్ అనే ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు.

హైదరాబాద్ కొత్తగూడలోని ఒక సాధారణ రెసిడెన్షియల్ అపార్టుమెంటులోని ఫ్లాట్ అడ్రస్సే ఈ కంపెనీ చిరునామాగా ఉంది.

అలాంటి సంస్థకు కారుచవకగా భూములు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

ఇందులో డైరెక్టర్‌గా ఉన్న పెందుర్తి విజయ కుమార్ గురించి పెద్దగా వివరాలు దొరకలేదు కానీ, సతీశ్ అబ్బూరి మాత్రం ప్రస్తుతం అమెరికా కేంద్రంగా అలీజియం అనలిటిక్స్ అనే సంస్థను స్థాపించి అందులో సీటీవోగా ఉన్నారు.

దాంతో పాటు, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా కేంద్రంగా పనిచేస్తున్న అర్సా క్లౌడ్ సంస్థ తనదేనని ఆయన ప్రకటించుకున్నారు.

ఈ వివాదంపై అర్సా కంపెనీ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారత్, ఆంధ్రప్రదేశ్‌లలో అంతర్జాతీయ స్థాయి ఏఐ ఇన్‌ఫ్రా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

సతీశ్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తి తమ టీమ్ సభ్యులని ప్రకటించింది.

2026 నాటికి పది మెగా వాట్ల సామర్థ్యం నుంచి 2032 నాటికి 300 మెగా వాట్ల ఏఐ డాటా సెంటర్‌ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.

తమకు ఆర్థికంగా లోటు లేదని, ఫౌండర్ ఇన్వెస్ట్‌మెంట్లు, స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్పులు, ప్రైవేట్ పెట్టుబడులు, నియమిత లక్ష్యాల ఆధారంగా వచ్చే పెట్టుబడులు… అన్నీ కలిపి రూ.5,728 కోట్ల విలువ ప్రాజెక్టు అని, టీమ్ నెట్‌వర్తే రూ.4,063 కోట్లు ఉందని తెలిపింది.

అర్సా కంపెనీ, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఫొటో సోర్స్, EDB, GoAP

సంస్థపై ఆరోపణలకు కారణాలు

వేల కోట్లు పెట్టుబడి పెడతామనే సంస్థ హైదరాబాద్‌లో నివాస సముదాయంలో రిజిస్టర్ అవడం, భారీ కార్పొరేట్ సెటప్ లేకపోవడం.. సంస్థ పెయిడప్ కేపిటల్ లక్ష రూపాయలు, ఆథరైజ్డ్ కేపిటల్ రూ.పది లక్షలే ఉండడం.. ఆ సంస్థ గతంలో ఇంత భారీ ప్రాజెక్టులు చేపట్టిన అనుభవం లేకపోవడం.. సంస్థ రెండు నెలల క్రితం (12 ఫిబ్రవరి 2025) రిజిస్టర్ కావడం వంటివి ఆరోపణలకు ప్రధాన కారణాలయ్యాయి.

ఈ ఆరోపణలపై సంస్థ డైరెక్టర్ సతీశ్ అబ్బూరి బీబీసీతో మాట్లాడారు.

సంస్థపై వస్తున్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. అసలు తాము భూమి ఉచితంగా అడగలేదని ఆయన వివరించారు.

”మేం డాటా సెంటర్ పెట్టాలనుకున్న భూమిని ఎకరం రూ.50 లక్షలకు, కార్యాలయాలు పెట్టాలనుకున్న భూమిని ఎకరం రూ.కోటికి తీసుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అసలు మేం 99 పైసలకు అడగలేదు” అని బీబీసీతో అన్నారు సతీశ్ అబ్బూరి.

”ఈడీబీ (ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు) ద్వారా మా ప్రతిపాదనలు పంపించాం. ఈ కంపెనీ కొత్తది కావచ్చు కానీ దాన్ని నడిపించే మేం ఈ రంగానికి కొత్త కాదు. 90ల నుంచే ఈ టెక్ వ్యాపారంలో ఉన్నాం. కొన్ని కంపెనీలు పెట్టాం, నిర్వహించాం, తరువాత వేరే వారికి అమ్మాం.

ఎంతో నైపుణ్యం ఉన్న బృందంగా కొందరం ఏర్పడి అర్సా క్లస్టర్స్ కంపెనీ పెట్టాం. మాకు ఆర్థిక వనరులు ఉన్నాయి. వేల కోట్ల పెట్టుబడి మేం ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా పెట్టుబడి పెడతాం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు అన్ని ఆధారాలతో ఇచ్చాక, మా అనుభవాన్ని వారు పరిగణనలోకి తీసుకుని, మా డీపీఆర్ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే అనుమతి ఇచ్చారు” అని బీబీసీతో అన్నారు సతీశ్ అబ్బూరి.

సంస్థ కార్యాలయాలు చిన్న ప్రదేశాల్లో ఉండడంపై బీబీసీ వారిని ప్రశ్నించింది.

”మాకు ఇప్పుడే భారీ కార్యాలయాలు అవసరం లేదు. ఒకసారి భూమి కేటాయింపు జరిగిన తరువాత, ఇతర పనులు మొదలు పెట్టే క్రమంలో అప్పుడు పెద్ద ఆఫీసు అవసరం ఉంటుంది. అప్పటి వరకూ కేవలం రిజిస్టర్డ్ ఆఫీసు నిమిత్తం మాకు భారీ స్పేస్ అవసరం లేదు కాబట్టే ఆ అడ్రస్సులో కార్యాలయం పెట్టాం. ఒకసారి మా పని ప్రారంభమైన తరువాత, పెద్ద ఎత్తున ప్రారంభించి, బహిరంగంగా ప్రకటిద్దాం అనుకున్నాం. ఈలోపే ఇలా జరిగింది.

మేమే కాదు.. బే ఏరియాలో (అమెరికాలో) అన్ని సంస్థలూ ఇలా ముందుగా చిన్నగానే ప్రారంభిస్తారు. ఆపరేషనల్ ఏరియాల్లో ఎవరూ పెట్టరు. అంతెందుకు, భారత్‌లో ఎన్నో వేల కోట్ల కంపెనీల రిజిస్టర్డ్ అడ్రస్‌లు, ప్రారంభ సమయంలో అడ్రస్‌లు ఇలా చిన్న ప్రదేశాల్లోనే ఉంటాయి.

అలాగే ఏ కంపెనీ అయినా ఫార్మాలిటీగా పెయిడప్ కేపిటల్ లక్ష, పది లక్షలు అలానే చూపిస్తారు. రిజిస్టర్డ్ అడ్రస్, పెయిడప్ కేపిటల్ వంటి సాంకేతిక అంశాలు మాత్రం చూపించి, మాకు సామర్థ్యం లేదనడం సరికాదు. అలా కార్యాలయం వద్దనుకోవడం మా ఫైనాన్షియల్ డిసిప్లీన్” అని బీబీసీతో అన్నారు అబ్బూరి సతీశ్.

అర్సా కంపెనీ, అబ్బూరి సతీశ్, ఈడీబీ

ఫొటో సోర్స్, I&PR AP

రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?

అర్సాకు భూ కేటాయింపులపై మాజీ ఎంపీ కేశినాని నాని కొన్ని ఆరోపణలు చేశారు.

సతీశ్ అబ్బూరి, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) క్లాస్ మేట్ అని, ఈ కంపెనీకి భూ కేటాయింపుల వెనుక శివనాథ్ ప్రమేయం ఉందని ఆరోపించారు నాని.

ఎంపీ తమ వెనుకున్నారన్న ఆరోపణలను సతీశ్ తిరస్కరించారు. దీనిపై ఎంపీ శివనాథ్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించింది.

”వారు ప్రతిపాదనలు ఇచ్చిన తరువాత ఉన్నతాధికారులు దాదాపు 4 నెలల పాటు అన్నీ పరిశీలించాకే అంగీకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ, ఈడీబీ వీరంతా ఆమోదించిన తరువాత, కేబినెట్ కూడా ఆమోదించింది. కంపెనీ ప్రొఫైల్, డీపీఆర్ లేకుండా ఖరీదైన భూములు ఉదారంగా ఇచ్చేయరు.

సాధారణంగా కొత్త కంపెనీలు, స్టార్టప్ లు చిన్నగా మొదలై పెద్దగా ఎదుగుతాయి. వారికి ఇక్కడ అవకాశం కనిపించి వచ్చారు. ఒకవేళ వారు చెప్పినట్టుగా పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో మాట నిలబెట్టుకోకపోతే, వారిని బాధ్యులను చేస్తుంది ప్రభుత్వం. భూమి ఇచ్చే ధర ఎంతనేది త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అందరూ చెబుతున్నట్టు 99 పైసలు అయితే కాదు” అని బీబీసీకి చెప్పారు పరిశ్రమల శాఖకు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)