SOURCE :- BBC NEWS

లాస్ ఏంజలెస్

లాస్‌ ఏంజలెస్ నిప్పుల కొలిమిలా మారి నాలుగు రోజులైంది. మా ఇల్లు కాలి బూడిదైంది.

ఇప్పుడు నేను లా క్రెసెంటాలోని నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. మంగళవారం ఉదయం కార్చిచ్చు మొదలైన ప్రాంతానికి 30 మైళ్ల దూరంలోని పాలిసేడ్స్‌లో మా ఇల్లు ఉంటుంది. కార్చిచ్చు వల్ల భయంతో అక్కడి నుంచి నేను వచ్చేశాను.

ఇక్కడ మేం సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ, ఈ నగరానికి చుట్టుపక్కల ఆరు చోట్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎక్కడా భద్రంగా అనిపించడం లేదు.

లాస్‌ ఏంజలెస్ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు నాతో సహా 1,79,000 మందికి పైగా ఇళ్లను వదిలేయాల్సి వచ్చింది.

నాతో పాటు చాలామంది పొరుగు ప్రాంతాలకు వెళ్లి, అక్కడ ఆశ్రయం దొరికిందని అనుకున్నాం. కానీ, మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో మేం అక్కడి నుంచి కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు మేం ఉంటున్న ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశిస్తారని, ముందుగానే మా బ్యాగులు సర్దుకున్నాం.

గురువారం మధ్యాహ్నం మేం భయపడుతున్న క్షణం రానే వచ్చింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ మాకు అలర్ట్ అందింది.

చాలా భయపడ్డాం. వెంటనే కార్లలోకి మళ్లీ మా సామాను ఎక్కించాం. నా కారులో గ్యాస్ తక్కువ ఉంది. గ్యాస్ నింపించేందుకు నా పార్ట్‌నర్‌ను బయటకు పంపించాను. ఆయన నాలుగు స్టేషన్లు తిరిగిన తర్వాత ఆఖరికి గ్యాస్ దొరికింది.

అది తప్పుడు అలర్ట్ అని తేలింది. ఇప్పటికే ప్రమాదం అంచుల్లో ఉన్న లాస్ ఏంజలెస్‌ను ఈ పొరపాటు మరింత భయపెట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
లూసీ షెరిఫ్

ఫొటో సోర్స్, Lucy Sherriff / BBC

వాతావరణ వార్తల రిపోర్టర్‌గా నేను తీవ్రమైన వాతావరణ సంఘటనలను కవర్ చేసేదాన్ని. కొన్ని వారాల క్రితం మాలిబు దావాగ్ని నుంచి తప్పించుకొని పారిపోయిన నివాసితులను ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు నేను ఆ బాధితుల స్థానంలో ఉన్నాను.

పాలిసేడ్స్ కార్చిచ్చును చరిత్రలోనే అత్యంత భయంకరమైన దావాగ్నిగా పిలుస్తున్నారు. ఇది నాకెప్పుడూ గుర్తుండిపోతుంది. ఎందుకంటే, నా ఇంటిని, మా కమ్యూనిటీని బూడిదలా మార్చేసిన దావాగ్ని ఇది.

జనవరి 7న ఉదయం ఈ మంటలు మొదలయ్యాయి. సాంటా మోనికా పర్వతం వైపు చిన్నగా మొదలైన మంటల్ని పాలిసేడ్స్ నుంచి నేను చూడగలిగాను. అప్పుడు ఆకాశంలో పొగ వ్యాపించింది. స్థానికులు వాటి ఫోటోలు తీసుకున్నారు.

గంట తర్వాత, ఆ మంటలు మరింత వ్యాపించాయి. మంటలు ఇళ్లను చుట్టుముట్టడం, ఆకాశంలో పొగలు కమ్ముకోవడం నేను చూశాను.

దీనికి రెండు రోజుల క్రితమే, సాంటా ఆనాలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు నన్ను కలవరపరిచాయి. పైగా మంటల వ్యాప్తి మొదలైంది. వర్షాలు పడకపోవడం వల్ల అంతా పొడిగా ఉండటంతో మంటలు మరింత వేగంగా, తీవ్రంగా వ్యాపించాయి.

గాలి వేగంలో మార్పులతో నగరం ఎలా నిప్పుల కుంపటిలా మారిందో, పొగ ఎలా కమ్మేసిందో నేను చూశాను. అగ్ని జ్వాలలు విస్తరిస్తూ పాలిసేడ్స్‌ను ఎలా సమీపించాయో నేను గమనించాను.

లూసీ షెరిఫ్

ఫొటో సోర్స్, Lucy Sherriff / BBC

ఆ దృశ్యం నిజంగా ఊహాతీతమైనది. దావాగ్ని ఒక ఎర్రని సూర్యునిలా, చుట్టూ నారింజ రంగు వెలుగులతో బూడిద చిమ్ముతూ వ్యాపించింది.

నేను వెంటనే ఇంటికి పరిగెత్తి, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి కావాల్సివన్నీ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాను. పాస్‌పోర్ట్‌, జనన ధ్రువీకరణ పత్రాలు, ఇలా చాలా ముఖ్యమైనవన్నీ ముందుగా సర్దుకున్నాను. నాకు ఇంకా కాస్త సమయం ఉందని అర్థమయ్యాక, నా ఇంటి ముందు మొత్తం నీళ్లను వదిలేశాను. నీళ్ల వల్ల మంటలు చల్లారి నా ఇల్లు తగలబడకుండా ఉంటుందని భావించాను.

పాలిసేడ్స్ వాసులంతా తప్పనిసరిగా ఇళ్లను వదిలి వెళ్లాలనే ఆదేశాలు రావడంతో చివరగా నేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.

మా ఇంటి ముందున్న పర్వతాల వరకు మంటలు విస్తరించడంతో నాకు మరింత భయమేసింది. సాయంత్రం వరకు గాలులు మరింత తీవ్రమవుతాయని తెలియడంతో చాలా ఆందోళనపడ్డాను.

పాలిసేడ్స్

ఫొటో సోర్స్, Lucy Sherriff / BBC

కార్చిచ్చు మొదలైన తొలిరోజు ప్రజల తరలింపు, మంటలకు సంబంధించిన హెచ్చరికలు, సందేశాలు నాకు గానీ, నా పార్ట్‌నర్‌కు గానీ రాలేదు. ఇరుగుపొరుగు వారు మాకు సమాచారం ఇచ్చారు.

నేను చాలా అదృష్టవంతురాలని. ఎందుకంటే నా దగ్గర ప్రెస్ పాస్ ఉంది. దాని ద్వారా నేను అత్యవసర సేవలు అందించే అధికారులను సంప్రదించగలిగాను. నాకు తెలిసిన వారందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకురాగలిగాను. మాలో చాలా మందికి సరైన సమాచారం, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మంటలు మా ఇళ్లకు ఎంత సమీపం వరకు వచ్చాయో తెలియలేదు.

అక్కడి నుంచి బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. వేలాది కార్లు బయలుదేరాయి. అందరూ ఆ మంటల నుంచి దూరంగా పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పర్వతాలకు అవతలివైపున ఉన్నందున మా ఇల్లు భద్రంగానే ఉంటుందని నేను అనుకున్నా. కానీ, దావాగ్ని రోడ్డును దాటి ఆవైపు వస్తుందని నేను అనుకోలేదు.

పాలిసేడ్స్ హైస్కూల్ మంటల్లో కాలిపోతోందని మా పొరుగువారి నుంచి సందేశం వచ్చింది. అది చూశాక, ఎవరూ ఊహించని రీతిలో అగ్ని జ్వాలలు వ్యాపిస్తున్నాయన్న సంగతి నాకు అర్థమైంది. స్కూల్‌తో పాటు కొన్ని సాంస్కృతిక ఆనవాళ్లు, స్థానిక థియేటర్ మంటల్లో కాలిపోతుండటాన్ని వార్తల్లో చూడటంతో గుండె పగిలిపోయింది.

పొద్దుపోయిన కొద్దీ గాలి వేగం పుంజుకుంటుందని, చీకట్లో మంటలు ఆర్పడం చాలా కష్టమని అర్థమయ్యాక మా ఇల్లు భద్రంగా ఉంటుందనే ఆశలు పోయాయి. ఇంటిని కోల్పోయిన ఆరు నెలల గర్భవతిగా నేను మిగిలిపోతాననుకున్నా.

మేం మంగళవారం సాయంత్రం లా క్రెసెంటాకు చేరుకున్నాం. రాత్రి మంటల నుంచి మా ఇల్లు బయటపడిందని ఉదయాన మా పొరుగువారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఎంతో ఉపశమనంగా అనిపించడంతో పాటు ఏడ్చేశాను.

పాలిసేడ్స్ లో ఇళ్ల లూటీలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత మా ఇంటికి వెళ్లి చెక్ చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే అక్కడ మా వస్తువులు, ఫోటోలు, పేపర్లు, నగలులాంటివి ఉన్నాయి. వాటిని తెచ్చుకోవచ్చని భావించాం

నేను మీడియా ప్రతినిధిని కాబట్టి వాటిని ఉపయోగించి బుధవారం మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్లడానికి అనుమతి సంపాదించాను. మేం సన్‌సెట్ బౌల్వార్డ్ వెళ్లే సరికి మా రోడ్డు దగ్గర పెద్ద పెద్ద మంటలు, బూడిద, ఫైరింజన్లు కనిపించాయి. మా గుండెలు పగిలిపోయాయి.

మేం కొంచెం ముందుకు వెళ్లాం. అక్కడ మా కమ్యూనిటీ మొత్తం నేలమట్టమై కనిపించింది.

పాలిసేడ్స్

ఫొటో సోర్స్, Lucy Sherriff / BBC

మేం మా కారును అక్కడే పార్క్ చేసి మా పెరడువైపు పరుగెత్తుకుంటూ వచ్చాం. కొంతదూరంలో కనిపించిన ద‌ృశ్యాన్ని చూశాక నాకు మతిపోయినట్లయింది. అక్కడున్న దాదాపు 20 ఇళ్లు కాలి కుప్పకూలిపోయి శిథిలాల గుట్టలాగా కనిపించాయి.అక్కడున్న ఫైర్ ఫైటర్లు ముఖమంతా దుమ్ముతో మిగిలిన ఇళ్లను కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘మీ ఇంటిని కాపాడలేకపోయాం’ అంటూ అగ్నిమాపక సిబ్బంది నాకు పదే పదే సారీ చెప్పారు. నేను ఏడుస్తూనే ఉన్నాను. వాళ్లు తాము చేయగలిగినంత చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పాను. నా పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి మీ ఇల్లు కూడా కాలిపోయిందని చెప్పాల్సి ఉంది. కానీ నాకు ఆ విషయం చెప్పడానికి నోరు పెగల్లేదు.

మా విలేజ్ దాదాపు 90 శాతం కాలిబూడిదైంది. సర్వనాశనమైంది. మా కాలనీకి జరిగిన నష్టం చూసి నేను నిజంగా షాక్‌లో కూరుకుపోయాను.

ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి కార్చిచ్చు, పొగలు లేని ప్రాంతంలో ఉంటున్న నా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలని అనుకున్నాను. ఇప్పట్లో తిరిగి ఇక్కడికి రావడానికి కొంత సమయం పట్టొచ్చు.

కానీ, తిరిగొచ్చాక ఇక్కడ ఏమీ ఉండదని తెలుసు. ఒక ఇల్లు లేదు, లైబ్రరీ లేదు, షాపుల్లేవు, థియేటర్లు లేవు, పిల్లలకు కరాటే నేర్పే సెంటర్లులేవు. అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇక్కడి నుంచి పారిపోవడానికి ముందే మరికొన్ని వస్తువులు తీసుకెళ్లినట్లయితే బాగుండేదని నాకు అనిపించింది.

కానీ, పరిస్థితులు చక్కబడతాయని, మళ్లీ ఇక్కడకు తిరిగి రావచ్చని నేను అనుకున్నాను. అందుకే నేను నా బెడ్ రూమ్‌లో తీరిగ్గా నా చెవి పోగులు అలంకరించుకుంటూ గడిపాను. ఆ చెవిపోగులు నా చెల్లి నాకు నా 30వ బర్త్ డేకు గిఫ్ట్‌గా ఇచ్చింది.

నీకు అత్యవసరమైనవేవో అవి మాత్రమే తీసుకెళ్లు అని నా మనసు చెప్పినట్లు అనిపించింది. కానీ నేను పిచ్చితనంతో నాకు ఇష్టమైన బట్టలు, చెప్ప్పులు, నగల గురించి కాసేపు ఆలోచించాను. నిజానికి అవేవీ నాకు అవసరం లేదు

మా నాన్నమ్మ రింగులు, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్లు మాత్రమే తీసుకుని మిగిలినవన్నీ ఆ మంటలకు వదిలేసి వచ్చాను.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)