SOURCE :- BBC NEWS

వక్ఫ్ సవరణ బిల్లు, ఆస్తులు, ముస్లిం సమాజం

ఫొటో సోర్స్, Getty Images

వక్ఫ్ సవరణ బిల్లు -2025 పార్లమెంటు ఆమోదం పొందింది.

కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కుల కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు బదిలీ అయింది.

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ బిల్లు ప్రకారం, వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

బిల్లుపై ఎవరేమన్నారు?

ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

”ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు” అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టుచేశారు.

ఈ కొత్త సవరించిన చట్టాన్ని సవాలు చేయడానికి అనేక ముస్లిం సంస్థలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి.

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫుజల్ అహ్మద్ ఆయుబి మాట్లాడుతూ ”వక్ఫ్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు. ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి. కానీ ప్రభుత్వ భూమిని వక్ఫ్ స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రభుత్వం చూపుతోంది” అని అన్నారు.

”అమాయకత్వంతోనో లేదా రాజకీయ కారణాల వల్లో, సభ్యుల మనసుల్లో చాలా అపోహలు ఉన్నాయి. వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు.

”ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే” అని అమిత్‌షా అన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు, ఆస్తులు, ముస్లిం సమాజం

ఫొటో సోర్స్, Getty Images

వక్ఫ్‌కు ఎంత భూమి ఉంది?

ప్రభుత్వ డేటా ప్రకారం, వక్ఫ్‌కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేల తర్వాత భారత్‌లో ఎక్కువభూములుంది వక్ఫ్‌కే. రక్షణ మంత్రిత్వ శాఖకు 17 లక్షల95వేల ఎకరాల భూమి ఉండగా, రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది.

ఈ భూమి విస్తీర్ణం కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఎక్కువ. గోవా మొత్తం వైశాల్యం 9లక్షల14 వేల ఎకరాలు (3,702 చదరపు కి.మీ).

దేశ రాజధాని దిల్లీ మొత్తం వైశాల్యం 3లక్షల 66వేల ఎకరాలు (1,484 చదరపు కి.మీ).

కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలి 1.21 లక్షల ఎకరాలలో విస్తరించి ఉండగా, చండీగఢ్ వైశాల్యం దాదాపు 28,000 ఎకరాలు.

వక్ఫ్ ఆస్తి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని షియా వర్గం నాయకుడు కల్బే జావాద్ చెప్పారు.

వేరే మతాల్లో ఇది ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నిస్తున్నారు.

”అనేక ఆలయాల్లో బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ బంగారం రిజర్వ్ బ్యాంకుకు చేరితే, డాలర్ విలువ రూపాయికి సమానం అవుతుంది. ప్రభుత్వం అలాంటి పని చేయగలదా?” అని ఆయన అడిగారు.

వక్ఫ్ సవరణ బిల్లు, ఆస్తులు, ముస్లిం సమాజం

ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులున్నాయి?

వంసి పోర్టల్ ప్రకారం, వక్ఫ్‌కు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులను గుర్తించారు. వీటిలో 97 శాతం ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

వంసి పోర్టల్ ప్రకారం, 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి సైట్‌లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 13,000 ఆస్తులు కేసుల్లో ఉన్నాయి.

మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేనిని 39శాతం మాత్రమే అని వాంసి పోర్టల్ తెలియజేస్తోంది.

దిల్లీలో దాదాపు 123 వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్‌కు తిరిగి ఇచ్చింది. దీనిపై వివాదం కొనసాగుతోంది.

వక్ఫ్‌కు బిహార్‌లో దాదాపు 8,600 ఆస్తులు ఉన్నాయి.

అయితే, ఈ గణాంకాలు 2025 లో పెరిగాయి.

ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోనే 2,32,000 వక్ఫ్ ఆస్తులున్నాయి.

ప్రస్తుత డేటా ప్రకారం, మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా స్మశాన వాటికల పేరుతో ఉంది. ఇది దాదాపు లక్షా 5వేల ఎకరాలు. మసీదుల పేరుతో లక్షా19వేల ఎకరాలు ఉంది.

ఇమామ్‌బాడ లేదా అసుర్ఖానా పేరుతో 17 వేల ఆస్తులు, మదర్సాల పేరుతో 14 వేల ఆస్తులు ఉన్నాయి. సమాధులు, దర్గాల పేరుతో దాదాపు 34 వేల ఆస్తులున్నాయి.

దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగిన 1,13,000 ఆస్తులు 92,000 ఇళ్ళు ఉన్నాయి. దాదాపు 1,40,000 ఆస్తులు వ్యవసాయ భూమి.

”1913 నుంచి 2013 వరకు, వక్ఫ్ బోర్డు మొత్తం భూమి 18 లక్షల ఎకరాలు. ఇది 2013 నుంచి 2025 మధ్య మరో 21 లక్షల ఎకరాలు పెరిగింది” అని అమిత్ షా చెప్పారు.

“ఈ 39 లక్షల ఎకరాల భూమిలో, 21 లక్షల ఎకరాల భూమి 2013 తర్వాత పెరిగింది. లీజుకు ఇచ్చిన ఆస్తులు 20 వేలు. కానీ రికార్డుల ప్రకారం, ఈ ఆస్తులు 2025లో సున్నాగా మారాయి. ఈ ఆస్తులు అమ్ముడుపోయాయి” అని అమిత్ షా తెలిపారు.

వక్ఫ్ సవరణ బిల్లు, ఆస్తులు, ముస్లిం సమాజం

ఫొటో సోర్స్, Getty Images

వక్ఫ్ అంటే?

వక్ఫ్ చట్టంలో రెండు రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది. మొదటి వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది, అంటే, అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి.

రెండవ రకం వక్ఫ్ అలాల్ ఔలాద్… అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి.

ఈ రెండవ రకం వక్ఫ్‌కు సంబంధించి కొత్త బిల్లులో నిబంధన ఉంది. ఇది మహిళల వారసత్వ హక్కును హరించకూడదు.

అలా దానం చేసిన ఆస్తి వక్ఫ్ పరిధిలోకి వచ్చిన తర్వాత, జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు.

వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి.

ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది. సంక్షేమం దీని ఉద్దేశం. అల్లా తప్ప మరెవరూ ఆ ఆస్తి యజమాని కారు. కాలేరు.

”వక్ఫ్ అనేది అరబిక్ పదం, దీని అర్థం ఉండడం. ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్ఫ్ చేసినప్పుడు, అది శాశ్వతంగా అల్లా పేరు మీద ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు” అని వక్ఫ్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ జావేద్ అహ్మద్ చెప్పారు.

‘ఒక ఆస్తి వక్ఫ్‌గా మారిన తర్వాత, అది ఎప్పటికీ వక్ఫ్‌గానే ఉంటుంది’ అని 1998 జనవరిలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.

వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరికైనా బదిలీ చేయడానికి వీలు లేదు.

ఈ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ, “ఈ సవరణ ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తి విషయంలో ఏకపక్షాన్ని అరికడుతుంది. భూ మాఫియాలతో కుమ్మక్కై వక్ఫ్ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటి అక్రమాలను అరికడుతుంది” అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఆయన అనుకూలంగా ఉన్నారు.

బుధవారం(ఏప్రిల్ 2) లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది.

కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా ఇండి కూటమి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి.

మసీదుల నిర్వహణ లేదా మతపరమైన కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS