SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 21న (సోమవారం) వాటికన్లోని కాసా శాంటా మార్టాలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈస్టర్ మండే రోజు పోప్ ఫ్రాన్సిస్ మరణించినట్లు వాటికన్ న్యూస్ వెల్లడించింది.
అనారోగ్యంతో చికిత్స తీసుకున్న తర్వాత చాలా రోజులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ప్రజలకు కనిపించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే ఆయన కన్నుమూశారు.
‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.35కు (జీఎంటీ ప్రకారం 5.35కు) ఫ్రాన్సిస్, రోమ్కు చెందిన బిషప్, తన తండ్రి స్వగృహానికి తిరిగి చేరుకున్నారు.” అని కార్డినల్ కెవిన్ ఫార్రెల్ ఓ ప్రకటనలో తెలిపారు. తన టెలిగ్రామ్ చానల్లో వాటికన్ ఈ విషయాన్ని ప్రచురించింది.
పోప్ ఫ్రాన్సిస్‌కు న్యుమోనియా సోకడంతో ఐదు వారాల పాటు చికిత్స తీసుకున్న తర్వాత గత నెలలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు పోప్ ఫ్రాన్సిస్.


ఫొటో సోర్స్, EPA
ఎంపిక ఒక సంచలనం
2013లో పోప్ బెనడిక్ట్ 16కి వారసుడిగా ఎంపికైనప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి.
రోమన్ కాథలిక్ చర్చ్‌కు నాయకత్వం వహించేందుకు ఎన్నికైన లాటిన్ అమెరికన్, తొలి జెస్యూట్( జీసస్ సమాజపు సభ్యుడు) కూడా ఆయనే.
వాటికన్‌కు 266వ పోప్‌గా ఆయన ఎన్నిక విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అప్పటికే 76 ఏళ్ల వయసున్న మారియో బెర్గోగ్లియో (ఆయన అసలు పేరు) కంటే చిన్న వయసు వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు.
పోప్‌గా ఆయన ఎన్నిక సమయంలో చర్చిలోని సంప్రదాయ వాదులు, సంస్కరణ వాదుల నుంచి విస్తృత మద్దతు పొందారు. లైంగిక విషయాలలో సనాతనవాదిగా, సామాజిక అంశాల్లో ఉదారవాదిగా ఫ్రాన్సిస్ గుర్తింపు పొందారు.
అందరికీ అందుబాటులో ఉండే ఆయన వైఖరిని ఆయన మద్దతుదారులు బాగా ఇష్టపడేవారు. వాటికన్ అధికార యంత్రాంగాన్ని సంస్కరించడం, వాటికన్ బ్యాంకులో అవినీతిని తొలగించడం, పిల్లలపై లైంగిక వేధింపుల్ని ఆపడంలో ఆయన చొరవ చర్చిలో చాలామందికి నచ్చింది.
పోప్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కాథలిక్కులు, ఇతర మత విశ్వాసులలో నిర్వహించిన సర్వేలో ఆయనకు అత్యున్నత ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. ఎక్స్‌లో ఆయనకు 18.4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.
సమస్యల్ని స్వయంగా తానే పరిష్కరించాలనే ఆలోచన ఆయనకు వాటికన్ లోపల, బయట అనేకమంది వ్యతిరేకులను కూడా తెచ్చిపెట్టింది.

ఫొటో సోర్స్, Reuters
సామాజిక విమర్శకుడు
పోప్‌గా ఆయన ఎన్నికైన తర్వాతి రోజు ఉదయం, రోమన్ చర్చిలో ప్రార్థన చేసేందుకు బయల్దేరిన ఫ్రాన్సిస్ మోటార్‌కేడ్‌లో గుర్తు తెలియని వాహనంలో ఎక్కి తప్పి పోయారని బీబీసీ రోమ్ ప్రతినిధి డేవిడ్ విల్లే చెప్పారు.
వాటికన్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇటలీ రాజధాని మధ్యలో ఉన్న ఓ హోటల్లో ప్రార్థన చేసినందుకు తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణం చెల్లించాలని పట్టుబట్టారు. అలా పోప్‌గా తన వ్యవహారశైలి ఎలా ఉంటుందో చెప్పారు.
వాటికన్ అతిథి గృహంలో శతాబ్ధ కాలంగా పోప్‌లుగా ఉన్నవారంతా ఉపయోగించే రూమీ పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌ను ఆయన పట్టించుకోలేదు. గండాల్ఫో కోటలో పోప్ వేసవి విడిదిగా ఉపయోగించుకునే నివాసానికి మారారు.
పోప్ ఫ్రాన్సిస్గా స్వేచ్ఛాయుత మార్కెట్ విధానాలను ప్రశ్నించారు. సమ లైంగికుల గురించి మాట్లాడటానికి బదులుగా వారికి క్షమాపణ చెప్పాలని అన్నారు. యూరప్‌లో వలసదారుల నిర్బంధ కేంద్రాలను నాజీల కాలంలో యుద్ధ ఖైదీలను బంధించిన క్యాంపులతో పోల్చారు.
అయితే పోప్ తన అభిప్రాయాలను ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం సరి కాదని పరిశీలకులు చెప్పారు.
“ఫ్రాన్సిస్ స్పష్టంగా సంప్రదాయ వాది” అని రోమన్ క్యాథలిక్కుల వార్తలు రాసే న్యూస్ వెబ్సైట్ క్రక్స్ ఎడిటర్ జాన్ అలెన్ 2016లో రాశారు.
“చర్చ్ అధికారిక బోధనల్లో పోప్ ఫ్రాన్సిస్ చిన్న కామాను కూడా మార్చలేదు. ప్రీస్ట్లుగా మహిళల్ని అంగీకరించలేదు. సమ లైంగికుల వివాహాలను వ్యతిరేకించారు. గర్భవిచ్చిత్తిని నేరంగా అభివర్ణించారు. జనాభా నియంత్రణను సమర్థించారు. వివాదాస్పద అంశాల విషయంలో తనను తాను చర్చ్‌కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ప్రకటించుకున్నారు” అని జాన్ అలెన్ రాశారు.
తాను ప్రత్యక్షంగా చూడకుండా కార్డినల్స్‌ను ఎంపిక చేసేవారు కాదు పోప్.

ఫొటో సోర్స్, Bergoglio family
గౌరవప్రదమైన జీవన శైలి
జార్జ్ మారియో బెర్గోగ్లియో 1936 డిసెంబర్ 17న బ్యూనస్ ఏర్స్‌లో ఒక ఇటాలియన్ కుటుంబంలో పుట్టారు. వాటికన్‌కు సమర్పించిన ఆయన జీవిత విశేషాల ప్రకారం 1969లో ఆయన జీసస్ సొసైటీ సభ్యుడిగా మారారు. అర్జెంటీనా, జర్మనీల్లో చదువుకున్నారు.
యువకుడిగా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ కారణంగా ఒక ఊపిరితిత్తిని తొలగించారు.
1992లో బిషప్ అయ్యారు. ఆ తర్వాత 1998లో బ్యూనస్ ఏర్స్‌లో ఆర్చ్ బిషప్‌గా మారారు. 2005లో కాంక్లేవ్‌లో ఆయన పోప్ పదవికి పోటీదారుగా కనిపించారు.
కార్డినల్ బెర్గోగ్లియాగా అర్జెంటీనాలో ఆయన ఉపన్యాసాలు ప్రజల మీద బలమైన ప్రభావాన్ని చూపించాయి. సామాజిక ఐక్యత గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావించేవారు. సమాజంలో కొన్ని వర్గాలను విస్మరించిన ప్రభుత్వాలను పరోక్షంగా విమర్శించారు.
ఆయన జీవన శైలి “తెలివిగా, కఠినంగా” ఉండేదని పోప్ ఫ్రాన్సిస్ జీవిత చరిత్రకు సహ రచయితగా పని చేసిన ఫ్రాన్సెస్కా అంబ్రోగెట్టి రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
వాటికన్ చర్చ్‌కు ఒక జెస్యూట్ పోప్ కావడం కొత్త విషయం. ఎందుకంటే జీసస్ సమాజ సభ్యులు మతపరమైన పదవులను చేపట్టకుండా పోప్ సేవలో ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తారు.
అర్జెంటీనాలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పరీక్షను ఎదుర్కొన్నాయి. సమ లైంగికుల వివాహాలను చట్టబద్దంగా చేసిన దేశంగా అర్జెంటీనాకు పేరుంది.
అర్జెంటీనాలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పరీక్షను ఎదుర్కొన్నాయి. క్రిస్టియానా ఫెర్నాండెజ్ డి కిచ్నెర్ అర్జెంటీనా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో జనాభా నియంత్రణ, కృత్రిమ గర్భధారణను ప్రోత్సహించారు. సమ లైంగికుల వివాహాలను చట్టబద్ధం చేశారు. అలా చేసిన తొలి లాటిన్ అమెరికన్ దేశంగా అర్జెంటీనా గుర్తింపు పొందింది.
ఫ్రాన్సిస్ దేశాభిమాని కూడా. 2016లో ఒక ప్రార్థనలో భాగంగా ఫాక్లాండ్స్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల గురించి చెబుతూ “యుద్ధంలో చనిపోయిన వాళ్ల కోసం మనం ప్రార్థిద్దాం. తన తల్లిని రక్షించడానికి వీరంతా యుద్ధక్షేత్రానికి వెళ్లారు. తమ దేశాన్ని తిరిగి దక్కించుకున్నారు” అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
జుంటా పాలనా కాలం
1976-83 మధ్య అర్జెంటీనాలో సైనిక పాలన కొనసాగింది. ఆ సమయంలో ఒక అంశం మీద ఆయన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అప్పుడు జార్జ్ మారియా బెర్గోగ్లియో జెస్యూట్ సభ్యుడు.
బ్యూనస్ ఏర్స్‌లో సామాజిక సేవ చేస్తున్న ఇద్దరు పాస్టర్లను బెర్ గోగ్లియో సైనిక ప్రభుత్వానికి అప్పగించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. వారు చేస్తున్న సామాజిక సేవను గుర్తించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం జుంటాను సంతోష పెట్టిందని బీబీసీ ప్రతినిధి వ్లాదిమిర్ హెర్నాండెజ్ చెప్పారు.
1977లో అర్జెంటీనా సైనిక పాలనలో ఓ పాపను కిడ్నాప్ చేసినప్పుడు, ఐదు నెలల గర్భవతిని హత్య చేసినప్పుడు వారి సంబంధీకులు తమకు సాయం చేయాలని కోరినా ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
సైనిక పాలనలో ఫ్రాన్సిస్ తప్పులు చేశారన్న వాదనను వాటికన్ గట్టిగా తిరస్కరించింది.
జుంటా పాలనలో హత్యకు గురైన అర్జెంటీనా పాస్టర్లను పవిత్రులుగా ప్రకటించేందుకు 2011లో పోప్ ఫ్రాన్సిస్ చర్యలు చేపట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
1976లో బ్యూనస్ ఏర్స్లోని సెయింట్ పాట్రిక్ చర్చ్‌లో హత్యకు గురైన ఐదుగురు క్యాథలిక్ చర్చ్ సభ్యులకు దైవదూత హోదా ఇచ్చేందుకు పోప్ ఫ్రాన్సిస్ ప్రతిపాదించారు.
పోప్ అభ్యర్థన మేరకు వాటికన్ చర్చ్, అర్జెంటీనా నియంతల పాలనాకాలం నాటి ఫైళ్లను బాధితులు, వారి బంధువులకు అందుబాటులోకి తెచ్చింది.
జుంటా పాలనాలో మానవ హక్కుల కోసం పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అడాల్ఫ్ పెరేజ్ ఎస్క్వేల్ను జైల్లో పెట్టి హింసించారు.
“ఆ సమయంలో కొంతమంది బిషప్‌లు సైనిక ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. అయితే వారిలో బెర్గోగ్లియో లేరు” అని బీబీసీ ప్రతినిధి ఫెర్నాండెజ్ చెప్పారు.
పోప్‌గా ఎన్నికైన వ్యక్తి చనిపోయే వరకు ఆ పదవిలో ఉండకూడదని గతంలో పోప్‌లుగా పని చేసిన అనేకమంది చెప్పారు.
ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ వద్ద ప్రస్తావించినప్పుడు ‘‘శక్తి తగ్గిపోయినప్పుడు నేను కూడా అదే చేస్తాను” అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)