SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, TelanganaCMO
తెలంగాణ విజన్ 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విజన్ డ్యాకుమెంట్‌ను విడుదల చేసింది.
హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం, 2047 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపరంగా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విజన్ డ్యాకుమెంట్ సిద్ధం చేసినట్లుగా చెబుతోంది ప్రభుత్వం.
అయితే, విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల అమలుకు నిధుల సమీకరణ ఏ విధంగా చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదని ఆర్థిక నిపుణులు అంటుండగా, ఇది విజన్ లేని డాక్యుమెంట్ అని ప్రతిపక్ష తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విమర్శించారు.

”కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్).. ఈ మూడు కార్యక్రమాల ద్వారా నిర్దేశిత లక్ష్యం సాధిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా చెప్పారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి గాంగ్‌డాంగ్ మోడల్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని, రానున్న పదేళ్లలో తెలంగాణ మోడల్‌గా చెప్పుకునేలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బీబీసీతో చెప్పారు.
”వృద్ధి అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. అది దృఢమైన ఆర్థిక పునాదిపై నిలవాలి” అని అన్నారు.

ఏమిటీ విజన్ డాక్యుమెంట్?
దానికి అనుగుణంగా రంగాలవారీగా సుస్థిరాభివృద్ధి సాధిస్తూ, లక్ష్యాలు చేరుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగా ప్రతిరంగంలోనూ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ఒక దార్శనిక పత్రం రూపొందించింది ప్రభుత్వం.
”ఈ డాక్యుమెంట్ రూపకల్పన కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 4 లక్షల మంది ఆన్‌లైన్‌లో సూచనలు ఇచ్చారు” అని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఫొటో సోర్స్, telanganarising2047.org
విజన్ డాక్యుమెంట్‌లో ఏముంది?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జీడీపీ ఎకానమీ 200 బిలియన్ డాలర్లని విజన్ డాక్యుమెంట్లో పేర్కొంది ప్రభుత్వం.
”దేశ జనాభాలో 2.5 శాతం జనాభాను పంచుకుంటున్న తెలంగాణ రాష్ట్రం, దేశ జీడీపీలో 5 శాతం పంచుకుంటోంది. ఇప్పుడు రెండింతలు చేయాలనేది లక్ష్యం” అని ప్రకటించింది.
అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే నిర్దేశిత లక్ష్యం సాధించవచ్చని చెప్పారు దువ్వూరి సుబ్బారావు.
”సంపద హైదరాబాద్‌కే పరిమితం కాకూడదు. జిల్లాలు, చిన్న పట్టణాలకూ విస్తరించాలి. ప్రతి ప్రాంతానికి నీరు, విద్యుత్, రహదారులు, నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్య కల్పించాలి” అని బీబీసీతో చెప్పారు.
అయితే, రానున్న సంవత్సరాల్లో లక్ష్యాలు చేరుకునేందుకు కీలకమైన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
”భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, డ్రైపోర్టు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని కృష్ణపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై(వయా అమరావతి) బుల్లెట్ ట్రైన్ కారిడార్, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్స్, ఔటర్ రింగు రోడ్డు – రీజినల్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లు, రీజినల్ రింగ్ రైల్వే, వ్యవసాయ భూములకు గ్రీన్ పవర్, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్, భారీగా విద్యుత్తు వాహనాల వినియోగం వంటి ప్రాజెక్టులు చేపడతాం” అని విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
ఫొటో సోర్స్, telanganarising2047.org
ఏమిటీ క్యూర్, ప్యూర్, రేర్?
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్.. అనే మూడు విభాగాలుగా విభజించడం ద్వారా లక్ష్యాలు సాధించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలిపింది.
క్యూర్: ఇందులో హైదరాబాద్‌ను హబ్‌గా చేసుకుని టెక్నాలజీ, డీప్ టెక్, ఏఐ, ఇండస్ట్రీ 4.0 సహా అడ్వాన్స్‌డ్ సర్వీసులు కల్పిస్తారు.
ప్యూర్: పెరీ అర్బన్ ప్రాంతం(హైదరాబాద్ దాటిన తర్వాతి ప్రాంతం)లో తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటవుతాయి. దీనివల్ల రూరల్, అర్బన్ ఎకానమీలను అనుసంధానం చేసేందుకు వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
రేర్: ఈ ప్రాంతం గ్రామీణ జిల్లా పరిధిలో వస్తుంది. వ్యవసాయం, పశుసంపద, మత్య్స సంపద, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఎకో టూరిజం.. రేర్ పరిధిలోకి వస్తాయి.
లక్ష్యాల సాధనకు అభివృద్ధి విస్తృతమవ్వాలని బీబీసీతో అన్నారు దువ్వూరి సుబ్బారావు.
”సేవారంగం, ఐటీ, ఔషధాల తయారీపై కీలక దృష్టి పెట్టాలి. తయారీ రంగంతోపాటు వ్యవసాయ వ్యాపారం, మొబిలిటీ, శుద్ధ ఇంధనం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోనూ విస్తృతమవ్వాలి”
”ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను కేవలం నినాదంగా కాకుండా వాస్తవికతతో అమలు చేయాలి. వేగంగా అనుమతుల జారీ, వివాదాల పరిష్కారం, సులభమైన పన్ను విధానం రావాలి” అని చెప్పారు దువ్వూరి సుబ్బారావు.
మాటలకే పరిమితం కాకుండా పనులు ఆచరణలోకి తీసుకురావడం ముఖ్యమని బీబీసీతో అన్నారాయన.
ఫొటో సోర్స్, telanganarising2047.org
ప్రజల నుంచి వచ్చిన సూచనలేంటి?
విజన్ డాక్యుమెంట్ తయారీకి ముందు ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది ప్రభుత్వం.
ఇందులో ఆసుపత్రులు, తక్కువ ఖర్చులో టెస్టులు, తాగునీరు పారిశుధ్యం, రోగాల నియంత్రణ, ఉద్యోగాల కల్పన కోర్సులు తీసుకురావడం, చిరు వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, తక్కువ దూరంలోనే పాఠశాలలు, ఆసుపత్రులు ఉండాలని సలహాలు ఇచ్చినట్లుగా విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ”వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తాం” అని పేర్కొంది.
తెలంగాణలో మున్ముందు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
”డిజిటల్, సామాజిక మౌలిక వసతుల కల్పన కీలకం. పురోగతిలో ప్రైవేట్ రంగానిది కీలకపాత్ర. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సహకారం అందించాలి” అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, telanganarising2047.org
విజన్ డాక్యుమెంట్‌లో మరికొన్ని ప్రతిపాదిత అంశాలు:
2047 నాటికి తెలంగాణలో వచ్చే మార్పులపై ప్రభుత్వం చెబుతున్న కొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు విజన్ డాక్యుమెంట్ చూడవచ్చు.
- జాతీయ రహదారుల నెటవర్క్ 4,983 కిలోమీటర్ల నుంచి 7500 కిలోమీటర్లకు పెంపు.
- రాష్ట్ర రహదారుల పరిధి 1,687 నుంచి 8,600 కిలోమీటర్లకు పెంచడం.
- మెట్రో రైల్ లేదా ఎల్ఆర్టీఎస్ లేదా బీఆర్టీఎస్ నెట్‌వర్క్ 632 కిలోమీటర్లకు చేర్చడం.
- మిల్లెట్ సాగు 3 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాలకు పెంచడం.
- ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య 13 భారత్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు.
- పది గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి.
- వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అభివృద్ధికి టీజీఐఐసీ ద్వారా పర్యవేక్షణ.
- డిజిటల్ తెలంగాణ మిషన్ అమలు.
- 2035 నాటికి పది యూనికార్న్ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం.
- రాష్ట్రవ్యాప్త సైబర్ సెక్యురిటీ గ్రిడ్ అమలు.
ఫొటో సోర్స్, telanganarising2047.org
”నిధులు, పెట్టుబడులపై స్పష్టత అవసరం”
విజన్ డాక్యుమెంట్ అమలులో నిధుల లభ్యత, పెట్టుబడుల గ్రౌండింగ్‌పై స్పష్టత ఇవ్వాలని హెచ్‌సీయూ ఎకనామిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చిట్టెడి క్రిష్ణారెడ్డి అన్నారు.
”రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆచరణలో సాధ్యమయ్యేలా నిధులను ఎలా సమీకరిస్తారు? పెట్టుబడులను మొబిలైజ్ చేయడంతో గ్రౌండింగ్ కోసం ఎలాంటి ప్రణాళిక అనుసరిస్తారన్న విషయంపై విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టత ఇవ్వాల్సింది” అని బీబీసీతో అన్నారు.
డిసెంబరు 8, 9 తేదీల్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది.
”కంపెనీల సామర్థ్యం, వాటి పనితీరు, పెట్టుబడులకు అవకాశాలపై ప్రభుత్వం సమీక్షించాలి. ఒప్పందాలు చేసుకోవడమే కాదు, వాటిని కంపెనీలు ఆచరణలో పెట్టేలా చూడాలి” అని చిట్టెడి క్రిష్ణారెడ్డి అన్నారు.
సరైన వ్యూహం, ప్రణాళిక లేకుండా విజన్ డాక్యుమెంట్ అమలు చేయాలనుకుంటే, అది విజువలైజేషన్‌కే పరిమితం అవుతుందని, రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచే ఎత్తుగడగా మారిపోతుందని చిట్టెడి క్రిష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
మరోవైపు, విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదని, దాన్ని చేరుకునే మిషన్ లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు.
‘‘అక్షరాలు, అంకెలు, రంగు రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అది’’ అని హరీశ్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రభుత్వం మాత్రం పేదరికం తగ్గించడం, వివక్ష నిర్మూలించడంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్‌లా విజన్ డాక్యుమెంట్ పనిచేస్తుందని చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







