SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Bolivian Civil Defence Vice Ministry
అమెజాన్ వర్షారణ్యంలో భారీ మొసళ్లు ఉన్న చిత్తడి నేలల్లో అత్యవసరంగా దిగిన విమానంపైన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని 36 గంటల పాటు గడిపిన ఐదుగురు వ్యక్తుల్ని స్థానిక అధికారులు రక్షించారు.
ఈ విమానం అమెజాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిందని స్థానిక అధికారులు తెలిపారు.
బొలీవియా అమెజానాస్ ప్రాంతంలో 48 గంటలుగా కనిపించకుండా పోయిన ఒక చిన్న విమానాన్ని శుక్రవారం స్థానిక మత్స్యకారులు గుర్తించారు.
స్థానిక అధికారులు రక్షించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక బాబు, 29 ఏళ్ల పైలట్ ఉన్నట్లు బెని డిపార్ట్మెంట్కు చెందిన ఎమర్జన్సీ ఆపరేషన్స్ సెంటర్ డైరెక్టర్ విల్సన్ అవిలా చెప్పారు.
సెంట్రల్ బొలీవియాలోని బెని డిపార్ట్మెంట్ రాడార్ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత గురువారం ఈ విమానాన్ని వెతికే పనిలోపడ్డారు అధికారులు.
ఇంజిన్ వైఫల్యంతో ఇటానోమాస్ నదికి సమీపంలో అత్యవసరంగా దిగాల్సి వచ్చిందని పైలట్ స్థానిక మీడియాకు చెప్పారు.
ఈ విమానం ఉత్తర బొలీవియాలోని బౌర్స్ నుంచి ట్రినిడాడ్ నగరానికి వెళుతోంది.
విమానం అకస్మాత్తుగా ఎత్తు నుంచి కిందకు పడిపోవడం ప్రారంభమైందని, అందుకే, ఒక మడుగు సమీపంలోని చిత్తడి నేలలో విమానాన్ని దించాల్సి వచ్చిందని ఆండ్రస్ వెలార్డే చెప్పారు.
చిత్తడి నేలపై విమానం దిగగానే అందులోని వారంతా విమానంపైకి ఎక్కారు. వారికి కేవలం మూడు మీటర్ల దూరంలోనే పెద్ద మొసళ్లు ఉన్నాయి.


ఫొటో సోర్స్, Beni regional Health Deaprtment/Screenshot
విమానం నుంచి లీక్ అయిన పెట్రోల్ కారణంగా మొసళ్లు తమకు దగ్గరగా వచ్చినట్లు వెలార్డే చెప్పారు. నీటిలో అనకొండను కూడా చూసినట్లు తెలిపారు.
సహాయక చర్యల కోసం కొన్ని గంటల పాటు ఎదురు చూసిన వారు, ప్రయాణికుల్లో ఒకరు తీసుకొచ్చిన పిండిని తిని కడుపు నింపుకున్నారు.
” మేం మంచినీళ్లు కూడా తాగలేకపోయాం. పెద్ద మొసళ్లు చుట్టుముట్టడంతో, మేం ఎక్కడికి వెళ్లలేకపోయాం.” అని వెలార్డే చెప్పారు.
సెంట్రల్, సౌత్ అమెరికా భారీ మొసళ్ల జాతికి చెందిన కైమన్లకు నిలయం.
విమానాన్ని గుర్తించిన మత్స్యకారులు, వెంటనే అధికారులకు తెలియజేశారు.
బాధితులను హెలికాప్టర్ ద్వారా రక్షించి, ఆస్పత్రికి తరలించారు.
విమానం కనిపించకుండా పోయిన తర్వాత ఎన్నో ఊహాగానాలు, కథనాలు వ్యక్తమైనట్లు బెని రీజియన్‌కు చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రుబెన్ టోర్రెస్ చెప్పారు.
” నేను నిజంగా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, రక్షించేందుకు అన్ని విభాగాలు కలిసి పనిచేశాయి.” అని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కు ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)