SOURCE :- BBC NEWS

వియత్నాం యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

అది 1975 ఏప్రిల్ 23.

అప్పటి అమెరికా అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్, న్యూ అర్లీన్స్‌లోని టులేన్ యూనివర్సిటీలో ప్రసంగించడానికి వేదికపైకి వచ్చారు.

అదే సమయంలో దాదాపు లక్షమంది ఉత్తర వియత్నాం సైనికులు సైగాన్‌ నగరంలో (నేటి హో చి మిన్) శివార్లలో ఉన్నారు.

అప్పటికి దశాబ్దాలుగా తూర్పు ఆసియా సంఘర్షణలో పాల్గొన్న అమెరికా, వియత్నాంతో జరిగిన యుద్ధంలో 58,000 మంది సైనికులను కోల్పోయి, ఓటమి అంచున నిలిచింది.

అధ్యక్షుడు ఫోర్డ్ తన ప్రసంగంలో “వియత్నాం యుద్ధానికి ముందు అమెరికా ఎలా ఉండేదో తిరిగి అలా మారుతుందని హామీ ఇస్తున్నా. యుద్ధం ముగిసింది, ఇపుడు తిరిగి పోరాడి దాన్ని సాధించలేం. అమెరికా గాయాలను నయం చేయడానికి, సయోధ్యను కుదుర్చుకోవడానికి సమయం వచ్చింది” అని అన్నారు.

ఏడు రోజుల తర్వాత, ఉత్తర వియత్నాం దళాలు సైగాన్‌లోని అధ్యక్ష భవనం గేటును పగలగొట్టి దానిపై కమ్యూనిస్ట్ జెండాను ఎగురవేశాయి. దీంతో, వియత్నాం యుద్ధం ముగిసింది.

ఇంతకీ ఈ యుద్ధంలో ఏం జరిగింది? అమెరికాను కుదిపేసిన ఘటనలేంటి?, అమెరికన్లే అక్కడి ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకించారు ?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అప్పటి అమెరికా అధ్యక్షుడు జెరాల్డ్ రుడాల్ఫ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో వ్యతిరేకత

సెకండ్ లెఫ్టినెంట్ ఫిల్ జోయా వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. అనేక శౌర్య పతకాలను కూడా సాధించారు.

జోయా తన ఆత్మకథ ‘డేంజర్ క్లోజ్, వియత్నాం మెమొయిర్’లో యుద్ధానికి సంబంధించిన కొన్ని ఘటనలను వివరించారు.

ఆ పుస్తకంలో “వియత్నాం యుద్ధం అమెరికన్ ప్రజల హృదయాలను తాకింది. ఇది దేశాన్ని విభజించింది. సివిల్ వార్ తర్వాత ఇలాంటి విభజన చూడలేదు. మేం దాన్నుంచి ఇంకా కోలుకోలేదు” అని రాశారు.

మరో అమెరికన్ రచయిత కార్ల్ మార్లాంటస్ తన ‘వాట్ ఇట్ ఈజ్ లైక్ టు గో టు వార్’ అనే పుస్తకంలో.. “అమెరికన్లు ఇప్పటికీ దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఏళ్లుగా మాట్లాడటం లేదు. మన కుటుంబంలో ఒక తాగుబోతు తండ్రి ఉంటే, ఆయన గురించి ఎవరితోనూ మాట్లాడలేం” అని అన్నారు.

‘వియత్నాం ఏ హిస్టరీ’ అనే పుస్తక రచయిత స్టాన్లీ కర్నోవ్.

మీరు ఎంతకాలం అమెరికన్ సైన్యంతో పోరాడుతారని ఉత్తర వియత్నాం ఆర్మీ అధిపతి జనరల్ వో న్హాన్ జాప్‌ను రచయిత స్టాన్లీ ప్రశ్నించారు. జనరల్ బదులిస్తూ “ఇరవై ఏళ్లు, బహుశా వందేళ్లు. మేం గెలిచే వరకు” అని అన్నారు.

అమెరికన్ హెలికాప్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

భారీగా హెలికాప్టర్ల వినియోగం

వియత్నాం యుద్ధం ‘ప్రపంచంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ యుద్ధం’ అని అంటుంటారు. యుద్ధ సమయంలో అమెరికన్ హెలికాప్టర్లు దాదాపు 3.6 కోట్ల సార్లు తిరిగాయి.

హెలికాప్టర్ల నుంచి శత్రు భూభాగంపై కరపత్రాలను జారవిడిచారు. యుద్ధ ప్రాంతానికి దళాలను, సామగ్రిని రవాణా చేశారు. యుద్ధ క్షేత్రంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లారు.

వియత్నాం యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

సామూహిక సమాధి

1968 మార్చిలో హ్యూ నగరాన్నితిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన సెకండ్ లెఫ్టినెంట్ ఫిల్ జోయా ‘పెర్ఫ్యూమ్ నది’ వెంబడి తన ప్లాటూన్‌తో కవాతు చేశారు.

ఆ ప్రాంతంలో వదిలివెళ్లిన శత్రువుల ఆయుధాల కోసం వారు వెతుకుతుండగా, భూమి నుంచి ఏదో బయటికి వచ్చినట్లు జోయా సహచరుడైన రూబెన్ టోర్రెస్ గమనించారు. మొదట్లో అది ఏదో చెట్టు వేరు అనుకున్నారు. కానీ, అది మనిషి మోచేయి అని తర్వాత గుర్తించారు.

అమెరికన్ సైనికులు వెంటనే అక్కడి నేలను తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపటికే, ఆ ప్రాంతమంతా కుళ్లిన మృతదేహాల వాసనతో నిండిపోయింది. వాంతులు చేసుకునేలా ఆ వాసన ఉంది.

ఫిల్ జోయా ఆ ఘటన గురించి తన ఆత్మకథలో “శత్రువు మృతదేహాలను పాతిపెట్టిన స్థలాన్ని కనుగొన్నామని మొదట్లో అనుకున్నాం. కానీ, మొదటి మృతదేహాం ఒక మహిళది. ఆమెకు తెల్లటి బ్లౌజ్, నల్ల ప్యాంటు ఉంది. ఆమె రెండు చేతులు వెనుకకు కట్టి ఉన్నాయి. ఆమెను తల వెనుక భాగంలో కాల్చి చంపారు. ఆమె పక్కన ఒక పిల్లవాడి మృతదేహం ఉంది. అతన్ని కూడా కాల్చి చంపారు” అని రాశారు.

అప్పుడే ఇవి శత్రువు మృతదేహాలు కాదని అర్థమైంది. రెండు గుంతలలో పురుషులు, మహిళలు, పిల్లలవి మొత్తంగా 123 మృతదేహాలను కనుగొన్నారు జోయా.

కొన్ని నెలల తర్వాత కెనడా, ఫిలిప్పీన్స్, అమెరికాలకు చెందిన క్యాథలిక్ మతాధికారులు, బౌద్ధ సన్యాసులు, పౌరులు, స్వచ్ఛంద సేవకులకు సంబంధించిన 2,800 మృతదేహాలున్న సామూహిక సమాధులు కనుగొన్నారు.

కాగా, హ్యూ నగరంలో పౌరులను ఎన్నడూ చంపలేదని ఉత్తర వియత్నాం ప్రభుత్వం వాదించింది. తరువాత బయటపడిన ఆధారాలు ‘ఈ హత్యలు ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్’ అని తేల్చాయి.

కొంతమందిని ప్రజలకు గుణపాఠం చెప్పడానికి బహిరంగంగా చంపగా, మరికొందరిని ఒంటరిగా తీసుకెళ్లి చంపేశారు.

సెకండ్ లెఫ్టినెంట్ ఫిల్ జోయా ఆత్మకథ

ఫొటో సోర్స్, Stackpole Books

వియత్నాం గూఢచారి తలకు గురి

అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఫోటోగ్రాఫర్ ‘ఎడ్డీ ఆడమ్స్’ వియత్నాం యుద్ధ సమయంలో సైగాన్‌ వీధుల్లో నడుస్తుండగా.. షార్ట్స్, చెక్ షర్ట్ ధరించిన ఒక వ్యక్తిని దక్షిణ వియత్నాం సైనికులు చుట్టుముట్టడం గమనించారు. అతని చేతులు వెనుకకు కట్టేశారు, అతన్ని కొట్టినట్లు కనిపించింది. ఆ వ్యక్తి పేరు గుయెన్ వాన్ లామ్. అతను నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఏజెంట్.

జియోఫ్రీ వార్డ్, కెన్ బర్న్స్‌లు రాసిన ‘ది వియత్నాం వార్ యాన్ ఇంటిమేట్ హిస్టరీ’ అనే పుస్తకంలో “వాన్ లామ్‌ను కాల్చాలంటూ దక్షిణ వియత్నాం నేషనల్ పోలీస్‌కు చెందిన గౌక్ లోన్ తన సైనికులలో ఒకరిని ఆదేశించారు. ఆ సైనికుడు కొంచెం సంకోచించడంతో, గౌక్ లోన్ స్వయంగా పిస్టల్ తీసి వాన్ లామ్ తలపై కాల్చారు” అని తెలిపారు.

ఆ సమయంలో ఏపీ ఫోటోగ్రాఫర్ ఎడ్డీ ఆడమ్స్‌తో గౌక్ లోన్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యక్తి, అతని సంబంధీకులు చాలామంది మనోళ్లను చంపారు’ అని చెప్పారు.

అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి డీన్ రస్క్

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ వాతావరణాన్ని మార్చిన ఫోటో

జనరల్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ విలేఖరుల సమావేశం వార్తలతో మరుసటి రోజు వార్తాపత్రికలు నిండిపోతాయని వైట్‌హౌస్ భావించింది. కానీ, వాన్ లామ్‌ను కాల్చుతుండగా ఆడమ్స్ తీసిన ఫోటో మొదటి పేజీలలో ప్రచురితమైంది.

ప్రొఫెసర్ శామ్యూల్ హైన్స్ ఆ ఘటనను వివరిస్తూ.. వాన్ లామ్‌ను కాలుస్తున్నపుడు ఫోటోగ్రాఫర్ చాలా దగ్గరగా నిల్చొని ఉన్నారు. అధికారి తన పిస్టల్ ట్రిగ్గర్ నొక్కిన వెంటనే, కెమెరాతో ఫోటో తీశారు.

ఫోటో చాలా స్పష్టంగా ఉంది. తల నుంచి బుల్లెట్ బయటకు వచ్చే ప్రదేశంలో ఉబ్బిపోవడం కనిపిస్తుంది. లక్షలాది మంది అమెరికన్లు ఈ ఫోటోను చూసి, మనం తప్పుడు మనుషులకు మద్దతు ఇస్తున్నామా? అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.

ఆ ఫోటో తీసి ప్రచురించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి డీన్ రస్క్ సదరు ఫోటోగ్రాఫర్‌ను విమర్శించారు .

‘ఒక చేయి కట్టివేసి ఉన్న ఖైదీని బహిరంగంగా చంపడం అంత పెద్ద విషయం కాదు, దాన్ని ఇలా చూపించాలా?’ అని రస్క్ పశ్నించారు.

ఆ తర్వాత, దక్షిణ వియత్నాం నాయకుడు ఫాన్ క్వాంగ్ తు మాట్లాడుతూ “ఆ ఫోటోకు మేం భారీ మూల్యం చెల్లించాం. ఇలాంటివి చేస్తున్న వారి కోసం మన డబ్బును ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని అమెరికన్ ప్రజలు భావించేలా చేసింది” అని తెలిపారు.

లాస్ ఏంజిల్స్ టైమ్స్‌

ఫొటో సోర్స్, LOS ANGELES TIMES

నాపామ్ బాంబులతో విధ్వంసం

దక్షిణ వియత్నాం చెందిన 21 ఏళ్ల నిక్ ఉట్ అసోసియేటెడ్ ప్రెస్‌(ఏపీ) ఫోటోగ్రాఫర్. ఆయన 1972 జూన్ 8న దక్షిణ వియత్నాం సైనికులతో హైవే నంబర్ 1పై నడుస్తున్నారు. ఈస్టర్ రోజు ఆ ప్రాంతంలో విడిది చేసిన ఉత్తర వియత్నాం సైనికులపై దాడి చేయడానికి ట్రాంగ్ బ్యాంగ్ గ్రామం వైపు వారు కదులుతున్నారు.

ఇక, నిక్ ఉట్ సైగాన్‌కు తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుండగా, పారిపోతున్న శరణార్థులపై ఒక దక్షిణ వియత్నాం విమానం బాంబులు వేయడం చూశారు. వారు వేస్తున్నవి నాపామ్ బాంబులు. అవి పెద్ద సంఖ్యలో గ్రామంపై పడుతుండటంతో ఉట్ ఫోటోలు తీయడం ప్రారంభించారు.

అప్పుడు నల్లటి పొగ మధ్య కొంతమంది పిల్లలు తనవైపు పరిగెత్తడం ఉట్ గమనించారు. వారిలో ఒక అమ్మాయి దుస్తులు కాలిపోయాయి. ఉట్ వారిని ఫోటోలు తీశారు.

ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫోటోకు పులిట్జర్ బహుమతి

“ఆ అమ్మాయి ఉట్ దగ్గరికి వచ్చి, ‘ కాలిపోతోంది, కాలిపోతోంది! సాయం చేయండి, నాకు సాయం చేయండి!’ అని వియత్నాం భాషలో అరవడం ప్రారంభించింది. అప్పటికే ఆమె వీపు కాలిపోతోంది. ఉట్ దక్షిణ వియత్నాం సైనికుడి నుంచి రెయిన్‌కోట్ తీసుకొని ఆమె శరీరాన్ని కప్పారు” అని జెఫరీ వార్డ్, కెన్ బర్న్స్‌లు రాసిన పుస్తకంలో తెలిపారు.

అక్కడున్న బీబీసీ రిపోర్టర్ ఒకరు ఆమె కోసం నీరు తీసుకురావడానికి పరిగెత్తారు. ఇక, ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూడటానికి ఏపీ డార్క్‌రూమ్‌కి వెళ్లారు ఉట్. కానీ, ఆ ఫోటోలలో చిన్నారి పూర్తిగా నగ్నంగా ఉండటంతో వాటిని ఫార్వార్డ్ చేయడానికి ఫోటో ఎడిటర్ నిరాకరించారు.

నిక్ ఉట్‌కు బాస్ అయిన హోర్స్ట్ ఫాస్ ఆ ఫోటోలను చూసి, ఫోటో ఎడిటర్‌ సూచనను పట్టించుకోకుండా న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయానికి చిత్రాలను పంపారు. నిక్ ఉట్ చిత్రం ప్రపంచంలోని అన్ని ప్రధాన వార్తాపత్రికల మొదటి పేజీలో ప్రచురితమైంది. ఆ ఫోటో ఆ సంవత్సరం పులిట్జర్ బహుమతిని కూడా గెలుచుకుంది.

ఈ ఫోటో ఎలాంటి ప్రభావం చూపిందంటే.. ఆ సమయంలో యుద్ధానికి మద్దతుగా నిలిచిన వారు కూడా ఆ పోరాటం ఆపేయాలని భావించారు.

దక్షిణ వియత్నాం

ఫొటో సోర్స్, Getty Images

హెలికాప్టర్లలో జనాలను తరలించి..

ఉత్తర వియత్నాం దళాలు 1975 ఏప్రిల్ 29న సైగాన్‌లోకి ప్రవేశించినప్పుడు, అక్కడి అమెరికా రాయబార కార్యాలయం తన సిబ్బందిని తరలించడానికి ‘ఆపరేషన్ ఫ్రీక్వెంట్ విండ్’ను ప్రారంభించింది.

తర్వాతి 18 గంటలు సముద్రంలో నిలిపి ఉంచిన విమాన వాహక నౌక, నగరానికి మధ్య 70 నేవీ హెలికాప్టర్లు నడిచాయి. అక్కడి నుంచి వెయ్యి మందికి పైగా అమెరికన్లు, వియత్నాంకు చెందిన ఆరువేల మందిని తరలించారు.

స్టాన్లీ కర్నోవ్ తన ‘వియత్నాం ఎ హిస్టరీ’ పుస్తకంలో “ఈ ఆపరేషన్ ఒక అద్భుతం. సైగాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను బస్సుల ద్వారా హెలికాప్టర్ స్థావరాలకు తీసుకెళ్లాలనేది మొదట్లో ప్రణాళిక. కానీ అది సాధ్యపడలేదు ” అని రాశారు.

“అక్కడ, తప్పించుకోవాలని వేలాదిమంది బస్సులను చుట్టుముట్టారు. ఉత్తర వియత్నాం సైన్యం త్వరలో వారిపై కాల్పులు జరపబోతోందని ఒక వదంతు కూడా అక్కడ వ్యాపించింది, ఇది వారి భయాన్ని మరింత పెంచింది” అని పుస్తకంలో తెలిపారు.

దక్షిణ వియత్నాంలో అమెరికా రాయబారి గ్రాహం మార్టిన్ తన వస్తువులను కార్యాలయం నుంచి బయటకు తరలించడంలో ఆలస్యమైంది. సైగాన్‌ నుంచి బయలుదేరే చివరి అమెరికన్ తనే కావాలని ఆయన అనుకున్నారు.

కానీ, ఉదయం C-46 హెలికాప్టర్ రాయబార కార్యాలయం పైకప్పు మీద దిగింది. అందులో అధ్యక్షుడు ఫోర్డ్ నుంచి సందేశం వచ్చింది, మార్టిన్‌ను వెంటనే సైగాన్‌ నుంచి బయలుదేరాలని ఆదేశించింది.

దక్షిణ వియత్నాం అధ్యక్ష భవనం

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్ష భవనంపై వియత్నాం జెండా

ఏప్రిల్ 30 ఉదయం నాటికి సైగాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి. అక్కడి ప్రజలు కమ్యూనిస్టుల రాక కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంతలో దక్షిణ వియత్నాం ఉపాధ్యక్షుడు ట్రాన్ వాన్ హాంగ్‌కు అధ్యక్షుడు గుయెన్ వాన్ థీయు తన అధికారాలను అప్పగించారు. జనరల్ డుయోంగ్ వాంగ్ మిన్‌కు కూడా అధికారాలను బదిలీ చేశారు. ఉత్తర వియత్నాం సైన్యం ట్యాంకర్లు అధ్యక్ష భవనం గేటును బద్దలు కొట్టి, ప్రాంగణంలోకి ప్రవేశించాయి.

ఒక సైనికుడు మెట్లు ఎక్కి అధ్యక్ష భవనం బాల్కనీలో ఎరుపు, పసుపు వియత్ కాంగ్ జెండాను ఎగురవేశారు. జనరల్ డుయోంగ్, ఆయన క్యాబినెట్ సభ్యులు నల్ల సూట్లు ధరించి, రెండో అంతస్తులోని ఒక పెద్ద గదిలో నిలబడి ఉన్నారు.

స్టాన్లీ కర్నోవ్ తన పుస్తకంలో “కల్నల్ బుయ్ టిన్ ఒక ట్యాంక్‌పై ఎక్కి అధ్యక్ష భవనం ప్రాంగణంలోకి ప్రవేశించారు. బుయ్ టిన్ గదిలోకి ప్రవేశించగానే జనరల్ డుయోంగ్ ఆయనతో.. ‘నేను మీకు అధికారాన్ని బదిలీ చేయడానికి ఉదయం నుంచి వేచి ఉన్నాను’ అని అన్నారు. కల్నల్ బుయ్ టిన్ ప్రతిస్పందిస్తూ.. ‘మీరు అధికారాన్ని బదిలీ చేసే ప్రశ్నే లేదు. మీ చేతుల్లో లేనిదాన్ని మీరు ఇవ్వలేరు అన్నారు” అని రాశారు.

ఇంతలో బయట కాల్పుల శబ్దం వినిపించింది. జనరల్ డుయోంగ్, మంత్రులు కొందరు భయంతో నేలపై పడుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ బుయ్ టిన్.. “ఈ బుల్లెట్లకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు విజయోత్సవాలను జరుపుకొంటున్నారు. మన వియత్నామీయులలో ఎవరూ ఓడిపోలేదు, ఎవరూ గెలవలేదు. అమెరికన్లు మాత్రమే ఓడిపోయారు. మీరు దేశభక్తులైతే, దీనిని సంతోషకరమైన సందర్భంగా పరిగణించండి” అని అన్నారు.

ఆ తర్వాత సైగాన్‌ పేరును ‘హో చి మిన్’ సిటీగా మార్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)