SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
మూత్రానికి వెళ్లినప్పుడు మంటగా అనిపించడం, పాదాలు, అరచేతుల్లో మంట, మొహంపై మొటిమలు, చర్మంపైన సెగ గడ్డలు, జ్వరం లేకపోయినా ఒళ్లు వెచ్చగా అనిపించడం, నోట్లో పూత వంటి వాటన్నింటినీ వాడుక భాషలో వేడి చేయడం అంటుంటారు.
అయితే ఈ వేడి అనే పదానికి సరైన మాట మెడికల్ పరిభాషలో ఉండదు. పైలక్షణాలు అన్నింటికీ వైద్య పరంగా ఒక్కోదానికి ఒక్కో కారణం ఉంటుంది.

మూత్రంలో మంట
రోజువారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ చాలా తరచుగా ఎదుర్కొనే సమస్య ఇది. నీళ్లు సరిపడా తాగకపోవడం, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది.
ఎండ ఎక్కువగా ఉన్నపుడు చెమట రూపంలో మన శరీరం నుంచి నీరు బయటకి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లో నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. విరేచనాలు, వాంతులులాంటివి అయినా ఒంట్లో నీరు తక్కువైపోతుంది. అప్పుడు కూడా మామూలు కంటే ఎక్కువ నీళ్లు తీసుకోవాలి.
కొన్ని రకాల ఆహారాలు తిన్నపుడు, ముఖ్యంగా గోధుమలు, ఓట్స్, రాగులు, సజ్జలు వంటివి తక్కువ నీళ్లతో ఉడికించి తింటే, అందులో ఉండే పీచు పదార్థం పేగుల్లో ఉండే నీటిని గ్రహిస్తుంది. అప్పుడు శరీరంలో నీళ్లు తక్కువై, మూత్రంలో మంట వస్తుంది. అందుకే రొట్టెలు తిన్నప్పుడు నీళ్లు సరిగా తాగకపోతే వేడి చేస్తుంది అంటారు.
ఎక్కువ మసాలా ఉన్న కూరలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, మాంసం వంటివి తిన్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. లేదంటే మూత్రం గాఢత పెరిగి మంట వస్తుంది.
మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మూత్రంలో మంట వస్తుంది. నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల మూత్రం సాంద్రత పెరిగి అందులో బాక్టీరియా బాగా పెరుగుతుంది.
పరిశుభ్రంగా లేని టాయిలెట్లు వాడటం, లేదా జననాంగాలు కడుక్కోవడానికి మురికి నీళ్లు ఉపయోగించడం వంటివి చేసినప్పుడు మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వస్తుంది.
కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మల విసర్జన తర్వాత శుభ్రం చేసేటప్పుడు వెనక నుంచి ముందు వైపుకు కడుగుతారు. అలాంటప్పుడు మలంలో ఉండే ఈ. కోలి క్రిములు మూత్ర నాళం దగ్గర చేరి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. అందుకే మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకకు మాత్రమే కడగాలి.
ఇన్ఫెక్షన్ ఉంటే చలి జ్వరం, వణుకు, మూత్రం వెళ్ళే దగ్గర నొప్పి, మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
పాదాలు, అరచేతుల్లో మంట
దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, చాలా మందికి రెండు కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఒకటి షుగర్ వ్యాధి. నలభై ఏళ్ల పై బడిన వారు తరచుగా కాళ్లు, చేతుల్లో మంటగా ఉంటే కచ్చితంగా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో షుగర్ ఎక్కువ ఉన్నవారికి నరాలు తొందరగా దెబ్బ తింటాయి.
రెండో కారణం, బి12 అనే విటమిన్ లోపం. ఏ వయసు వారికైనా ఈ లోపం రావొచ్చు. విటమిన్ బి12 అనేది మాంసం, చేపలు, పాలు, పెరుగు, గుడ్లలో లభిస్తుంది. పూర్తిగా శాకాహారులైన వారికి ఈ విటమిన్ తక్కువగా ఉండి, నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీరికి రెండు నుంచి నాలుగు వారాల పాటు బి12 ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. ప్రతీ రోజు బి12 సప్లిమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
బాగా నీళ్లు తాగినా పాదాలు, చేతుల్లో మంట తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
రోజూ మద్యం తాగే వారికి కూడా పాదాలు, అరచేతుల్లో మంటలు, తిమ్మిర్లు, మొద్దు బారిపోవడం వంటి ఏర్పడతాయి. వారికి బి1 లోపం, బి12 లోపం వల్ల ఇలా జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మొహంపైన మొటిమలు, చర్మంపైన సెగ గడ్డలు
డీహైడ్రేషన్ అయినపుడు చర్మం పొడిబారుతుంది. దాని వల్ల పగుళ్లు వచ్చి ఇన్ఫెక్షన్ సోకవచ్చు.
మొటిమలు, సెగగడ్డలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. రోజూ రెండుసార్లు స్నానం చేయడం, స్నానం చేశాక చర్మం పైన నూనె గానీ మాయిశ్చరైజర్ గానీ రాయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం పైన పగుళ్ళు రాకుండా ఉంటాయి.
ఎక్కువ తీపి పదార్థాలు (మామిడిపండు వంటివి) తిన్నప్పుడు ఒంట్లో షుగర్ శాతం ఎక్కువై, క్రిములు చర్మంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఒంట్లో రోగనిరోధక శక్తి బాగుంటే కొన్ని రోజుల్లో వాటికవే తగ్గిపోతాయి. తక్కువగా ఉన్నవారికి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తరచూ ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే వారు తీపి పదార్థాలు తక్కువగా తినాల్సి ఉంటుంది, షుగర్ పరీక్ష కూడా చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
జ్వరం లేకపోయినా శరీరం వెచ్చగా అనిపించడం
డీహైడ్రేషన్ అయినపుడు, ఒంట్లో నీరు తక్కువైపోయినపుడు, ఎండలో ఎక్కువసేపు ఉన్నపుడు శరీరం వేడెక్కుతుంది.
మామూలుగా అయితే చెమటలు పట్టి శరీరం చల్లబడాలి. కానీ వాతావరణం చాలా వేడిగా ఉంటే, శరీరం హీట్ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయి చెమట పట్టదు.
అలాంటపుడు శరీరం వేడిగా అవుతుంది. అలాంటి సందర్భాల్లో వెంటనే శరీరాన్ని చల్లార్చాలి. చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి తడిగుడ్డతో ఒళ్లు తుడవాలి.
సరిపడా నీళ్లు తాగించాలి. మనిషి మాట్లాడలేని స్థితిలో ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
నోటి పూత
ఇది బి2 అనే విటమిన్ తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరల్లో రిబోఫ్లావిన్ (బి2) ఎక్కువగా ఉంటుంది. నోటి పూత ఉంటే కనీసం 4-5 రోజులు బి2 మాత్ర వేసుకోవాలి. నిద్రలేమి, స్ట్రెస్ వల్ల కూడా నోటి పూత వస్తుంది.
రోజూ కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలి. ఎండా కాలంలో రోజుకి కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అన్ని రకాల ఆహారాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, నూనె లేదా నెయ్యి, గోధుమలు, ముడి బియ్యం, రాగులు, జొన్నలు రిఫైన్ చేయకుండా ఉన్న విధంగా వాడటం మంచిది.
పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. రోజుకి కనీసం 7- 8 గంటలు నిద్ర పోవాలి. కనీసం అరగంట వ్యాయామం చేయాలి. కూల్ డ్రింకులు, మద్యం అసలు తాగకూడదు.
టీ, కాఫీలు తగ్గించాలి. ఎక్కువ సేపు మూత్రాన్ని ఉగ్గబట్టి ఉంచకూడదు. ప్రయాణంలో ఉన్నపుడు, ఆఫీసులో, స్కూళ్ళలో, కాలేజీలలో, ఎక్కువసేపు మూత్రానికి వెళ్లకుండా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేడి లక్షణాలను అధిగమించవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)