SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
అర్ధరాత్రి 2.30 గంటలప్పుడు(తెల్లవారితే గురువారం) తన ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తిని అడ్డుకునేందుకు సైఫ్ అలీఖాన్ ప్రయత్నించగా, ఆ దుండగుడు కత్తితో దాడి చేశాడని పోలీసులు చెప్పారు.
నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సైఫ్ శరీరంపై 6 కత్తి గాట్లు ఉన్నాయని, అందులో రెండు లోతుగా దిగాయని, ఆయనకు దాదాపు 5 గంటలపాటు శస్త్రచికిత్స జరిగిందని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు. సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
సైఫ్ అలీఖాన్
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులపై వరుసగా దాడులు జరుగుతుండంతో శాంతిభద్రతలపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తులు నివాసం ఉండే ముంబయిలోని బాంద్రాలో ఈ మధ్య కాలంలో జరిగిన దాడులు, బెదిరింపులు వంటి ఘటనలను కొందరు ప్రస్తావిస్తున్నారు.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసిన ఘటన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. ప్రజలకు భద్రత కల్పించడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయని విమర్శించారు.
కొన్ని నెలల కిందటే మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారని, దేశంలోని ఇంతపెద్ద సెలబ్రిటీలకే బీజేపీ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబయిలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
మరికొందరు ఎంపీలు, నేతలు కూడా ఈ దాడిపై స్పందించారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడికి కారణమేంటి? అసలేం జరిగింది? అన్న పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.
సల్మాన్ ఖాన్
ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులపై దాడులు లేదా బెదిరింపులకు సంబంధించిన వార్తలు చాలా వచ్చాయి.
ఇటీవల ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి కిటికీలకు బుల్లెట్‌ఫ్రూఫింగ్ చేసినట్టు చూపుతున్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు కథనాలు వచ్చాయి.
గత ఏడాది అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్ బెదిరించిందని, రూ.5 కోట్లు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తి డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి.
అంతకముందు 2024 ఏప్రిల్‌లో ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయీ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది.
వాస్తవానికి, బిష్ణోయీ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ బెదిరింపు 1998 నాటి కేసుకు సంబంధించినది. సల్మాన్ ఖాన్ ఒక సినిమా షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సమీపంలో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన 2018లో జైలుకు వెళ్లి వచ్చారు.
కృష్ణ జింకల వేటాడిన సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయీ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుందని పోలీసులు చెప్పారు.
రాజస్థాన్‌లోని బిష్ణోయీ కమ్యూనిటికి చెందిన ప్రజలు కృష్ణ జింకలను పూజిస్తారు.
కంగనా రనౌత్
గత ఏడాది జూన్‌లో మొహాలీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ తన చెంప మీద కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు.
రైతుల ఉద్యమ సమయంలో కంగనా చేసిన ప్రకటనలు తనకు ఆగ్రహం తెప్పించాయని దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్వీందర్ కౌర్ అనే ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి గెలిచిన కంగనా రనౌత్.. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.
2020 డిసెంబర్లో, 88 ఏళ్ల మహిళా రైతు మహిందర్ కౌర్ మీద బీబీసీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. వంగిన నడముతోనూ మహిందర్ కౌర్ పంజాబ్ రైతులతో కలిసి జెండాను పట్టుకుని కవాతు చేస్తూ అందులో కనిపిస్తారు.
బీబీసీ పోస్ట్ చేసిన మహిందర్ కౌర్ చిత్రాన్ని దిల్లీలోని షహీన్ బాగ్ ధర్నాల్లో పాల్గొన్న బిల్కిస్ దాదీతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి.
ఆ సమయంలో, కంగనా రనౌత్ బిల్కిస్ దాదీ, మహిందర్ కౌర్ కలిసి ఉన్న ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ కామెంట్లు చేశారు.
“టైమ్ మ్యాగజీన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్న ఈ బామ్మ, ఇప్పుడు వంద రూపాయల కోసం ఉద్యమానికి అందుబాటులో ఉన్నారు” అంటూ కామెంట్ చేశారు.
కంగనా చేసిన ఈ ప్రకటన వల్ల తనకు కోపం వచ్చిందని, తన తల్లి కూడా రైతుల ఉద్యమంలో పాల్గొన్నారని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెప్పారు.
బాబా సిద్ధిఖీ హత్య
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న హత్యకు గురయ్యారు.
ఈ ఘటన కూడా ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోనే జరిగింది.
బాబా సిద్దిఖీ రాజకీయ నేత అయినప్పటికీ, బాలీవుడ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలుండేవి. షారూఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య అభిప్రాయభేదాలను తొలగించి సయోధ్య కుదర్చడంలో బాబా సిద్ధిఖీ కీలకపాత్ర పోషించారని చెప్తారు.
సిద్ధిఖీ హత్య కేసులో నిందితులకు లారెన్స్ బిష్ణోయీ గ్యాంగ్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)