SOURCE :- BBC NEWS
18 నిమిషాలు క్రితం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలో ఉన్న లేబర్ క్యాంపులో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లేబర్ క్యాంప్‌లోని చెట్ల పొదల్లో దాక్కున్న నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
‘‘ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశాం. అతడి పేరు మొహమ్మద్ ఇస్లామ్ షెహజద్. వయసు 30 ఏళ్లు. దొంగతనం చేసేందుకు అతడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతాం. అతడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతాం. అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తేమోననే అనుమానం ఉంది. అతని వద్ద సరైన పత్రాలు లేవు’’ అని ముంబయి జోన్ 9 డీసీపీ దీక్షిత్ చెప్పారు.
దొరికిపోతాననే భయంతో నిందితుడు మొదట తన పేరు ‘విజయ్ దాస్’ అని చెప్పాడని పోలీసులు చెప్పారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది తానేనని అతడు అంగీకరించాడని ముంబయి పోలీసులు చెప్పారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
నిందితుడు థానేలోని ‘రికీస్ బార్’లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
విచారణ కోసం నిందితుడిని తెల్లవారుజామున 3.30 గంటలకు బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు బాంద్రా హాలిడే కోర్టులో హాజరుపరచనున్నారు.
20 పోలీసు బృందాలతో గాలించి..
గురువారం (జనవరి 16) తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ వ్యక్తిచొరబడి, కత్తితో దాడి చేశాడని పోలీసులు ప్రాథమికంగా చెప్పారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు.
ముంబయిలోని పలు ప్రాంతాల నుంచి 15 మందికి పైగా అనుమానితులను బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన నిందితుడి ఫోటోను చూపించి అనుమానితులను ప్రశ్నించారు.
ఇతర ప్రాంతాల్లోనూ మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
సైఫ్ అలీఖాన్ నివాస భవనంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో పోలీసులకు అనేక ఆధారాలు లభించాయని, తొందరలోనే నిందితుడిని పట్టుకుంటారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
చివరికి, థానేలోని లేబర్ క్యాంపులో అసలు నిందితుడు ఉన్నాడని గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.
సైఫ్ ఎలా ఉన్నారు?
సైఫ్ అలీ ఖాన్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన శరీరంపై 6 కత్తి గాట్లు పడ్డాయని, అందులో రెండు లోతుగా దిగాయని, దాదాపు 5 గంటలపాటు శస్త్రచికిత్స జరిగిందని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు.
సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తులు నివాసం ఉండే ముంబయిలోని బాంద్రాలో ఈ దాడి జరగడం సంచలనంగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)