SOURCE :- BBC NEWS
హైదరాబాద్ అంతరిక్షానికి ఎదుగుతోంది. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. హైదరాబాద్ అంటే అందరూ ఐటీ, ఫార్మా గురించే చెబుతారు.
అయితే ఈ రెండు రంగాలతో పాటు రక్షణ, ఎలక్ట్రానిక్స్, విమానయాన రంగాలకు సంబంధించి కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు హైదరాబాద్ కేంద్రం.
రక్షణ – విమానయాన రంగాల్లో అటు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి ఎయిర్ వార్ఫేర్ కాలేజీ నుంచి, డీఆర్డీఎల్, బీడీఎల్ వరకూ ఎన్నో సంస్థలకు కేంద్రమైన ఈ నగరం ఇప్పుడు అంతరిక్ష రంగంలో కూడా వేగంగా దూసుకుపోతుంది.
తాజాగా జరుగుతోన్న స్పేడెక్స్ ప్రయోగంలో కూడా హైదరాబాద్ కి చెందిన సంస్థల పాత్ర ఉంది. ఎన్ స్పేస్ టెక్, అనంత్ టెక్నాలజీస్ స్పేడెక్స్ ప్రయోగంలో పాలు పంచుకున్నాయి.
”ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో ఎన్ స్పేస్‌టెక్ సంస్థ భాగస్వామి అయింది. ఈ సంస్థ స్వేచ్ఛ శాట్ వీ0 (SwetchaSAT-V0) సొంతంగా తయారు చేసింది. పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యుల్లో భాగంగా ఇస్రో స్వేచ్ఛ శాట్‌ను కూడా అంతరిక్షంలోకి పంపించింది. స్వేచ్ఛ శాట్ వీ0 ప్రయోగం విజయవంతం కావడం పెద్ద ముందడుగు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్‌లో మనం మరింత చొచ్చుకెళ్లడంలో ఇదొక పెద్ద మలుపు.” అని ఎన్ స్పేస్‌టెక్ సంస్థ సీఈవో దివ్య బీబీసీతో చెప్పారు.
కొత్తమాసు దివ్య, కొత్తమాసు రఘురామ్ 2020లో ఎన్ స్పేస్‌టెక్ సంస్థను ప్రారంభించారు.
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ శాటిలైట్ కమ్యూనికేషన్, స్పేస్ సొల్యూషన్లపై పని చేస్తోంది.
ఇక నగరానికి చెందిన అనంత్ టెక్నాలజీస్ సంస్థ కూడా స్పేడెక్స్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌లో అనంత్ టెక్నాలజీస్ క్రియాశీలకంగా వ్యవహరించింది. దాంతో పాటూ పీఎస్ఎల్వీ సీ60 కి సంబంధించిన కీలక అంశాలలో కూడా అనంత్ టెక్నాలజీస్ పాత్ర ఉంది.
1992లో ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా. పావులూరి సుబ్బారావు ప్రారంభించిన అనంత్ టెక్నాలజీస్ ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇక 2022 నవంబరులో మరో అరుదైన ఘట్టం రికార్డు అయింది.
హైదరాబాద్‌కి చెందిన స్కైరూట్ తయారు చేసిన విక్రమ్ ఎస్ అనే మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది.
అదే సమయంలో ధ్రువ్ స్పేస్ సంస్థ రెండు నానో శాటిలైట్లను స్పేస్‌లో ప్రవేశపెట్టింది.
అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనల విషయంలో మొదటి నుంచి బెంగళూరు కేంద్రంగా ఉంది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండడం దీనికి ప్రధాన కారణం.
బెంగళూరుతో పాటు తిరువనంతపురం, ఇతర భారతీయ నగరాల్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు పని చేస్తున్నాయి.
అయితే కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ కంపెనీల సంఖ్య పెరుగుతోంది.
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సంస్థల స్థాపనకు మొదటి నుంచి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో పాటు టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ విస్తరణ కొత్త సంస్థలు నగరానికి వచ్చేందుకు బాటలు వేసిందంటున్నారు అధికారులు.
”1960ల నుంచే హైదరాబాద్ లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువగా ఏర్పాటు చేసినప్పటికీ, ప్రైవేటు పెట్టుబడులను అనుమతించగానే, పెద్ద సంఖ్యలో ప్రైవేటు సంస్థలు రావడం మొదలైంది. ఈ రంగంలో హైదరాబాద్ సంస్థలు పయనీర్ స్థాయికి వెళ్లాయి.” అని సీనియర్ ఐఎఎస్ అధికారి జయేశ్ రంజన్ బీబీసీతో చెప్పారు .
అనంత్ టెక్నాలజీస్, ధ్రువ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్, ఎన్ స్పేస్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ ఇలా ఎన్నో సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా శాటిలైట్లు, రాకెట్లకు సంబంధించిన కాంపొనెంట్లు, ఇతర టెక్నికల్ భాగాలు లేదా ప్రోగ్రాములు చేసే సంస్థలు పెరుగుతున్నాయి.
వాటిల్లో స్టార్టప్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
”అంతరిక్ష వ్యవహారాలు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్ నగరానికి చెందిన ఎంఎస్ఎంఈలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కీలకమైన భాగాలను, డిజైన్ చేయడం, ప్రోగ్రామింగ్ చెయ్యడం, తయారు చెయ్యడం వంటి పనుల్లో ఉండేవి. ఆ మాటకొస్తే, మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్)లో దాదాపు 30 శాతం పనులు హైదరాబాద్ కి చెందిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలే చేశాయి.” అని జయేశ్ రంజన్ బీబీసీతో అన్నారు.
హైదరాబాద్‌లో ఐటీతో పాటు ఇతర విభాగాల్లో స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావణం ఉండటం కొత్త సంస్థలకు కలసివచ్చే అంశమని ఆయన చెప్పారు.
అలాగే ఏరోనాటికల్, ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీలకు సంబంధించిన పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ఉండడం కలసి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
వాటికి ఐటీ రంగంతో కూడా బాగా పని ఉంటుంది.
ఇవన్నీ కలసి ఇక్కడ సరికొత్త ఏరోస్పేస్ ఎకో సిస్టంను వృద్ధి చేస్తున్నాయి.
”ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు రక్షణ-ఏరోస్పేస్ రంగంలో ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన ఎకో సిస్టం ఉంది.” అని తెలంగాణ ప్రభుత్వం తరపున డిఫెన్స్, ఏరోస్పెస్ వ్యవహారాలు చూస్తున్న పీఏ ప్రవీణ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)