SOURCE :- BBC NEWS
స్వామి వివేకానంద ప్రస్తావన ఎక్కడ వచ్చినా షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగం గుర్తొస్తుంది.
1893 సెప్టెంబర్ 11న జరిగిన ఆ సదస్సులో భారత దేశపు సంస్కృతిని స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం చేశారు.
అమెరికా ప్రయాణానికి ముందు వివేకానంద భారతదేశంలోనూ అనేక నగరాాల్లో పర్యటించారు.
నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన వివేకానంద, భారతీయ సంస్కృతిని పశ్చిమ దేశాలకు పరిచయం చేయాలని ఇక్కడే నిర్ణయించుకున్నారు.
షికాగో వెళ్లడానికి ముందు..
1863 జనవరి12 కోల్‌కతాలో జన్మించిన నరేంద్రనాథ్, చాలా చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాత స్వామి వివేకాందగా మారారు.
వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస నైతిక ఆధ్యాత్మికత, నిరాడంబరతకు పెట్టింది పేరు. తన సందేశం ప్రపంచం మొత్తానికి వివేకానంద ద్వారా చేరాలని రామకృష్ణ భావించేవారు.
అయితే, 1886లో రామకృష్ణ ఆరోగ్యం చాలా వేగంగా విషమించడం మొదలైంది. ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది. అప్పుడే తన శిష్యులను పిలిచి వివేకానంద తన వారసుడని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత 1886, ఆగస్టు 16న రామకృష్ణ మహాసమాధిలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత రామకృష్ణ మిషన్‌ను వివేకానంద ఏర్పాటుచేశారు.
1902 జూలై 4వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని బేలూరులోని రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు.
1984వ సంవత్సరం నుంచి ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ప్రపంచం మొత్తాన్ని చుట్టిరావాలని ఒకసారి వివేకానంద భావించారు . అప్పటికి రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటు చేయలేదు.
మొదట ఆయన వారణాసి , సారనాథ్ వెళ్లారు. అక్కడి నుంచి అయోధ్య, లఖ్‌నవూ మీదుగా ఆగ్రా చేరుకున్నారు. ఆ తర్వాత బొంబాయి( ప్రస్తుత ముంబయి) అక్కడి నుంచి ఆయన పుణె, బెంగళూరు వెళ్లారు
1892 నవంబర్ లో మైసూరుకు చేరుకున్నారు. మైసూరు మహారాజా అతిథిగా అక్కడ కొన్ని రోజులు బస చేశారు.
ఒకరోజు వారిద్దరి మధ్య సంభాషణ సందర్భంగా, అమెరికాకు వెళ్లి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉందని మహారాజాతో స్వామీజీ అన్నారు.
వెంటనే అమెరికా పర్యటకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ తానే భరిస్తానని మహారాజా చెప్పారు. మొదట దానికి వివేకానంద అంగీకరించలేదు.
కానీ, కొన్ని రోజుల తర్వాత ఒప్పుకున్నారు.
హైదరాబాదుకు వివేకానంద
1892 డిసెంబర్‌లో స్వామి వివేకానంద మద్రాస్ ప్రెసిడెన్సీకి చేరుకున్నారు.
అప్పుడే కన్యాకుమారి చేరుకుని మూడు రోజుల పాటు సముద్రం ఒడ్డున ఉన్న శిలపై ధ్యానం చేశారు. (దీనికి తర్వాతి కాలంలో వివేకానంద రాక్ మెమోరియల్ అని పేరు పెట్టారు)
వివేకానంద దక్షిణాది పర్యటన గురించి తమ స్నేహితులు, బంధువుల ద్వారా తెలుసుకున్న కొందరు ఆయన్ను హైదరాబాదు రావాలని ఆహ్వానించారు.
1893 ఫిబ్రవరి 11న స్వామి వివేకానంద హైదరాబాద్ వచ్చారు.
ఆ రోజు ఉదయం, వివేకానందుడిని స్వాగతించడానికి చాలామంది రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా స్వామిని కోరారని, ‘ది లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద బై హిజ్ ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ డిసైపుల్స్’ అనే పుస్తకంలో ఉంది. ఈ జీవిత చరిత్రను ఆయన శిష్యులు రాశారు.
ఈ విషయాలను మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద బీబీసీతో చెప్పారు.
అయితే ఈ పర్యటనకు సంబంధించి ఫోటోలు అందుబాటులో లేవన్నారు.
“1893లో స్వామి వివేకానంద హైదరాబాద్-సికింద్రాబాద్‌ను సందర్శించినప్పుడు, ఆయన అంత ఫేమస్ పర్సన్ కాదు. 1897లో పశ్చిమ దేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన తర్వాత ఆయన గురించి అందరికీ తెలిసింది” అని బోధమయానంద అన్నారు.
సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాలలో ప్రసంగం
హైదరాబాద్‌లో స్వామి వివేకానంద నిజాం ప్రభుత్వంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బాబు మధుసూదన్ ఛటర్జీ వద్ద స్వామి వివేకానంద బస చేశారు.
మరుసటి రోజు నిజాంకు వ్యక్తిగత సెక్రటరీ, బావమరిది కూడా అయిన సర్ ఖుర్షీద్ జా స్వామిని కలిసి దాదాపు రెండు గంటల పాటు చర్చించారని, నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలైన గోల్కొండ, చార్మినార్‌లను వివేకానంద దర్శించారని ఆ పుస్తకంలో ఉంది.
ఈ పుస్తకం ప్రకారం “ఫిబ్రవరి 13 ఉపన్యాసం ఇస్తానని స్వామి వివేకానంద అన్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్ ప్రధాన మంత్రి సర్ అస్మన్ జా సహా, చాలామంది ప్రముఖులను స్వామి వివేకానంద కలిశారు.”
మహబూబ్ కళాశాలలో ‘మై మిషన్ టు ది వెస్ట్’ అనే ప్రసంగం చేశారు.
వెయ్యిమందికి పైగా ఈ ఉపన్యాసం వినడానికి వచ్చారు. ఇందులో అనేకమంది యూరోపియన్లు కూడా ఉన్నారు. వేదాలు, వేదాంతాల వైభవాన్ని ప్రపంచానికి తప్పకుండా తెలపడానికి భారతదేశం నుండి పశ్చిమ దేశాలకు మిషనరీగా వెళతానని ఆ సభలోనే ఆయన ప్రకటించారు.
“మా కాలేజికి స్వామి వివేకానంద వచ్చారని తెలిసి ఇప్పటికీ స్వామిజీలు ఇక్కడకు వస్తారు. అప్పట్లో ఆయన గ్రౌండ్‌లో ప్రసంగించారు. ఇప్పుడు అక్కడ హాలు ఉంది. వివేకానంద హైదరాబాద్‌లో ప్రసంగించిన రోజును స్మరిస్తూ 2023లో ఆ హాలులో ఒక వేడుక కూడా జరుపుకున్నాం” అని మహబూబ్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)