SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద అగ్నిప్రమాదం తర్వాత భవనాల ఫైర్ సేఫ్టీ అంశం చర్చకు దారి తీసింది.
అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే మార్గం ఉండటంతో లోపలున్న బాధితులు తప్పించుకునే వీలు లేకుండా పోయిందని అగ్ని మాపక శాఖాధికారులు గుర్తించారు.
‘‘ఆ దారి చాలా ఇరుకుగా ఉంది’’ అని తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి చెప్పారు.
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
”ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలి. భవిష్యత్తులో ఈ తరహా దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి” అని సీఎం ఆదేశాలలో ఉంది.
పాతబస్తీ సహా నగరంలో పలు బస్తీలు, కీలక ప్రాంతాల్లో వీధులు చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం.
వారం రోజుల కిందట మహారాజ్ గంజ్ ప్రాంతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అగ్నిమాపక శాఖాధికారులు 8 మందిని అతి కష్టమ్మీద రక్షించారు.


పాత భవనాలతో ప్రధాన సమస్య
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.50 లక్షల నివాస భవనాలు ఉన్నట్లు అంచనా.
నివాస భవనాలకు ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తూ ఉండాలి.
15 మీటర్ల ఎత్తున్న భవనాలకు జీహెచ్ఎంసీ, 15 మీటర్లు దాటిన భవనాలకు అగ్నిమాపక శాఖ తరఫున ఈ ఆడిట్ జరుగుతుంది. అనుమతుల విషయంలోనూ ఇదే విధానం పాటిస్తుంటారు.
భవన నిర్మాణానికి అనుమతి తీసుకునే ముందు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్వోసీ ( నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి లేకుండా నిర్మాణ అనుమతులు జారీచేయడానికి వీలుండదు.
అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో పదేళ్ల కిందట నిర్మించిన భవనాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండానే భవనాలు కట్టేశారన్న విమర్శలున్నాయి.
ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగితే, భవనాల భద్రతను పర్యవేక్షించే వీలుంటుంది. ఇది సకాలంలో జరగకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది.
”తగినంత సిబ్బంది లేరు. ఉన్న సిబ్బంది, అధికారులతో అన్ని భవనాలనూ తనిఖీ చేయడం వీలు కావట్లేదు” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఆడిట్ బాధ్యత ఎవరిది?
జీహెచ్ఎంసీ తరఫున జరగాల్సిన ఫైర్ సేఫ్టీ ఆడిట్ కూడా దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయింది.
జీహెచ్ఎంసీకి అనుబంధంగా ఉండే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గతంలో ఈ బాధ్యతను నిర్వహిస్తుండేది.
కొత్త ప్రభుత్వం ఈవీడీఎం కు బదులుగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని తీసుకువచ్చింది.
ఈ ఏజెన్సీకి సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇన్నాళ్లూ ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేపట్టలేదని అధికారులు చెబుతున్నారు.
ఈవీడీఎం లేకపోవడంతో జీహెచ్ఎంసీ కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టలేదు.
భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేకపోతే ప్రస్తుతం నోటీసులకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టంలో మార్పులు తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నం చేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
”అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేకపోతే భవనాన్ని సీజ్ చేసే అధికారం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం లేదు. అలా అధికారం పొందేలా చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తున్నాం” అని బీబీసీతో చెప్పారు రంగనాథ్.

ఇరుకు వీధులు.. చుట్టూ భవనాలు
పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన భవనం చుట్టూ అనేక బిల్డింగులు ఉన్నాయి. లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే మార్గం ఉంది.
గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అంచనా వేస్తోంది.
ఫైరింజన్ లోపలకు వెళ్లేందుకు గాని, భవనం చుట్టూ తిరిగేందుకు గానీ అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో నలుగుర్ని కాపాడినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డి చెప్పారు. భవనంపైకి చేరుకుని అక్కడి నుంచి రెండో అంతస్తులో ఉన్న వారిని కాపాడామని ఆయన అన్నారు.
కేవలం ఈ భవనం మాత్రమే కాదు, చార్మినార్ చుట్టుపక్కల పాతబస్తీలోని చాలా వరకు భవనాలు ఇరుకు వీధుల్లో కనిపిస్తుంటాయి. ఫైరింజన్లు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
అగ్ని ప్రమాదాలు జరిగితే కేవలం ప్రధాన రహదారిలో భవనం ఉంటే, అటువైపు నుంచి మంటలు ఆర్పేందుకు వీలుంటుంది. భవనాలన్నీ పురాతనమైనవి కావడంతో ఇలాంటి సౌకర్యం లేదని అధికారులు చెబుతున్నారు.
”అవన్నీ నిజాం కాలం నుంచి ఉన్న భవనాలు. అప్పట్నుంచే కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాలు నిర్మించుకుని ఉంటున్నారు. కొత్తగా తీసుకున్న అనుమతులు కావు” అని బీబీసీతో చెప్పారు నాగిరెడ్డి.

ఫొటో సోర్స్, Getty Images
జాగ్రత్తలు తప్పనిసరి
భవనాలు నిర్మించే సమయంలోనే అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఎత్తైన భవనాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇతరత్రా ఏర్పాట్లు ఉన్నాయా, లేవా అనే విషయంపైనే అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, ప్రమాదం జరిగితే తప్పించుకునేలా ఏర్పాట్లు ఉండాలని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.జనార్దన్ యాదవ్ అన్నారు.
”మేం అధ్యయనం చేయడానికి వెళ్లినప్పుడు మెట్ల మార్గాలు బ్లాక్ చేసి ఉండడం గమనించాం. ఎలివేటర్ ఉందన్న ఉద్దేశంతో మెట్ల మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అది సరికాదు” అని బీబీసీతో చెప్పారు ప్రొఫెసర్ జనార్దన్.
అత్యవసర సమయాలలో తప్పించుకునేందుకు వీలుగా భవనాలకు అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
”ఫైర్ లేదా స్మోక్ అలారం ఏర్పాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు పెట్టుకోవాలి. Co2 సిలిండర్లను ఉంచుకోవడమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుని ఉండాలి” అని జనార్దన్ యాదవ్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)